ఇది అరిస్తే.. అడవి దద్దరిల్లాల్సిందే..!

9 Jun, 2014 00:07 IST|Sakshi
ఇది అరిస్తే.. అడవి దద్దరిల్లాల్సిందే..!

అవునట. కీటకం కొంచెం కూత ఘనం అన్నట్లు.. ఇది అడవి దద్దరిల్లిపోయేంత రేంజ్‌లో శబ్దం చేస్తుందట! చెవులు చిల్లులు పడేలా శబ్దాలు చేసే కీచురాళ్ల గురించి తెలుసు కదా. వాటి వర్గానికి చెందినదేనట ఈ కొత్త జాతి కీటకం కూడా. అయితే ఇది మనముందుండి శబ్దం చేసినా.. మనకు అస్సలు వినపడదు లెండి. ఎందుకంటే.. దీని శబ్దం మనం వినలేనంత ఫ్రీక్వెన్సీలో ఉంటుందట మరి! మనం 20 హెర్ట్జ్‌ల నుంచి 20 కిలోహెర్ట్జ్‌ల మధ్య ఫ్రీక్వెన్సీల్లో ఉండే ధ్వనినే వినగలుగుతాం. కానీ దీని శబ్దం ఏకంగా 150 కిలోహెర్ట్జ్‌ల వరకూ ఉంటుందట. ఆడ కీటకాలను ఆకర్షించేందుకు మగకీటకాలు ఈ రేంజ్‌లో పాటలు పాడతాయని... జంతుసామ్రాజ్యంలోనే అత్యధిక ఫ్రీక్వెన్సీతో ప్రేమగీతాలు పాడేవి ఇవేనని చెబుతున్నారు. అందుకే.. ఈ జాతికి ‘సూపర్‌సోనస్’ అని పేరుపెట్టారు. దక్షిణ అమెరికాలోని అడవుల్లో ఈ కొత్తజాతితోపాటు మరో మూడు కొత్త రకం కీటకాలనూ శాస్త్రవేత్తలు కనుగొన్నారు.

 

అన్నట్టూ.. ఇవి శబ్దాలు చేసేది నోటితో కాదు.. రెక్కలతో. రెక్కలు చాలా చిన్నగా ఉండటంతో ఇవి ఎక్కువగా ఎగరలేవు. కానీ.. ఒక రెక్కతో ఇంకో రెక్కపై ఉండే రంపపుపళ్ల వంటివాటిపై వేగంగా రుద్దుతూ శబ్దం చేస్తాయి. రెక్కలపై ప్రత్యేకంగా ఉండే చిన్న మద్దెలలాంటి నిర్మాణం లౌడ్‌స్పీకర్‌లా పనిచేసి శబ్దం తీవ్రతను పెంచుతుంది. ఈ ప్రత్యేకతతోనే ఇవి గబ్బిలాలు, ఇతర జీవుల నుంచీ తప్పించుకుంటాయట.  

మరిన్ని వార్తలు