ఆ దుకాణాలను సీజ్ చేయండి

8 Sep, 2015 03:58 IST|Sakshi
ఆ దుకాణాలను సీజ్ చేయండి

* ఫుట్‌పాత్‌ల ఆక్రమణలపై హైకోర్టు సీరియస్
* వారి లెసైన్సులను రద్దు చేయాలని జీహెచ్‌ఎంసీకి ఆదేశం

సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో ఫుట్‌పాత్‌లను ఆక్రమించుకున్న వ్యాపారుల్లో... వాటిని తొలగిస్తామని హామీ ఇవ్వని వారి షాపులను సీజ్ చేసి, లెసైన్సులను రద్దు చేయాలని జీహెచ్‌ఎంసీని హైకోర్టు సోమవారం ఆదేశించింది. హైదరాబాద్‌లోని సిద్దంబర్‌బజార్, మహబూబ్‌గంజ్ ప్రాంతాల్లో ఫుట్‌పాత్‌ల ఆక్రమణల తొలగింపునకు జీహెచ్‌ఎంసీ అధికారులు చర్యలు తీసుకోవడం లేదంటూ

 లక్ష్మీనివాస్ అగర్వాల్ అనే వ్యక్తి హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం (పిల్) దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాన్ని ఇప్పటికే పలుమార్లు విచారించిన తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం... సోమవారం మరోసారి విచారించింది. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఏఎస్‌జీ) బి.మహేందర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ...

ఆక్రమణల తొలగింపునకు 120 మంది వ్యాపారులు హామీ ఇచ్చారని, 33 మంది హామీ ఇవ్వలేదని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై స్పందించిన ధర్మాసనం... హామీ ఇవ్వని వారి దుకాణాలను సీజ్ చేసి, వారి లెసైన్సులను రద్దు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 14కు వాయిదా వేసింది.

>
మరిన్ని వార్తలు