ఉగ్రవాదంపై ఉమ్మడి పోరు

11 Oct, 2015 03:40 IST|Sakshi
ఉగ్రవాదంపై ఉమ్మడి పోరు

భారత్ - జోర్డాన్ అంగీకారం
కింగ్ అబ్దుల్లాతో ప్రణబ్ భేటీ
 
 అమ్మాన్: ఉగ్రవాద వ్యతిరేక పోరాటం, రక్షణ రంగాల్లో సహకారాన్ని పెంపొందించుకోవాలని భారత్, జోర్డాన్‌లు నిర్ణయించాయి. జోర్డాన్, పాలస్తీనా, ఇజ్రాయెల్ దేశాల్లో ఆరు రోజుల పర్యటనకు బయలుదేరిన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ శనివారం తొలుత జోర్డాన్ రాజధాని అమ్మాన్ చేరుకున్నారు. ఆ దేశ పాలకుడు కింగ్ అబ్దుల్లాతో సమావేశమయ్యారు. ఉగ్రవాదం, ఐక్యరాజ్యసమితి భద్రతామండలి సంస్కరణలు వంటి అంశాలపై చర్చలు జరిపారు. ఉగ్రవాదంపై పోరాటం, రక్షణ రంగాల్లో ఇరు దేశాల మధ్య మరింత ఎక్కువగా సహకారం అవసరమని అగ్రనేతలిద్దరూ అంగీకారానికి వచ్చారు. జోర్డాన్‌కు భారత్  రూ. 650 కోట్ల మేర రుణం ఇవ్వనున్నట్లు కింగ్ అబ్దుల్లాకు ప్రణబ్ తెలిపారు.

ఇరు దేశా భాగస్వామ్యంతో రూ. 5,570 కోట్ల వ్యయంతో ఇషీదియాలో నిర్మించిన ప్రపంచంలో అతి భారీ సల్ఫ్యూరిక్ యాసిడ్ (గంధకికామ్లము) పరిశ్రమను ప్రణబ్, అబ్దుల్లాలు అమ్మాన్‌లోని రాజసౌధం హల్ హుస్సేనియా నుంచే ఆన్‌లైన్‌లో రిమోట్ బటన్ ద్వారా ప్రారంభించారు. అంతకుముందు అమ్మాన్ చేరుకున్న రాష్ట్రపతి ప్రణబ్‌కు కింగ్ అబ్దుల్లా మధ్యాహ్న విందు ఇచ్చారు. క్వీన్ రానియాతో సహా సాధ్యమైనంత త్వరలో భారత పర్యటనకు రావాలన్న ప్రణబ్ ఆహ్వానాన్ని అబ్దుల్లా అంగీకరించారు.

మరిన్ని వార్తలు