స్మార్ట్‌ఫోన్లో ‘పంచ’తంత్రం

6 Mar, 2016 23:54 IST|Sakshi
స్మార్ట్‌ఫోన్లో ‘పంచ’తంత్రం

ఈ యాప్స్ మహిళలకు ప్రత్యేకం
 
మహిళల గురించి ఎంత చెప్పినా తక్కువే. చెప్పాల్సి వస్తే... కుటుంబమే వారి లోకం. దాన్ని పక్కనబెడితే..! మరో ప్రత్యేక లోకమూ వారి సొంతం. షాపింగ్ అంటే కొందరికి పిచ్చి. ఇంకొందరికి ట్రావెలింగ్ అంటే చచ్చేంత ఇష్టం. ఆసక్తికరమైన యాక్టివిటీస్‌లో పాల్గొనటమంటే మరికొందరికి ప్రాణం. ఇక హెల్త్, ఫిట్‌నెస్, బ్యూటీ... ఇవంటే ఇష్టంలేని మహిళలుండరు. మరి వీటన్నిటి విషయాల్లో మహిళలకు టెక్నాలజీ ఏ రకంగానైనా సాయపడుతోందా? లేకేం!! చేతిలో స్మార్ట్‌ఫోన్ ఉంటే చాలు. వీటన్నిటికీ ఎవ్వరిపైనా ఆధారపడనక్కర్లేదు. ఆన్‌లైన్ షాపింగ్ నుంచి ఆసక్తికర యాక్టివిటీస్, ట్రావెలింగ్, హెల్త్, బ్యూటీ... అన్నిటికీ రకరకాల అప్లికేషన్లు (యాప్స్) అందుబాటులోకి వచ్చాయి. మహిళలకు ప్రత్యేకమైన ‘5’ యాప్స్ వివరాలు మీకోసం...
 
షాపింగ్ కోసమైతే వూనిక్...
 ఆన్‌లైన్లో ఎంపిక చేసిన ఫ్యాషన్ వస్త్రాలు పెద్ద ఎత్తున లభ్యమయ్యే చోటు వూనిక్. తమ సంస్థలోని ప్రత్యేకమైన స్టైలిస్ట్‌లు కొత్త కొత్త ఆలోచనలతో ట్రెండీగా ఉండే ఫ్యాషనబుల్ దుస్తుల్ని రూపొందిస్తున్నారని, ఎంచుకోవటానికి పెద్ద ఎత్తున కలెక్షన్ ఉందని సంస్థ చెబుతోంది. అంతేకాదు! వూనిక్‌లో ఆస్క్‌మి బజార్, హోమ్‌షాప్ 18, అమెరికన్ స్వాన్ వంటి బ్రాండ్లతో పాటు దాదాపు 10వేల మంది రిటెయిలర్లు సభ్యులుగా ఉన్నారు. దేశవ్యాప్తంగా ఉండే వెరైటీ దుస్తుల్ని ఈ రిటెయిలర్లు అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు సంస్థ చెబుతోంది.
 
‘కామ్’గా ఉంటే ప్రశాంతత!
సింపుల్‌గా ఉండి... మనసంతా ప్రశాంతత నింపే యాప్‌ల గురిం చి న్యూయార్క్ టైమ్స్, లైఫ్ హ్యాకర్ ప్రచురించిన వ్యాసాల్లో ‘కామ్’కు కూడా చోటు దక్కింది. ఇంట్లోనైనా, ఆఫీసులోనైనా ప్రశాంతత కోరుకునేవారు ఈ యాప్‌ను ఫాలో అయిపోవచ్చు. దీన్లో పాతికకు పైగా ఆహ్లాదకరమైన శబ్దాలున్నాయి. వీటి సాయంతో వేగంగా నిద్రలోకి జారిపోవటమే కాదు. ఒత్తిడి నుంచి, ఆందోళన నుంచి ఉపశమనం కూడా పొందొచ్చు.

ఆహార నియమాలకు.. మైఫిట్‌నెస్ పాల్
ఐఫోన్ వాడేవారికి కెలోరీలు లెక్కించుకుంటూ వేగంగా, తేలిగ్గా బరువు తగ్గటానికి ఉపకరించే యాప్ ఇది. దాదాపు 50 లక్షలకు పైగా ఆహార పదార్థాలకు సంబంధించిన కెలోరీల విలువలు ఉన్నాయిందులో. ఒకరకంగా చెప్పాలంటే ఆహార పదార్థాల కెలోరీలకు సంబంధించి అతిపెద్ద డేటాబేస్ తమ దగ్గరే ఉందని చెబుతోంది ఈ సంస్థ. వ్యాయామం వివరాలు ఫీడ్ చేస్తే ఎన్ని కెలోరీలు కరిగాయో కూడా చెబుతుందీ యాప్.

బ్యూటీ, వెల్‌నెస్‌కు... నైకా
మేకప్‌తో పాటు చర్మ రక్షణ, కేశ రక్షణ ఉత్పత్తులు, అత్తర్లు, దేహ సంరక్షణ ఉత్పత్తులు, ఇతర విలాస వస్తువులన్నీ ఒకే చోట లభించే యాప్ ఇది. అన్నీ నూటికి నూరుశాతం అధీకృత ఉత్పత్తులేనని.. తాము నేరుగా సదరు బ్రాండ్ల నుంచి, డిస్ట్రిబ్యూటర్ల నుంచి తెప్పిస్తామని సంస్థ చెబుతోంది. దీంట్లో వర్చువల్ మేకోవర్ టూల్ కూడా అందుబాటులో ఉంది. ఇంకా ఫోన్ ద్వారా బ్యూటీ సలహాలు, సాయం అందిస్తారు. బ్యూటీ ట్రెండ్స్‌పై ఉచితంగా నిపుణుల సలహాలు కూడా పొందొచ్చు.
 
బోర్ కొడుతోందా..! ‘ఫ్రాగో’ ఉంది!!
మీకు ట్రావెలింగ్ అంటే చెప్పలేని ఆసక్తి. మీరో ప్రాంతానికి వెళతారు. కాకపోతే అక్కడ మీరు అనుకున్న యాక్టివిటీస్ ఏమీ కనిపించలేదు. ఎవరినడిగినా సరైన జవాబైతే రావటం లేదు. మరేం చేస్తారు? అలాగే మీకు జుంబా డ్యాన్స్ నేర్చుకోవాలనో, మరో యాక్టివిటీలో పాల్గొనాలనో ఉంది. కానీ మీ ఇంటి చుట్టుపక్కల అవి నేర్పేదెవరో మీకు తెలియదు. ఏం చేస్తారు? మీకు స్మార్ట్‌ఫోన్ ఉంటే ‘ఫ్రాగో’ డౌన్‌లోడ్ చేసుకోండి. ఇది గిఫ్ట్‌జోజో కంపెనీ అందుబాటులోకి తెచ్చిన యాప్. దీనిద్వారా మీ చుట్టుపక్కల ఆసక్తికరమైన యాక్టివిటీస్ ఏం జరుగుతున్నాయో, ప్రొఫెషనల్స్ ఎవరున్నారో తెలుసుకోవచ్చు. అంతేకాదు! ఈ యాప్ ద్వారా మీకు ఇష్టమైన వారికి ఒక మరిచిపోలేని అనుభూతిని (యాక్టివిటీని) బహుమతిగా ఇవ్వొచ్చు కూడా.
 

మరిన్ని వార్తలు