ఘోస్ట్‌ విలేజ్‌ కుల్‌ధారా

9 Mar, 2017 23:17 IST|Sakshi
ఘోస్ట్‌ విలేజ్‌ కుల్‌ధారా

ఊరినిండా మనుషులు ఉంటారు. అలా మనుషులు ఉంటేనే మనం దాన్ని ఊరు అంటాం. కానీ ఊరునిండా దెయ్యాలు ఉన్న సంగతి మీరెప్పుడైనా విన్నారా? అవును ఆ ఊరంతా దెయ్యాలే ఉన్నాయి. అక్కడ చూడటానికి మనుషులు ఎవరూ కనపడరు. ఖాళీ ఇళ్లు, పెద్ద పెద్ద పాడుబడ్డ గోడలు... ఆ ఊళ్లో దర్శనమిస్తాయి. సాధారణంగా ఇలాంటి సన్నివేశాలు మనం కేవలం సినిమాల్లో మాత్రమే చూస్తుంటాం కదా.....! సినిమాలనే తలదన్నే విధంగా ఉండే ఈ నిజజీవిత కథను మీరూ తెలుసుకోండి.

అజయ్, సురేంద్రలు ఇద్దరు స్నేహితుడి పెళ్లికోసం జైసల్మేర్‌ బయలుదేరారు. కొంచెం దూరం ప్రయాణించాక రాత్రి 8 గంటలకు హైవే పక్కనున్న దాబాలో భోంచేసి మరల ప్రయాణాన్ని మొదలుపెట్టారు. అప్పుడు రాత్రి 11 గంటలు కావస్తోంది. కారులో ఎంచక్కా పాటలు పెట్టుకుని ఎంజాయ్‌ చేస్తూ వెళుతున్న వారు దారితప్పారు. కొంచెం దూరం వెళ్లాక ఒక ముసలావిడ కనిపించడంతో దారి చెప్పమని అడిగారు. ఆమె చెప్పిన దారి గుండా కొద్ది దూరం వెళ్లాక గ్రామ ముఖద్వారం కనపడింది. గ్రామంలోకి ప్రవేశించి కారును ముందుకు నడుపుతున్నాడు అజయ్‌. కానీ అక్కడ ఎవరూ మనషులు ఉండేలా అనిపించలేదు వారికి. అక్కడ అన్ని పాడుబడ్డ బంగాళాలు, దుమ్ము, ధూళితో నిండి ఉన్నాయి. అనుమానం వచ్చి ఇద్దరు కారు దిగారు. వెనుకవైపు నుంచి ఎవరో వస్తున్నట్లు అలికిడి వినబడగానే తిరిగి చూశారు. ఒక పాతికేళ్ల మహిళ నీళ్లు మోసుకుంటూ వెళుతోంది.

ఆమెను పలకరించిన ఉలూకూ పలుకూ లేకుండా పక్కనే ఉన్న సందులోకి వెళ్లింది. ఆమెను అనుసరించిన అజయ్, సురేంద్రలకు ఆ మహిళ మళ్లీ కనపడలేదు. ఎక్కడికి వెళ్లిందా అని ఆమెకోసం వెతుకుతుండగానే వారికి చిన్నగా ఏడుపు వినిపించింది. అది కాస్త పెద్దగా అయి భరించలేనంత శబ్దంతో మహిళ ఏడుస్తోంది. తీవ్ర భయానికి లోనైన వారు కారు వద్దకు పరుగెత్తుకొచ్చారు. కారులో కూర్చొని స్టార్ట్‌ చేయబోయినా ఫలితం లేకపోయింది. మహిళ ఏడుపు తగ్గించి నవ్వడం మొదలుపెట్టింది. అజయ్, సురేంద్రలు ఇద్దరు భయంతో హైవేవైపు పరిగెత్తడం ప్రారంభించారు. ఎదురుగా వస్తున్న లారీని ఆపి అందులోకి ఎక్కారు.

చెమటలు, భయంతో వణుకుతున్న ఇద్దరిని చూసి ఏమిజరిగిందని డ్రైవర్‌ అడిగాడు. విషయం చెప్పడంతో మీరు కుల్‌ధారా వెళ్లారా అని లారీ డ్రైవర్‌ అడిగాడు. అవును అనడంతో అక్కడ మనుషులు ఎవరూ ఉండరు, 300 ఏళ్లుగా అక్కడ దెయ్యాలే ఉంటున్నాయని డ్రైవర్‌ చెప్పడంతో ఇద్దరు భయంతో వణికిపోయారు. ఇలాంటి సన్నివేశాలు సినిమాల్లో మాత్రమే చూస్తాం కానీ ఇది నిజం. రాజస్థాన్‌లోని కుల్‌ధారా గ్రామానికి వెళితే ఇలాంటి సన్నివేశాలు బోలెడు చూస్తాం.

