ఈక్విటీలు.. రూపాయే పసిడికి మార్గనిర్దేశం..!

18 Jan, 2016 00:11 IST|Sakshi
ఈక్విటీలు.. రూపాయే పసిడికి మార్గనిర్దేశం..!

వారంలో అంతర్జాతీయంగా తిరోగమనం
దేశంలో అతి స్వల్ప లాభం

 
ముంబై/న్యూయార్క్: చైనా మందగమనం... అంతర్జాతీయంగా మార్కెట్ల ప్రభావం అనూహ్యంగా పసిడిని 8వ తేదీతో ముగిసిన వారంలో భారీగా పుంజుకునేట్లు చేసినా... రెండవ వారం ఈ ధోరణి అంతర్జాతీయంగా కొనసాగలేదు. వారం వారీగా స్వల్ప నష్టాలతో ముగిసింది.  పసిడి స్వల్పకాలంలో పెరిగినా... తిరిగి నెమ్మదిస్తుందని పలువురు విశ్లేషకులు పేర్కొన్న విధంగానే రెండవవారం ఫలితం వెలువడ్డం గమనార్హం. రానున్న కొద్ది రోజుల్లో కూడా పసిడికి ప్రధానంగా అంతర్జాతీయంగా ఈక్విటీ మార్కెట్ల పనితీరు, దీనితోపాటు దేశీయంగా రూపాయి కదలికలు మార్గనిర్దేశం చేస్తాయని నిపుణులు భావిస్తున్నారు. చైనాలో ఆర్థిక సంక్షోభ పరిస్థితులు మరింత తీవ్రరూపం దాల్చితే మాత్రం పసిడి తిరిగి పుంజుకోవచ్చన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అయితే పలు వర్గాలు మాత్రం ఈ విలువైన మెటల్ దూకుడు స్వల్పకాలమేనని మాత్రం అంచనావేస్తున్నాయి.

అంతర్జాతీయంగా...
అంతర్జాతీయంగా న్యూయార్క్ కామెక్స్ ట్రేడింగ్‌లో  చురుగ్గా ట్రేడవుతున్న పసిడి ఫిబ్రవరి కాంట్రాక్ట్ ధర ఔన్స్ (31.1గ్రా)కు గడచిన వారంలో తొమ్మిది వారాల గరిష్ట స్థాయిలో 1,097 డాలర్ల వద్ద ముగియగా... 15వ తేదీతో ముగిసిన తాజా సమీక్షా వారంలో... తిరోగమించింది. 1,091 డాలర్లకు తగ్గింది. వెండి కూడా 13.91 డాలర్ల నుంచి స్వల్పంగా 13.89 డాలర్ల వద్ద ముగిసింది.
 
దేశీయంగా  తీవ్ర ఒడిదుడుకులు...
మార్కెట్ తీవ్ర ఒడిదుడుకులకు గురై... చివరకు స్వల్ప లాభాలతో ముగిసింది. అంతర్జాతీయంగా మైనస్‌లో ఉన్నప్పటికీ స్థానిక కొనుగోళ్ల మద్దతు దీనికి ప్రధాన కారణం. 99.5 ప్యూరిటీ ధర 10 గ్రాములకు రూ.15 లాభపడి రూ.25,860 వద్ద ముగిసింది. 99.9 ప్యూరిటీ ధరా ఇంతే స్థాయిలో ఎగసి రూ.26,010 వద్ద ముగిసింది. వెండి కేజీకి రూ.120 నష్టంతో రూ.33,925 వద్ద ముగిసింది.
 
 

Read latest Top-news News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా