స్వెత్లానా అలెక్సియేవిచ్‌కు సాహితీ నోబెల్

9 Oct, 2015 01:21 IST|Sakshi
స్వెత్లానా అలెక్సియేవిచ్‌కు సాహితీ నోబెల్

బెలారస్ రచయిత్రికి పురస్కారం ప్రకట
 
స్టాక్‌హోమ్: ఈ ఏడాది సాహిత్యంలో నోబెల్ బహుమతిని బెలారస్ రచయిత్రి స్వెత్లానా అలెక్సియేవిచ్(67)కు ప్రకటించారు. ఆమె విభిన్న స్వరాల రచనలు మన కాలంలో బాధలకు, సాహసానికి ప్రతీకలని అభివర్ణిస్తూ.. ఆమెను నోబెల్ బహుమతితో గౌరవిస్తున్నట్లు స్వీడన్‌లోని నోబెల్‌అకాడమీ గురువారం నాడు ప్రకటించింది. చెర్నోబిల్ విపత్తు, రెండో ప్రపంచ యుద్ధంపై ప్రత్యక్ష సాక్షుల కథనాల ఆధారంగా స్వెత్లానా చేసిన రచనలు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు పొందాయి. ఈ అనుభవాలను సాక్షుల సొంత మాటల్లోనే నమోదు చేయటం వల్ల ఆమె రచనలు అనేక భాషల్లోకి అనువాదమవటంతో పాటు అంతర్జాతీయ అవార్డులూ పొందా యి. రష్యా భాషలో రాసిన ఆమె రచనలు.. అధికారవాది అలెక్సాండర్ లుకాషెంకో పాలనలో సెన్సార్‌షిప్ ఉండటం వల్ల ప్రచురితం కాలేదు. నోబెల్ సాహిత్య బహుమతి అందుకున్న రచయిత్రుల్లో స్వెత్లానా 14వ వ్యక్తి. ఈ బహుమతి కింద ఆమెకు సుమారు రూ. 6.31 కోట్లు బహూకరిస్తారు. నోబెల్ శాంతి బహుమతిని శుక్రవారం ప్రకటించనున్నారు.

స్కూల్‌లో చదివేటపుడే విలేకరిగా...: స్వెత్లానా 1948 మే 31న ఉక్రెయిన్‌లో జన్మించారు. ఆమె తల్లి ఉక్రెయిన్ పౌరురాలు, తండ్రి బెలారస్ పౌరుడు. ఆయన సైన్యంలో పనిచేసేవారు. విధుల నుంచి వైదొలగిన తర్వాత కుటుంబం బెలోరష్యాకు వెళ్లి ఓ గ్రామంలో స్థిరపడింది. తల్లిదండ్రులు స్కూల్ టీచర్లుగా పనిచేసేవారు. స్వెత్లానా స్కూల్‌లో చదివేటపుడే.. నర్వోల్ పట్టణంలో స్థానిక వార్తాపత్రికకు విలేకరిగా పనిచేశారు. ఈ వృత్తిలోనే ముందుకు వెళ్లారు. వార్తాకథనాలతో పాటు కథలూ రాశారు. చెర్నోబిల్ విషాదం, అఫ్ఘానిస్థాన్‌లో సోవియట్ రష్యా యుద్ధం తదితర ఎన్నో ముఖ్యమైన ఘటనలపై ఆమె తన రచనా వ్యాసంగాన్ని కేంద్రీకరించారు. ఇందుకోసం వేలాది మంది ప్రత్యక్ష సాక్షులను ఇంటర్వ్యూ చేశారు. బెలారస్‌లోని అలెక్సాండర్ లుకాషెంకో నియంతృత్వ ప్రభుత్వం ఆమెను అనేక వేధింపులకు గురిచేసింది. దీంతో 2000 సంవత్సరంలో ఆమె బెలారస్ విడిచి పారిస్, గోథెన్‌బర్గ్, బెర్లిన్‌లకు వెళ్లారు. మళ్లీ 2011లో బెలారస్‌కు తిరిగివచ్చారు.
 

మరిన్ని వార్తలు