సాగు.. సమూల మార్పు

3 Sep, 2015 04:41 IST|Sakshi

* ఉత్పాదకత, ఆదాయం, రైతు అభివృద్ధికి కసరత్తు
* వ్యవసాయ, ఉద్యాన పంటల కోసం ‘పంట కాలనీ’లు
* సంప్రదాయ పంటల విధానానికి స్వస్తి
* ఐదేళ్ల కోసం ‘వ్యవసాయశాఖ విజన్ డాక్యుమెంట్’

సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని సమూలంగా మార్చేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. వాతావరణం, వర్షాభావ పరిస్థితులను అంచనా వేసి వ్యవసాయ, ఉద్యాన రంగంలోని బలాలు, బలహీనతలు, అవకాశాలను అధ్యయనం చేసి ఐదేళ్ల కోసం ‘విజన్ డాక్యుమెంట్’ను వ్యవసాయశాఖ రూపొందించింది.

శాఖ ఉన్నతాధికారులు, శాస్త్రవేత్తలు కలసి రూపొందించిన డాక్యుమెంటుపై బుధవారం వ్యవసాయమంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి సుదీర్ఘంగా చర్చించారు. ‘ఉత్పాదకత, ఆదాయం తద్వారా రైతు ఆర్థికాభివృద్ధి’ లక్ష్యంగా దీన్ని రూపొందించినట్లు అధికారులు చెబుతున్నారు.
 సంప్రదాయ పంటలకు స్వస్తి: వాతావరణం, నేల స్వభావం, భూసారం తదితర అంశాలను ఆధారం చేసుకొని ఏ ప్రాంతాలు ఏ పంటలకు అనువైనవో గుర్తించి వాటినే సాగు చేసేలా చూసేందుకు ‘పంట కాలనీ’లను ఏర్పాటుచేయాలని విజన్ డాక్యుమెంట్ స్పష్టం చేస్తోంది.

రైతులు సంప్రదాయంగా పంటలు వేసుకునే పద్ధతికి పంట కాలనీల ద్వారా స్వస్తిపలుకుతారు. పంట కాలనీలుగా విభజించాక ఏ కాలనీలో ఏ పంటలు వేయాలన్న అంశాన్ని అధికారులు గుర్తించి రైతులకు సలహాలు ఇస్తారు. రైతులు ఆ పంటలే వేయాల్సి ఉంటుంది. దానివల్ల అధిక ఉత్పత్తి, రైతుకు అధిక ఆదాయం లభిస్తాయన్నది సర్కారు ఉద్దేశం. ఇప్పటికే జిల్లాల వారీగా పంటల కాలనీలను గుర్తించారు. రసాయన, పురుగు మందులను కూడా గణనీయంగా తగ్గించాలని నిర్ణయించారు. అలాగే వ్యవసాయ విస్తరణ వ్యవస్థను పెద్ద ఎత్తున పెంచాలని కూడా నిర్ణయించినట్లు తెలిసింది. పంట కాలనీలను ఏర్పాటు చేస్తే వ్యవసాయాధికారుల సంఖ్యను కూడా పెద్దఎత్తున పెంచాల్సి ఉంటుంది.
 
ఉద్యానశాఖ బలోపేతం
ఉద్యానశాఖను మరింత బలోపేతం చేయాల్సిన అవసరాన్ని విజన్ డాక్యుమెంట్ స్పష్టంచేస్తోంది. వర్షాభావ పరిస్థితులున్న తెలంగాణలో ఉద్యాన పంటల సాగును పెంచాలనేది దీని ప్రధాన ఉద్దేశం. పళ్లు, పూలు, ఆయిల్‌ఫాం, స్పైస్ వంటి ఉద్యాన పంటల సాగుపై దృష్టిపెట్టాలని నిర్ణయించారు. ఏ ప్రాంతంలో ఎటువంటి ఉద్యాన పంటల సాగు చేయవచ్చో ఖరారు చేసి, ఆ ప్రకారం 90 పంట కాలనీలుగా విభజించారు. ప్రస్తుతం ఉన్న 20 లక్షల ఎకరాల్లోని ఉద్యాన సాగును ఐదేళ్లలో 30 లక్షల ఎకరాలకు విస్తరించాలని నిర్ణయించారు.

ప్రస్తుతం ఉద్యానశాఖలో 200 మంది ఉండగా... ఆ సంఖ్యను 3 వేల వరకు పెంచాలని నిర్ణయించారు. 7,500 ఎకరాలకు ఒక ఉద్యాన అధికారిని, 2,500 ఎకరాలకు ఒక ఉద్యాన విస్తరణ అధికారిని, 25 వేల ఎకరాలకు ఒక అసిస్టెంట్ డెరైక్టర్‌ను ఏర్పాటు చేయాలని డాక్యుమెంటులో సూచించారు. ఈ విధంగా ఉద్యాన పంటలను ప్రోత్సహించేందుకు ఐదేళ్లకు రూ. 5,700 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. విజన్ డాక్యుమెంటుకు తుది రూపు ఇచ్చాక దీని అమలు ప్రారంభం అవుతుంది.

మరిన్ని వార్తలు