ఏది స్వర్గం? ఏది నరకం?

6 Sep, 2015 02:34 IST|Sakshi
ఏది స్వర్గం? ఏది నరకం?

వేల ఏళ్లుగా తరతరాలుగా నివసిస్తున్న నేలను వదిలేసి.. పరాయి పంచన శరణం కోరుతూ పారిపోతున్న దుస్థితి. పిల్లాపాపలను వెంటబెట్టుకుని కట్టుబట్టలతో తరలిపోతున్న దయనీయం. ఈ నరకం నుంచి బయటపడితే చాలు.. ప్రాణాలు దక్కితే చాలు.. కాస్త భద్రమైన ప్రాంతంలో తలదాచుకుని బతకవచ్చన్న ఆశ. ఇంకాస్త మెరుగైన జీవితం కోసం.. మరింత భద్రమైన బతుకుపై కోరిక. ఈ క్రమంలో అత్యంత ప్రమాదకరమైన ప్రయాణం చేస్తున్న సాహసం. ఆ దుస్సాహసంలో అసువులుబాస్తున్న అంతులేని మానవ విషాదం.

ఒక్కరు కాదు.. వేలు కాదు.. లక్షల మంది తరలిపోతున్నారు. మధ్యప్రాచ్యంలో గత కొన్నేళ్లుగా కొనసాగుతున్న మహా మానవ సంక్షోభమిది. అంతర్యుద్ధంతో అగ్నిగుండంగా మారిన సిరియా ప్రజల దైన్యమిది. పొరుగు దేశానికి పారిపోయి అక్కడ ఆశ్రయమిస్తే శిబిరాల్లో దీనంగా బతుకీడుస్తున్నారు. ఆశ్రయమివ్వకపోయినా ‘అక్రమంగా’ ఆయా దేశాలకు చేరుకుంటున్నారు. ఇంకాస్త మెరుగైన బతుకు కోసం యూరప్ దేశాలకు అత్యంత ప్రమాదకర రీతిలో పయనమవుతున్నారు. ఆ క్రమంలో వేలాది మంది మధ్యలోనే అసువులు బాస్తున్నారు.

ట్రక్కుల్లో శవాలుగా కుళ్లిపోతున్నారు. నడిసముద్రంలో జలసమాధి అవుతున్నారు. గత ఐదేళ్లుగా ఈ పరిస్థితి రోజు రోజుకూ తీవ్రమవుతూ ఉంది. మధ్యధరా సముద్రంలో ఒక్కోసారి ఐదారు వందల మంది గల్లంతైన సందర్భాలూ ఇటీవలే చోటుచేసుకున్నాయి. కానీ.. నాలుగు రోజుల కిందట వెలుగు చూసిన ఒక చిన్నారి ఫొటోతో ప్రపంచం మొత్తం చలించిపోయింది. ఈనేపథ్యంలో సిరియాలో అంతర్యుద్ధం.. శరణార్థుల ప్రయాణంపై ‘సాక్షి’ ఫోకస్...     
- సెంట్రల్ డెస్క్

 
సిరియా శరణార్థుల దైన్యం
* అంతర్యుద్ధంతో అగ్నిగుండంగా సిరియా 
* ప్రాణాల కోసం పారిపోతున్న దేశ ప్రజలు

* ఇప్పటికే సగం జనాభా దేశం విడిచిన వైనం 
* పొరుగు దేశాల్లోని శిబిరాల్లో కోటి మంది జనం
* యూరప్ దేశాలకు వెళ్లేందుకు దుస్సాహసం 

* మధ్యదరా సాగరంలో మహా మానవ విషాదం
సిరియా.. ఒక చిన్న దేశం. మొత్తం విస్తీర్ణం 1.85 లక్షల చదరపు కిలోమీటర్లు. అంతర్యుద్ధానికి ముందు జనాభా 2.25 కోట్ల మంది. ఇప్పుడు ఆ సంఖ్య సగానికి పడిపోయింది. ఎడారులూ సారవంతమైన భూములూ గల ఈ దేశానికి ఐదు వేల ఏళ్లకు పైగా సుసంపన్నమైన సుదీర్ఘ చరిత్ర ఉన్నా.. గత ఐదేళ్లుగా ప్రత్యక్ష నరకంగా మారిపోయింది. ఈ నరకం నుంచి బయటపడిన కోటి మందికి పైగా ప్రజలు.. పొరుగు దేశాలతో పాటు, యూరప్ దేశాలకూ శరణార్థులుగా చేరుతున్నారు.
 
