బట్టతలకు సరికొత్త మందు!

18 Nov, 2015 03:57 IST|Sakshi
బట్టతలకు సరికొత్త మందు!

బట్టతలపై జుట్టు పెరిగేందుకు అనేక ప్రయత్నాలు చేశారా.. పసరు వైద్యం నుంచి ఆధునిక ట్రాన్స్‌ప్లాంటేషన్ వరకు అన్ని రకాల వైద్యం కోసం ప్రయత్నించి విసిగిపోయారా.. అయితే మీలాంటి వారికోసమే ఈ శుభవార్త. కొలంబియా యూనివర్సిటీ వైద్యులు బట్టతల పోయేందుకు ఓ సరికొత్త పరిష్కారం కనుగొన్నారు. అంతేకాదు కేవలం పది రోజుల్లోనే ఒత్తయిన జుట్టు వచ్చేలా చేయొచ్చని చెబుతున్నారు. కొన్ని రకాల ఎంజైమ్‌ల ఉత్పత్తి నిలిపివేయడం ద్వారా ఇది సాధ్యపడుతుందని పేర్కొంటున్నారు. ఎలుకలపై చేసిన ప్రయోగాల్లో ఈ విషయాన్ని కనిపెట్టారు.

ఈ ప్రయోగాల ముఖ్య లక్ష్యం.. అలోపీసియా అరేటా (అకస్మాత్తుగా శరీరంపై కొన్ని ప్రాంతాల్లో జుట్టు ఊడిపోవడం) వ్యాధికి చికిత్స. అయితే బట్టతలలో తలపై జుట్టు ఊడిపోతుంది. అలోపీసియా వల్ల మాత్రం కొంత ప్రాంతంలోనే జుట్టు ఊడిపోతుంది. వెంట్రుకల కుదుళ్లలో జానస్ కైనేజ్ వర్గపు ఎంజైమ్ ఉత్పత్తిని నిరోధించే మందులు.. ఎలుకల్లో కొత్తగా వెంట్రుకలు వచ్చేలా చేస్తున్నట్లు గుర్తించారు. ఈ మందులను చర్మంపై పూయడం ద్వారా మెరుగైన ఫలితాలు వస్తాయని పరిశోధన బృందం సభ్యుడు క్రిస్టియానో తెలిపారు. తమ ప్రయోగాల్లో ఉపయోగించిన రెండు మందులకు ఎఫ్‌డీఏ అనుమతి లభించిందన్నారు.

మరిన్ని వార్తలు