రైల్వేలైన్ పేరిట మట్టి దందా!

31 Aug, 2015 03:52 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: పెద్దపల్లి-నిజామాబాద్ న్యూ బ్రాడ్‌గేజ్ రైల్వేలైను నిర్మాణంలో భాగంగా నిజామాబాద్ జిల్లా ఆర్మూరు ప్రాంతంలో జరుగుతున్న పనుల కోసం చేపట్టిన మట్టి, మొరం తవ్వకాల వివాదం ముదురుతోంది. నిబంధనలకు విరుద్ధంగా చెరువుల్లో సాగిన అక్రమ మట్టి, మొరం తవ్వకాలపై ఓ వైపు ‘పిల్’ దాఖలు కాగా.. మరోవైపు ఆ చెరువులను వదిలేసిన కాంట్రాక్టు సంస్థలు ఏకంగా ప్రభుత్వ భూముల్లోనే తవ్వడం వివాదాస్పదం అవుతోంది.

ఆర్మూరు-నిజామాబాద్ మధ్య సాగుతున్న ఈ రైల్వేలైను పనుల కోసం నిబంధనలకు విరుద్ధంగా రాంచంద్రపల్లి సింగసముద్రం, ధర్పల్లి మండలం లోలం చెరువుల నుంచి రూ.8 కోట్ల విలువ చేసే 4 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి, మొరం తవ్వకాలు జరిపి ఆ చెరువులను పూర్తిగా విచ్ఛిన్నం చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇదే సమయంలో మాక్లూరు, జక్రాన్‌పల్లి మండలాల్లోని రాంచంద్రపల్లి, మునిపల్లిలలో ప్రభుత్వ స్థలాల్లో అనుమతుల పేరిట నిబంధనలను గాలికి వదిలి తవ్వకాలు చేపట్టడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

చెరువుల్లో నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు జరిపారని వరంగల్ జిల్లాకు చెందిన రేవూరి నారాయణ రెడ్డి అండ్ సన్స్ ప్రైవేట్ కంపెనీ లిమిటెడ్, మిలీనియం కన్‌స్ట్రక్షన్స్, జీవీఆర్ కన్‌స్ట్రక్షన్స్ సంస్థల జాయింట్ వెంచర్‌పై ప్రజా ప్రయోజనాల వాజ్యం (పిల్) దాఖలైంది. కాంట్రాక్టు సంస్థలతో పాటు  అప్పటి జిల్లా కలెక్టర్ సహా నీటిపారుదల, మైనింగ్, రెవెన్యూ అధికారులు14 మందిని కూడా చేర్చారు. ఈ ‘పిల్’పై సీరియస్‌గా స్పందించిన హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, జస్టిస్ ఎస్.వి.భట్ సెప్టెంబర్ 7న హైకోర్టుకు హాజరై తగిన ఆధారాలను సమర్పించాలని నోటీసులు జారీ చేశారు.

ఇదే సమయంలో నిబంధనలకు విరుద్ధంగా మాక్లూరు మండలం రాంచంద్రపల్లి, జక్రాన్‌పల్లి మండలం మునిపల్లిల్లో ప్రభుత్వ భూముల్లో తవ్వకాలకు అనుమతులు ఇచ్చిన రెవెన్యూశాఖ మరో వివాదానికి తెర లేపింది. మట్టి, మొరం తవ్వకాల అనుమతుల విషయంలో రాంచంద్రపల్లి, మునిపల్లి గ్రామాల రైతులపై ఒకతీరుగా వ్యవహరించిన రెవెన్యూ, మైనింగ్ శాఖలు, రైల్వేలైన్ కాంట్రాక్టు సంస్థలకు అనుకూలంగా స్పందించాయి.

మునిపల్లికి చెందిన బాయి లింబన్న అనే రైతు 53/1 సర్వేనంబర్ (ప్రస్తుతం కాంట్రాక్టు సంస్థలు తవ్వకాలు జరుపుతున్న ప్రభుత్వ భూమి)లో పంటచేల అవసరాల కోసం కొద్దిపాటి తవ్వకానికి అనుమతించాలని ఐదు నెలల క్రితం దరఖాస్తు చేసుకున్నారు. ఎన్‌వోసీ ఇచ్చినట్లే ఇచ్చిన రెవెన్యూ అధికారులు.. ఆ పరిసరాల్లో ఉన్న చర్చి, హైస్కూల్, హౌసింగ్‌బోర్డు కాలనీవాసులు వ్యతిరేకిస్తున్నారనే సాకుతో ఆయన ఫైలు డిప్యూటీ డెరైక్టర్ (మైనింగ్ ) కార్యాలయూనికి చేరే స్థాయిలో నిలిపివేశారు.

ఇప్పుడు అదే సర్వే నంబర్, అదే భూమిలో పెద్ద ఎత్తున యంత్రాలతో తవ్వకాలు, భారీ వాహనాల్లో మొరం రవాణా చేసేందుకు కాంట్రాక్టు సంస్థలకు ఎన్‌వోసీ జారీ చేశారు. మునిపల్లి శివారులోని 53/1 సర్వే నంబర్‌లో 2.16 ఎకరాల్లో తవ్వకాలు జరిపేందుకు అనుమతులు ఇచ్చారు. అదే విధంగా మాక్లూరు మండలం రాంచంద్రపల్లి శివారులో 4.2 ఎకరాల ప్రభుత్వ భూమిలో సైతం తవ్వకాలకు అనుమతులు ఇచ్చారు. అధికారులు కాంట్రాక్టర్లతో కుమ్మక్కై ఈ మేరకు అనుమతులు ఇస్తున్నారన్న ఆరోపణలున్నాయి.

మరిన్ని వార్తలు