ఆందోళనలు మొదలు...
ట్యునీసియా, ఈజిప్ట్, లిబియాల్లో వెల్లువలా వచ్చిన ‘అరబ్ వసంతం’ ప్రభావం సిరియాలో అంతర్యుద్ధానికి బీజం వేసింది. 1971 నుంచి అధికారంలో ఉన్న అసద్ కుటుంబ పాలనలో ప్రభుత్వం ఆర్థిక, రాజకీయ సంస్కరణలు అమలు చేయటంలో విఫలమవటంతో 2011లో ప్రజలు శాంతియుత నిరసన ప్రదర్శనలు ప్రారంభించారు.

2011 మార్చిలో పాఠశాల గోడలపై విప్లవ నినాదాలు రాసిన పలువురు టీనేజీ విద్యార్థులను అరెస్ట్ చేసి హింసించటంతో సిరియా సంక్షోభానికి బీజం పడింది. ఆందోళనకారులపై ఏప్రిల్ నెలలో సైన్యం విరుచుకుపడటం.. పలువురు నిరసనకారులు మరణించటంతో దేశవ్యాప్తంగా ఆందోళనలు రాజుకున్నాయి. ఈ ఆందోళన పెరుగుతూపోయి దేశాధ్యక్షుడు బషార్ అల్-అసాద్ రాజీనామా డిమాండ్ కోరేస్థాయికి చేరింది.
 
అంతర్యుద్ధం షురూ...

2011 జూలై నాటికి ఈ ఆందోళన అంతర్యుద్ధం రూపం తీసుకుంది. స్వతంత్ర సిరియా సైన్యం (ఫ్రీ సిరియన్ ఆర్మీ) పేరుతో ఆందోళనకారులు సాయుధ సంస్థను ఏర్పాటు చేశారు. ప్రభుత్వాన్ని కూలదోసేందుకు దేశంలోని వివిధ ప్రాంతాల్లో స్థానికంగా సాయుధ బృందాలు ఏర్పడ్డాయి. అయితే.. వీటి మధ్య సమన్వయం లేకపోవటంతో పాటు.. కేంద్రీకృత నియంత్రణ లోపించటం వల్ల ముక్కలు ముక్కలుగానే సైన్యంతో తలపడటం మొదలుపెట్టింది.

స్థానికంగా ఉండే గిరిజన బృందాలతో పాటు.. సైన్యం నుంచి వచ్చేసిన మాజీ సైనికులు, ప్రభుత్వ వ్యతిరేకత కలిగివున్న స్థానికులు వీటిలో భాగస్వాములయ్యారు. ఇక సిరియా నుంచి, పొరుగు దేశాల నుంచి జిహాదీలు కూడా వచ్చి ఈ సైన్యంలో చేరారు. ఈ క్రమంలోనే ఇస్లామిక్ స్టేట్ ఇన్ సిరియా, ఇరాక్ - ఐఎస్‌ఐఎస్ కూడా తెరపైకి వచ్చింది. సిరియా ఉత్తర, తూర్పు ప్రాంతాల్లో అత్యధిక భూభాగాలతో పాటు.. పొరుగున ఉన్న ఇరాక్‌లోని పలు ప్రాంతాలను కూడా ఐఎస్‌ఐఎస్ తన ఆధీనంలోకి తీసుకుంది. ఐఎస్‌ఐఎస్‌ను ధ్వంసం చేసే లక్ష్యంతో అమెరికా సారథ్యంలోని సంకీర్ణ దేశాల బలగాలు 2014 సెప్టెంబర్‌లో సిరియాలో వైమానిక దాడులు మొదలు పెట్టాయి.
 
