జూన్ చివరికి స్వచ్ఛభారత్‌పై తుది నివేదిక

1 May, 2015 02:22 IST|Sakshi
జూన్ చివరికి స్వచ్ఛభారత్‌పై తుది నివేదిక
  • సబ్ కమిటీ భేటీ అనంతరం సీఎం చంద్రబాబు
  • సాక్షి, న్యూఢిల్లీ:  స్వచ్ఛభారత్ అభియాన్‌పై తుది నివేదికను జూన్ చివరి నాటికి కేంద్రానికి అందజేస్తామని ఆంధ్రప్రదేశ్ సీఎం, సబ్ కమిటీ కన్వీనర్ చంద్రబాబు చెప్పారు.  నీతి ఆయోగ్‌లో గురువారం స్వచ్ఛభారత్ అభియాన్ సబ్ కమిటీ సమావేశం చైర్మన్ చంద్రబాబు అధ్యక్షతన జరిగింది.

    ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, బిహార్, ఢిల్లీ, హరియాణా, మహారాష్ట్ర, మిజోరం, సిక్కిం, పశ్చిమ బెంగాల్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల సీఎంలు సభ్యులుగా ఏర్పాటైన సబ్ కమిటీ తొలి సమావేశంలో సీఎంలు చంద్రబాబు, మనోహర్‌లాల్ ఖట్టర్ (హరియాణా), సిద్దరామయ్య (కర్ణాటక) హాజరయ్యారు. సమావేశానికి వస్తున్నట్టుగా సమాచారం ఇచ్చిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అనివార్యకారణాల వల్ల గైర్హాజరయ్యారు. ఏపీ మంత్రి పి.నారాయణ, రాష్ట్రాల మంత్రులు దినేశ్ అగర్వాల్ (ఉత్తరాఖండ్), ఆసిం అహ్మద్ ఖాన్ (ఢిల్లీ), రంజిత్ పాటిల్ (మహారాష్ట్ర) లతో పాటు అధికారులు హాజరయ్యారు.

    భేటీ అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ స్వచ్ఛభారత్ విధి విధానాలు, ప్రభుత్వ మార్గదర్శకాలపై చర్చించామన్నారు. దేశ, విదేశాల్లో ఉన్న ఉత్తమ విధానాలపై అధ్యయనం చేయడం కోసం వర్కింగ్ గ్రూప్ ఏర్పాటు చేశామన్నారు. నీతి ఆయోగ్ సీఈఓ సమన్వయకర్తగా ఉంటారని, తొమ్మిది రాష్ట్రాల నుంచి ఒక్కొక్కరు వర్కింగ్ గ్రూప్‌లో సభ్యులుగా ఉంటారని, వారు ఎప్పటికప్పుడు నివేదికలు తయారు చేస్తారని చెప్పారు. రెండో సమావేశం ఈ నెల 15న చండీగఢ్‌లో ఉంటుందని, మూడో సమావేశాన్ని దక్షిణాదిన నిర్వహిస్తామని వెల్లడించారు.
     
    కేంద్ర మంత్రులతో భేటీలు:
    కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్‌గజపతిరాజు, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడులతో చంద్ర బాబు భేటీ అయ్యారు. రాష్ట్ర సమస్యలపై ప్రస్తావించారు.అనంతరం టీడీపీపీ కార్యాలయంలో మంత్రులు సుజనా చౌదరి, ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కంభంపాటి రామ్మోహనరావులతో కలిసి టీడీపీ, బీజేపీ ఎంపీలతో సమావేశమై రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన అంశాలపై చర్చించారు. పార్లమెంటు ప్రాంగణంలో బాబు మీడియాతో మాట్లాడారు. రాజధాని కోసం భూసేకరణపై వెల్లువెత్తుతున్న విమర్శలపై అడగ్గా.. రాష్ట్రాభివృద్ధికోసమే భూసేకరణ చేస్తున్నామని, భూమిలేకుండా అభివృద్ధి జరగదన్నారు. రాహుల్‌గాంధీ ఏపీ పర్యటనపై అడగ్గా.. ఆయన పర్యటనతో ఏపీకి ఒరిగేదేమీలేదని ఎద్దేవా చేశారు.
     
    జిందాల్ విద్యుత్ ప్లాంట్‌ను సందర్శన


    ఢిల్లీ పారిశ్రామిక ప్రాంతం ఓఖ్లా, తిమార్‌పుర్‌లోని చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేస్తున్న జిందాల్ విద్యుత్ ప్లాంట్‌ను సీఎం చంద్రబాబు సందర్శించారు.
     
    నేడు తూర్పుగోదావరికి చంద్రబాబు

    సాక్షి, హైదరాబాద్: సీఎం చంద్రబాబు నాయుడు మేడే రోజున తూర్పుగోదావరి జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. శుక్రవారం ఉదయం 9.20 గంటలకు హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో మధురపూడి విమానాశ్రయానికి చేరుకుంటారు. జిల్లాలో ఏర్పాటుచేసిన వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు.

>
మరిన్ని వార్తలు