డ లైఫ్ ఆఫ్ ‘టై’

15 May, 2015 02:15 IST|Sakshi
డ లైఫ్ ఆఫ్ ‘టై’

ఇదో చిత్రమైన రెస్టారెంట్.. ఏంటీ విశేషం అనుకుంటున్నారా? ఒక్కసారి పైకి లుక్కేయండి. వేలాది టైలు వేలాడుతూ కనిపించడం లేదూ.. అమెరికాలోని అరిజోనాలో ఉన్న పినాకిల్ పీక్ రెస్టారెంట్లో టై ధరించడం నిషిద్ధం. ఎవరైనా పొరపాటున టై ధరించి వస్తే.. వెంటనే సిబ్బంది కత్తెరతో దాన్ని కోసి.. కోట గుమ్మానికి వేలాడదీసినట్లుగా వాటిని రెస్టారెంట్లో ఇలా వేలాడదీస్తారు. 1957లో ఓ కిరాణా షాపులా మొదలైన పినాకిల్ పీక్ తర్వాతి కాలంలో రెస్టారెంట్‌గా మారింది. అయితే.. ఈ టైలకు కత్తెరేసే సంప్రదాయం కొన్నేళ్ల క్రితం ప్రారంభమైంది. ఓ రోజు రాత్రి ఈ రెస్టారెంట్  ఎగ్జిక్యూటివ్ ఒకరు తన యజమానితో పాటు డిన్నర్‌కు కూర్చున్నాడు.

తన రెస్టారెంట్‌లో అంతా సింపుల్‌గా ఉండాలని.. అందుకే ఆ టైను తీసేయాలని యజమాని ఆదేశించాడు. దాన్ని సదరు ఎగ్జిక్యూటివ్ పట్టించుకోకపోవడంతో దగ్గర్లో ఉన్న కత్తి తీసుకుని.. దాన్ని కట్ చేసి పారేశాడు. అయితే.. ఈ ఘటనకు గుర్తుగా తన టైను అందరికీ కనిపించేటట్లుగా రెస్టారెంట్లో వేలాడదీయాలని ఎగ్జిక్యూటివ్ యజమానిని కోరాడు. దీంతో అలా మొదలైన ఈ సంప్రదాయం నేటికీ కొనసాగుతోంది. ప్రతీ టై మీద ఆ టై యజమాని పేరు అతికించి ఉంటుంది. ఇప్పటివరకూ దాదాపు 10 లక్షల టైలు ఇలా కట్ చేసి ఉంటారని అంచనా.

మరిన్ని వార్తలు