అడ్డదారిలో అయినవారికి..

12 Sep, 2015 02:01 IST|Sakshi
అడ్డదారిలో అయినవారికి..

సాక్షి, హైదరాబాద్: టీడీపీ పాలనలో ఆశ్రీత పక్షపాతం యథేచ్ఛగా సాగుతోంది. అయిన వారికి కాంట్రాక్టులు కట్టబెట్టడం కొనసాగుతోంది. తాజాగా రూ. 413 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులను వైఎస్సార్ జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసులురెడ్డి కంపెనీకి కట్టబెట్టారు. టెండర్లలోనే టైలర్‌మేడ్ నిబంధనలు పెట్టి కావాల్సినవారికి అడ్డదారిలో కాంట్రాక్టులు కట్టబెట్టే మార్గాన్నే ఈ టెండర్లలోనూ ప్రభుత్వం అనుసరించింది.

పనుల కోసం ఆర్‌కే ఇన్‌ఫ్రా-హెచ్‌ఈఎస్-కోయా సంస్థలు జాయింట్ వెంచర్‌గా ఒక టెండరు, గాయత్రి కన్‌స్ట్రక్షన్ తరపున ఒక టెండరు దాఖలయ్యాయి. శుక్రవారం హంద్రీ-నీవా ప్రాజెక్టు మదనపల్లె-3 సర్కిల్ కార్యాలయంలో సాంకేతిక, ధరల బిడ్స్‌ను పరిశీలించారు. గాయత్రి కన్‌స్ట్రక్షన్-డబ్ల్యుపీఐఎల్ జాయింట్ వెంచర్‌కు నిబంధనల మేరకు అర్హతలేదని నిర్ధారించారు.

ఈ పని విలువలో సగం.. అంటే రూ.207 కోట్ల విలువైన కాలువ తవ్వకం, లైనింగ్ పనులను ఏడాది కాలంలో పూర్తి చేసి ఉండాలనే నిబంధన పెట్టారు. గాయత్రి ఈ పరిమాణం లో పనులు చేసినట్టు నిర్ధారణ కాలేదు. దీంతో ఆ సంస్థ తరపున దాఖలుచేసిన టెండర్‌ను అధికారులు పరిగణనలోకి తీసుకోలేదు. దీంతో ఆర్‌కే ఇన్‌ఫ్రా-హెచ్‌ఈఎస్-కోయా సంస్థలు దాఖలుచేసిన జాయింట్ వెంచర్ దాఖలు చేసిన ఏకైక టెండర్‌ను పరిశీలించారు.

ఆ సంస్థ రూ.413కోట్ల పనికి రూ.430,29,99,999తో టెండర్ వేసింది.ఇది అంచనా విలువకు 4.0073 శాతం (రూ.13.50కోట్లు) ఎక్కువ.  రెండే కంపెనీలు టెండర్లు వేయడం, అందులో ఒక కంపెనీకి అర్హత లేదని నిర్ధారించి కాంట్రాక్టును ఆర్కే ఇన్‌ఫ్రాకు కట్టబెట్టారు.
 
చక్రం తిప్పిన నేత : కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులను దక్కించుకునేందుకు వైఎస్సార్ జిల్లాకు చెందిన ఓ టీడీపీ నేత ముందునుంచీ కన్నేశారు. అదే జిల్లాకు చెందిన మరో టీడీపీనేత శ్రీనివాసులురెడ్డి టెండర్ దాఖలు చేయగా, ముందునుంచీ కన్నేసిన నేత టెండర్లు దాఖలు చేయకుండా పనుల్లో వాటా కావాలని కోరినట్టు ప్రచారం జరిగింది. దీన్ని ఖరారు చేస్తూ టీడీపీ నేతకే పనులు దక్కాయి.
 
గడువు తొమ్మిది నెలలే :కుప్పం కాలువకు వచ్చే సంక్రాంతికి నీరందించాలని సీఎం నిర్ణయించారు. ఈ కాలువ పలమనేరు నియోజకవర్గంలోని అప్పినపల్లె గ్రామం నుంచి కుప్పం నియోజకవర్గంలోని పరమసముద్రం చెరువు వరకు సాగుతుంది. రూ. 413 కోట్ల అంచనా వ్యయంతో 143 కి లోమీటర్ల కాలువ, మూడుచోట్ల ఎత్తిపోతల పథకాలు, 285చోట్ల కల్వర్టులు, బ్రిడ్జిల నిర్మాణం జరగాలి. ఎనిమిది మండలాల్లో 4.5లక్షల మందికి తాగునీరు, 6,300 ఎకరాలకు సాగునీరు ఇవ్వాలన్నది ఈ పథకం లక్ష్యం. ఈ పనులన్నింటిని పూర్తిచేసేందుకు ప్రభుత్వం కేవలం తొమ్మిది నెలల గడువును విధించింది. దీనిపై ఇంజనీర్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని వార్తలు