గ్వాలియర్‌లో ఉద్రిక్తత

25 Oct, 2015 01:19 IST|Sakshi
గ్వాలియర్‌లో ఉద్రిక్తత

♦ మొహరం ర్యాలీ రూటు మార్చారని ఆందోళన.. కర్ఫ్యూ విధింపు
♦ జార్ఖండ్‌లో రాళ్లు రువ్వుకున్న ఇరు వర్గాలు, ఒకరి మృతి
♦ బిహార్, యూపీల్లో స్వల్ప ఘర్షణలు
 
 న్యూఢిల్లీ: మొహరం సందర్భంగా చేపట్టిన ర్యాలీలు రెండు, మూడు చోట్ల ఉద్రికత్తకు దారితీయటంతో.. పలువురికి గాయాలయ్యాయి. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో మొహరం ర్యాలీ సందర్భంగా తలెత్తిన ఘర్షణలతో కర్ఫ్యూ విధించాల్సి వచ్చింది. శుక్రవారం రాత్రి ఓ రూట్లో ర్యాలీకి అనుమతిచ్చిన పోలీసులు.. ఉదయం రూటు మార్చటంతో కొందరు యువకులు ఆందోళన చేపట్టారు. కొన్ని చోట్ల రాళ్లు రువ్వటంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో కర్ఫ్యూ విధించాల్సి వచ్చిందని.. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని.. పోలీసులు తెలిపారు. జార్ఖండ్‌లోని హజారీబాగ్ జిల్లాలో మొహర్రం ర్యాలీ సందర్భంగా రెండు వర్గాల మధ్య గొడవ హింసాత్మకంగా మారటంతో ఒకరు మృతిచెందగా.. 9మందికి గాయాలయ్యాయి.

పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు గాల్లోకి 70 రౌండ్ల కాల్పులు జరపాల్సి వచ్చింది. బిహార్‌లోని మధుబని ప్రాంతంలో.. తాజియా ర్యాలీ సందర్భంగా రెండు వర్గాలు రాళ్లు రువ్వుకోవటంతో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఉత్తరప్రదేశ్‌లోని రెండు ప్రాంతాల్లో చిన్న చిన్న ఘటనలు  మినహా మొహరం ప్రశాంతంగానే జరిగింది. కోల్‌కతాలో పెద్ద సంఖ్యలో షియాలు మొహరం ర్యాలీల్లో పాల్గొన్నారు. పరిస్థితిని ఊహించిన పోలీసులు శనివారం.. దుర్గాదేవి విగ్రహాల నిమజ్జనాన్ని ఆదివారానికి వాయిదా వేశారు. ఇవి మినహా దేశ వ్యాప్తంగా మొహర్రం ప్రశాంతంగా జరిగింది.

మరిన్ని వార్తలు