అమాయకుల ఊచకోత...
అనతికాలంలోనే.. ఒకవైపు ప్రభుత్వ సైన్యం, మరోవైపు తిరుగుబాటు దళాలు, ఐఎస్‌ఐఎస్ దుష్టశక్తులు సాధారణ ప్రజలను హతమార్చటం మొదలైంది. అసద్ తెగకు చెందిన అలావైట్లను ఊళ్లకు ఊళ్లు ఊచకోత కోయటం నిత్యకృత్యంగా మారింది. ప్రభుత్వ లక్ష్యాలపై దాడి పేరుతో అమాయకులపై కారు బాంబుల దాడులు సాధారణంగా మారింది. జిహాదీ తిరుగుబాటుదారులు సిరియాలోని కుర్దు ప్రాంతాల్లో వ్యవసాయాన్ని ధ్వంసం చేయటం, విద్యుత్, నీటి సరఫరాలను కత్తిరించటం వంటి చర్యలకు పాల్పడుతున్నారు.

ప్రభుత్వ సైన్యం సైతం.. తిరుగుబాటు దళాలకు సాయం చేస్తున్నారని, తమ ఉత్తర్వులు పాటించలేదన్న మిషతో సాధారణ ప్రజలను చంపటం షరామామూలుగా మారింది. బాంబుల దాడితో ఊళ్లకు ఊళ్లు ధ్వంసమయిపోతున్నాయి. మానవ హక్కుల ఉల్లంఘనలు యథేచ్ఛగా సాగిపోతున్నాయి. ఈ యుద్ధంలో ఇప్పటివరకూ 2.20 లక్షల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.
 
నిరాశ్రయులు.. శరణార్థులు...
అంతర్యుద్ధం ఫలితంగా దేశంలో కనీస అవసరాలైన ఆహారం, ఆరోగ్య సేవలు కుంటుపడ్డాయి. సిరియా విద్య, ఆరోగ్య, సామాజిక సంక్షేమ వ్యవస్థలు కుప్పకూలేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఐక్యరాజ్యసమితి గత మార్చిలో విడుదల చేసిన నివేదిక ప్రకారం.. సిరియాలోని ప్రతి ఐదుగురిలో నలుగురు ఇప్పుడు పేదరికంలో ఉన్నారు. వారిలో 30 శాతం మంది కటిక దారిద్య్రంలో బతుకుతున్నారు. దేశంలో దాదాపు 76 లక్షల మంది ప్రజలు అంతర్గతంగా నిర్వాసితులయ్యారని ఐరాస నివేదిక చెప్తోంది.

తమ ఇళ్లను వదిలిపెట్టి వెళ్లిపోయిన వారి సంఖ్య 1.10 కోట్లు దాటిపోయింది. అంటే.. సంక్షోభానికి ముందున్న దేశ జనాభాలో సగం మంది నిరాశ్రయులయ్యారు. ఐరాస నివేదిక ప్రకారమే.. సిరియాలో ఉన్న 1.22 కోట్ల మంది ప్రజల్లో 56 లక్షల మంది చిన్నారులు ఉన్నారు. వారికి మానవతా సాయం అందించాల్సిన అవసరముంది. కాగా, స్వదేశాల్లో నెలకొన్న అంతర్యుద్ధం కారణంగా యూరప్ దేశాలకు తరలివస్తున్న శరణార్ధుల్లో తాజాగా 6,500 మంది శనివారం ఆస్ట్రియాకు చేరుకున్నారు. జర్మనీలోని మ్యూనిచ్‌కు 600 మంది చేరుకున్నారు.
 
ఈయూలో శరణార్థి హోదా ఎలా లభిస్తుంది?
యూరప్‌కు శరణార్థులుగా వస్తున్న వారు.. తమ దేశంలో విద్వేషాన్ని, హింసను ఎదుర్కొంటూ దానినుంచి పారిపోయి వస్తున్నామని.. త మను తమ సొంత దేశానికి తిప్పిపంపించినట్లయితే తమకు హాని జరుగుతుందని, చనిపోయే పరిస్థితీ ఉందని ఆయా దేశాల అధికారులను ఒప్పించాల్సి ఉంటుంది.

ఈయూ నిబంధనల ప్రకారం.. శరణార్థికి ఆహారం, ప్రథమ చికిత్స, ఆశ్రయం హక్కులు ఉం టాయి. శరణార్థులు వచ్చిన తర్వాత 9నెలల లోగా పని హక్కు కూడా లభిస్తుంది. 2013లో 4.35 వేల మంది ఈయూ దేశాల్లో శరణార్థుల హోదా కోసం దరఖాస్తు చేసుకుంటే.. 2015లో ఆ సంఖ్య 6.26 లక్షల మందికి పెరిగింది. గత ఏడాది ఈయూలో లక్ష మందికి పైగా ప్రజలకు అధికారికంగా శరణార్థి హోదా లభించింది.
 