కుల్‌ధారా కథేంటి?
రాజస్థాన్‌ రాష్ట్రంలో జైసల్మేర్‌కి 18 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది కుల్‌ధారా. ఒకప్పుడు ఊరినిండా జనంతో, అందమైన గృహాలతో కళకళలాడేది.కానీ ఇప్పుడు ఎడారితో సమానంగా ఉంది. మొండి గోడలు తప్ప ఇళ్లు లేవు. అంతుపట్టని నీడలు, వికృతమైన అరుపులు, ఎవరివో తెలియని అడుగుల జాడలు తప్ప మనుషుల ఉనికి లేదు. మూడు వందల ఏళ్ల క్రితం కుల్‌ధారాలో పలివాల్‌ అనే బ్రాహ్మణ కులస్థులు మాత్రమే ఉండేవారు. ఒకరోజు ఆ గ్రామానికి  ప్రధాని సలీమ్‌ సింగ్‌ (అప్పట్లో గ్రామలకు ప్రధానులని ఉండేవారు. వారిదే ఆధిపత్యం)!కుల్‌ధారా గ్రామ పెద్దల్లో ఒకరి కుమార్తెను సలీమ్‌ ఇష్టపడ్డాడు. కానీ ఆమె అతణ్ని ఇష్టపడలేదు. అయినా ఎలాగైనా ఆమెను సొంతం చేసుకోవాలనుకున్నాడు సలీమ్‌. అది తట్టుకోలేక ఊరివాళ్లు తిరగబడ్డారు.

తమ కులం కానివాడికి అమ్మాయిని ఇవ్వలేమని, దూరంగా ఉండమని హెచ్చరించారు. రగిలిపోయిన సలీమ్‌ ఊరివాళ్లపై పగబట్టాడు. అధిక పన్నులు విధించి హింసించాడు. అయినా ఎవరూ లొంగకపోవడంతో ఆ అమ్మాయిని ఎత్తుకుపోవాలని ప్లాన్‌ వేశాడు. అతనికి ఎదురు తిరిగి పోరాడటం మాటలు కాదు. అందుకే అందరూ కలసి రాత్రికి రాత్రే ఊరు విడిచి వెళ్లిపోయారు. వెళ్లేముందు... ఆ ఊరు ఇక నివాసయోగం కాని విధంగా నాశనమైపోతుందని శపించారట. అందుకే కుల్‌ధారా అలా అయిపోయిందని అంటారు. అయితే ఈ కథలో కొంతే నిజం ఉందని, గ్రామస్థులు ఊరు విడిచి వెళ్లిపోలేదని, రాత్రికి రాత్రే సలీమ్‌ సింగ్‌ అందరినీ చంపి పాతి పెట్టేశాడని, వాళ్లంతా దెయ్యాలై ఊరిని పట్టి పీడించడం మొదలు పెట్టారనేది మరో వాదన.

అందరికీ భయానక అనుభవాలు
ఏది నిజమో తెలుసుకోవాలని, రాత్రికి రాత్రే జనమంతా ఏమైపోయారో కని పెట్టాలని చాలామంది పరిశోధనలు చేశారు. కానీ ఎవరి జాడ తెలియకపోవడంతో మిన్నకుండిపోయారు. తర్వాత కొందరు ఇతర ప్రాంతాల నుంచి ఈ గ్రామంలో నివసించడానికి వచ్చారు. కానీ వారి వల్ల కాలేదు. అర్ధరాత్రి వేళల్లో ఎవరో తలుపులు బాదేవారు. తీసి చూస్తే ఎవరూ ఉండేవారు కాదు. ఎవరో గట్టిగట్టిగా అరిచేవారు. ఏడ్చేవారు, నవ్వేవారు. ఏవేవో నీడలు వెంట తిరుగుతూండేవి.

ఏవేవో రూపాలు కనిపించి భయపెట్టేవి. దాంతో అందరూ ఊరు వదిలి పారిపోయారు. క్రమంగా ఈ గ్రామంలో జరుగుతున్నవన్నీ బయటకు తెలియడంతో ఎవ్వరూ అక్కడకు వెళ్లే సాహసం చేయలేపోయారు. ఒక్కోసారి ఆ ఊరి పక్క నుంచి వెళ్లేవాళ్ల వాహనాలు హఠాత్తుగా ఆగిపోయేవి. తర్వాత వారికి అక్కడ భయానక అనుభవాలు ఎదురయ్యేవి. ఇలాంటి అనుభవాలు ఎదుర్కొన్నవారంతా కలిసి కుల్‌ధారాను ఘోస్ట్‌ విలేజ్‌ గా తేల్చారు. ఆ ముద్ర నేటికీ అలానే ఉంది. దాన్ని చెరిపే ప్రయత్నం ఎవ్వరూ చేయడం లేదు. ప్రభుత్వం ఇప్పుడు దీన్ని పర్యాటక ప్రాంతంగా మార్చింది. రాత్రి అయితే మాత్రం ఇక్కడ ఎవరూ ఉండరు.
– సాక్షి. స్కూల్‌ ఎడిషన్‌

Read latest Top-news News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు