కాంగ్రెస్‌ది మంత్రసాని పాత్ర

1 Oct, 2015 02:02 IST|Sakshi
కాంగ్రెస్‌ది మంత్రసాని పాత్ర

♦ అసెంబ్లీలో దుమారం లేపిన రసమయి వ్యాఖ్యలు
♦ తీవ్రంగా స్పందించిన సీఎల్పీనేత జానారెడ్డి
♦ తెలంగాణ రాష్ట్రానికి జన్మనిచ్చిందే కాంగ్రెస్ అంటూ ఆగ్రహం
♦ వ్యాఖ్యలు ఉపసంహరించుకోకుంటే సభ జరగనివ్వమని హెచ్చరిక
♦ వెనక్కి తీసుకున్న రసమయి.. శాంతించిన విపక్షం
 
 సాక్షి, హైదరాబాద్ : ‘రాజోలిబండ తూములు పగులగొట్టి నీళ్లు దోచుకెళ్తుంటే తీవ్ర జ్వరాన్ని కూడా లెక్కచేయకుండా పాదయాత్ర చేసి రైతు పక్షాన నిలిచిన కేసీఆర్‌కు రైతుల సమస్యలు తెలియవా... తెలంగాణ ఉద్యమాన్ని రైతు విముక్తి ఉద్యమంగా నడిపిన ఘనత ఆయనది. అసలు రైతుల విషయంలో మాది కన్నతల్లి పాత్ర. మీది కాన్పు చేసే మంత్రసాని పాత్ర’ అంటూ అధికారపార్టీ సభ్యుడు రసమయి బాలకిషన్ కాంగ్రెస్ సభ్యులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు బుధవారం శాసనసభలో దుమారం లేపాయి. రైతు ఆత్మహత్యలకు ప్రభుత్వ వైఫల్యమే కారణమంటూ కాంగ్రెస్ సభ్యుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రసంగించిన వెంటనే రసమయికి అవకాశం వచ్చింది.

కాంగ్రెస్‌ను విమర్శిస్తూ ప్రసంగాన్ని ప్రారంభించిన ఆయన, ఆ ఊపులోనే తల్లిపాత్ర... మంత్రసాని పాత్ర అంటూ వ్యాఖ్యలు చేశారు. దీనికి సీఎల్పీనేత జానారెడ్డి తీవ్రంగా స్పందించారు. ‘అర్థంపర్థంలేని, అవగాహన లేని మాటలేంటి. తెలంగాణను ఇచ్చిందే కాంగ్రెస్ అని మరవద్దు. మంత్రసానిలాగా మీరు ఎదురుచూస్తుంటే కన్నతల్లిలాగా తెలంగాణ అనే బిడ్డను ఇచ్చింది కాంగ్రెస్. ఆయన వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నా. వాటిని ఉపసంహరించుకోకపోతే సభను జరగనివ్వం’ అంటూ జానారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరినీ బాధించేం దుకు తాను ఆ వ్యాఖ్యలు చేయలేదని, ఎన్నో అవమానాలు భరించి ఈ స్థాయికి వచ్చిన తనకు వ్యాఖ్యలు ఉపసంహరించుకోవటంలో భేషజాలు లేవని రసమయి ప్రతిస్పందించారు.

వాటిని పట్టించుకోని కాంగ్రెస్ సభ్యులు సీట్ల నుంచి లేచి ముందు వరస వద్దకు చేరుకుని నిరసన వ్యక్తం చేశారు. ‘వ్యాఖ్యలు విత్‌డ్రా చేసుకోవాలని కాంగ్రెస్ సభ్యులు అం టున్నారు. నేను ఉపసంహరించుకున్నట్టు చెప్పాను. విత్‌డ్రా అంటే ఏంటో నాకు తెలియదు, నాకు ఇంగ్లిష్ రాదు’ అని రసమయి చెప్పారు. మంత్రి హరీశ్‌రావు జోక్యం చేసుకొని, తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నట్టు చెప్పిన తర్వాత కూడా రాద్ధాంతం చేయటం సరికాదన్నారు.

 చెరువులో ఏముంటాయి
 ‘చెరువులో ఏముంటాయి..’ అని తాను ఉపాధ్యాయుడిగా ఉండగా మూడో తరగతి విద్యార్థిని అడిగితే.. లొట్టపీచు చెట్లుంటాయి అని సమాధానం చెప్పాడని, పుట్టి బుద్ధెరిగిన తర్వాత పిల్లలు చెరువుల్లో నీళ్లు చూసిన దాఖలాలు లేకపోవటమే దీనికి కారణమని బాలకిషన్ పేర్కొన్నారు. ఇంతకాలానికి పూడిక తీసి వాటికి చెరువు రూపమిచ్చిన ఘనత కేసీఆర్‌దేనన్నారు. అయితే వరుణుడు కరుణించి ఉంటే ఈపాటికి వాటిల్లో నీళ్లు నిండేవని, ఎర్రబెల్లి దయాకరన్న అద్దంలో బదులు తన ముఖాన్ని చెరువు నీటిలో చూసుకునేవాడని (అంతకుముందు టీడీపీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు) వ్యంగ్యంగా పేర్కొన్నారు. అధికారంలో ఉన్నప్పుడూ టీడీపీ నేతలది ప్రతిపక్ష పాత్రేనని, ప్రతిపక్షంలో ఉండగా ప్రతిపక్ష పాత్రేనని, తెలంగాణపై ఎప్పుడూ టీడీపీది సవతితల్లి పాత్రేనని రసమయి ఎద్దేవా చేశారు.

మరిన్ని వార్తలు