మధ్యదరా మార్గంలో...
సిరియా నుంచి వచ్చిన శరణార్థులతో పాటు.. మధ్య ఆసియా, దక్షిణాసియా, ఆఫ్రికా, బాల్కన్ దేశాల నుంచి కూడా మెరుగైన జీవితాల కోసం యూరప్ దేశాలకు పయనమవుతున్నారు. ఆసియా ఖండం నుంచి యూరప్ ఖండానికి చేరుకోవటానికి భూమార్గం చాలా సుదీర్ఘమైనదే కాకుండా.. చాలా కష్టాలతో కూడుకున్నది కూడా. అయినా భూ మార్గంతో పాటు మధ్యధరాసముద్రంలో ప్రయాణిస్తూ కూడా చేరుకుంటారు. సముద్రం మీదుగా టర్కీ నుంచి గ్రీస్‌కు చేరుకోవటం అతి దగ్గరి దారి. దూరం 13 మైళ్లు మాత్రమే.

మర పడవలో ప్రయాణిస్తే అరగంటలో వెళ్లిపోవచ్చు. లిబియా నుంచి ఇటలీకి ఒక రోజు కంటే తక్కువ సమయంలో చేరుకోవచ్చు. ఈ నేపథ్యంలో సిరియా నుంచి వివిధ దేశాలకు చేరుకున్న శరణార్థులు.. యూరప్‌లోకి ప్రవేశించేందుకు సముద్రమార్గాన్ని ఎంచుకుంటున్నారు. ఇటువంటి శరణార్థులతో కూడిన కొన్ని బోట్లు సముద్రంలో మునిగిపోయి వందలాది మంది చనిపోతుండటంతో కొన్ని యూరప్ దేశాలు తలా కొంచెం భారం పంచుకునేందుకు సిద్ధమై.. కొందరిని శరణార్థులుగా తీసుకున్నాయి. అయినా.. సిరియా ఇతర పశ్చిమాసియా దేశాల నుంచి వలసల వెల్లువ ఆగటం లేదు.

ఒకవైపు.. సౌదీ అరేబియా, యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్, ఖతార్, ఒమన్ వంటి గల్ఫ్ దేశాలు.. తమ పొరుగు దేశం ప్రజలను శరణార్థులుగా అంగీకరించేందుకు సిద్ధంగా లేకపోవటం.. ఇరాక్, లెబనాన్, టర్కీ వంటి దేశాల్లో శరణార్థి శిబిరాల్లో అయినా, వెలుపల అయినా జీవితం దుర్భరంగా ఉండటం.. యూరప్‌లో మెరుగైన జీవితానికి అవకాశం ఉండటం వంటి కారణాలతో శరణార్థులు ప్రాణాలకు తెగించి మరీ ఆ దేశాలకు పయనమవుతున్నారు.

ఇప్పటికే గ్రీస్‌కు 2.30 లక్షల మంది, ఇటలీకి 1.15 లక్షల మంది, స్పెయిన్ కు 21 వేల మంది శరణార్థులు చేరుకున్నారు. మరో 3.50 లక్షల మంది యూరప్ ముంగిట్లో వేచివున్నారు. వలస వస్తున్న వారిలో అత్యధికులు జర్మనీకి వెళ్లాలని కోరుకుంటున్నారు. ఈ ఒక్క ఏడాదే ఆ దేశానికి 8 లక్షల మంది శరణార్థులు వస్తారని అంచనా.
 
ఏ దేశానికి ఎందరు..?
ఐరాస అంచనా ప్రకారం ఇప్పటివరకూ 1.5 కోట్ల మంది సిరియా వదిలి శరణార్థులుగా వెళ్లిపోయారు. వారిలో అత్యధికులు పొరుగున ఉన్న జోర్డాన్, లెబనాన్‌లలో తలదాచుకున్నారు. 2012 నుంచి వారి అవసరాలను మెర్సీ కార్ప్స్ అనే సంస్థ చూస్తోంది. కేవలం 43 లక్షల మంది జనాభా ఉన్న లెబనాన్.. ఇటు సిరియా, అటు పాలస్తీనా నుంచి వచ్చి చేరిన 20 లక్షల మంది శరణార్థులతో నిండిపోయింది.
 
ఇరాక్: 1,97,000
గత ఆగస్టు నెలలో దాదాపు 40 వేల మంది తూర్పు సిరియా నుంచి కొండ ప్రాంతాల గుండా ప్రయాణించి సరిహద్దులో ఉన్న ఇరాకీ కుర్దిస్తాన్ పట్టణం పెష్కాబర్‌కు చేరుకున్నారు. మరోవైపు ఇరాక్‌లో సైతం అంతర్గత కల్లోలం కారణంగా పది లక్షల మంది ఇరాకీలే నిరాశ్రయులై ఉన్నారు. వీరితో పాటు సిరియా నుంచి వచ్చిన శరణార్థులకు సదుపాయాలు కల్పించటానికి ఇరాక్‌కు తలకుమించిన భారంగా మారింది.
 
లెబనాన్: 7,90,000
శరణార్థులు వెల్లువెత్తుతుండటంతో లెబనాన్ జనాభా ఏడాది కాలంలోనే 20 శాతం పెరిగిపోయింది. అధికారికంగా శరణార్థి శిబిరాలను ఏర్పాటు చేయరాదని ప్రభుత్వం నిర్ణయించటంతో శరణార్థులు తమకు ఎక్కడ ఆశ్రయం దొరికితే అక్కడ జీవిస్తున్నారు.
 
టర్కీ: 5,04,000

టర్కీ సర్కారు సిరియా శరణార్థుల కోసం టెంట్లతో శిబిరాలను ఏర్పాటు చేసి దాదాపు రెండు లక్షల మందికి ఆశ్రయం కల్పిస్తోంది. మరో మూడు లక్షల మంది దేశంలోని వివిధ ప్రాంతాల్లో తలదాచుకుంటున్నట్లు అంచనా.
 
జోర్డాన్: 5,43,000
లెబనాన్ తర్వాత అత్యధికంగా జోర్డాన్‌లో సిరియా శరణార్థులు తలదాచుకుంటున్నారు. శరణార్థులతో నిండిన జాటారి శిబిరం దేశంలో అతిపెద్ద నగరాల్లో ఒకటిగా మారిపోయింది.
 ఈ దేశాలతో పాటు.. ఈజిప్టులో 2.50 లక్షలు, జర్మనీలో లక్ష, గ్రీస్‌లో 88 వేలు, అల్జీరియాలో 35 వేలు, స్వీడన్‌లో 40 వేలు, ఆస్ట్రియాలో 20 వేల మంది సిరియా శరణార్థులు ఉన్నారు.  ఇక బ్రిటన్‌లో ఐదు వేల మంది, అర్మీనియా, బహ్రెయిన్, లిబియా, బల్గేరియా, ఇటలీ, కెనడా, రష్యా, బ్రెజిల్, ఫ్రాన్స్ తదితర దేశాలతో పాటు అమెరికాకు కూడా సిరియా ప్రజలు శరణార్థులుగా వలస వెళ్లారు.
 
సాగరంలో స్మగ్లర్ల దందా
శరణార్థులను సముద్రం గుండా యూరప్ దేశాలకు చేరవేయటానికి స్మగ్లర్ల ముఠాలు పనిచేస్తుంటాయి. యూరప్ దేశాలకు వెళ్లాలని నిర్ణయించుకున్న శరణార్థులు.. తమకు తెలిసిన వారి ద్వారా బ్రోకర్లను కలుస్తారు. ఈ బ్రోకర్లు అధికంగా సిరియన్లే ఉంటారు. స్మగ్లర్లతో ఫోన్‌లో ఒప్పందం కుదుర్చుకుంటారు. ఒక్కో వ్యక్తికి.. అతడి జాతీయత, అధికారిక హోదా ప్రకారం 2000 డాలర్ల నుంచి 5,000 డాలర్ల వరకూ స్మగ్లర్లు వసూలు చేస్తారు. అయితే.. ఈ స్మగ్లింగ్‌లో కూడా పోటీ ఉంటుంది. ఆఫర్లూ ఉంటాయి. పది మంది శరణార్థులను ప్రయాణం కోసం తీసుకువస్తే..

ఒకరిని ఉచితంగా పంపిస్తారు. అలాగే కుటుంబం మొత్తం ప్రయాణిస్తే.. పిల్లలను ఉచితంగా పంపిస్తారు. ఒప్పుకున్న మొత్తం సొమ్మును చెల్లించాక.. స్మగ్లర్లు ఫోన్ చేసి ప్రయాణించే వ్యక్తి ఎక్కిడికి రావాలో చెప్తారు. సముద్రంలో ప్రయాణానికి లైఫ్ జాకెట్, తాగేనీళ్లు, చాక్లెట్లు, ఖర్జూర పళ్లు వంటివి మాత్రమే ఒక బ్యాగులో వీపుకు తగిలించుకుని బయల్దేరుతారు. అయితే.. ఈ ప్రయాణం పలుమార్లు వాయిదా పడుతుంది. స్మగ్లర్లలో అంతర్గత కలహాలు లేదా సముద్రంలో పోలీసుల గస్తీ వంటి కారణాలు ఉంటాయి.

చేపలు పట్టటానికి ఉపయోగించే చిన్న పడవలు, నాటు పడవలు, గాలినింపిన ప్లాస్టిక్ డింగీలు వంటి వాటిలో సైతం శరణార్థులను సముద్రంలోకి పంపిస్తుంటారు. ఒక దేశం నుంచి మరొక దేశానికి చేరటానికి.. అక్కడి నుంచి సముద్ర మార్గంలో యూరప్ చేరటానికి మధ్య ఎన్నో ప్రమాదాలు పొంచి ఉంటాయి. దారిలో దోపిడీ చేసే ముఠాలు.. మనుషుల్ని ఎత్తుకెళ్లిపోయే కిడ్నాపర్లు.. దేశం దాటిస్తామని మాట ఇచ్చి మోసం చేసే నకిలీ స్మగ్లర్లు.. మధ్య దారిలో వదిలేసి పారిపోయే బ్రోకర్లు.. తిండీనీళ్లు లేక అలమటించిపోయే దుస్థితి..

జబ్ముచేసి చనిపోయే పరిస్థితి.. సముద్రంలో మునిగిపోయే ప్రమాదం.. అత్యాచారాలు, హత్యలు.. ఎన్నో ప్రమాదాలు ఉంటాయి. ఇప్పటివరకూ ఇలా శరణార్థులతో బయల్దేరిన పడవలు మునిగిపోయి మధ్యధరాసముద్రంలో 2,600 మంది చనిపోయారని ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది. వీటిగురించి పూర్తిగా తెలిసినా.. శరణార్థులు ఈ ప్రమాదకర ప్రయాణం సాగిస్తూనే ఉన్నారు..
మూడేళ్ల సిరియా చిన్నారి అయలాన్ మృతదేహం టర్కీ తీరానికి కొట్టుకొచ్చిన ఫొటోను చూసి... ప్రపంచం నిర్ఘాంతపోయింది. ప్రాంతీయ, మతబేధాల్లేకుండా అశ్రుతర్పణాలర్పించింది. మానవత్వం జాడను వెతకాల్సి వచ్చింది. ఈ ఒక్క ఫొటో దేశదేశాలను ఎంతగా కదిలించిందంటే... ఇన్నేళ్లు శరణార్థుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన యూరోప్ దేశాలు ఉలిక్కిపడ్డాయి.

తీవ్ర ఒత్తిడిలో ఐరోపా దేశాధినేతలంతా స్పందించారు. పొట్టచేతపట్టుకొని... సురక్షితమైన గూడును వెతుక్కుంటున్న వారిని ఆదరిస్తామని మాటిచ్చారు. శరణార్థులకు ఆశ్రయం కల్పించే విధానాన్ని సమీక్షించుకుంటామన్నారు. వీరి సహాయం కోసం విరాళాలు కూడా వెల్లువెత్తాయి. లక్షలమంది సిరియన్లు పడుతున్న అవస్థ ప్రపంచానికి తెలిసింది... గుండెలు పిండేసే ఒక్క ఫొటో ద్వారానే.

మరిన్ని వార్తలు