సీఎం యోగి మొదటి ఆదేశం ఇదే!

20 Mar, 2017 11:44 IST|Sakshi
సీఎం యోగి మొదటి ఆదేశం ఇదే!

లక్నో: ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టని యోగి ఆదిత్యనాథ్‌ అప్పుడే పని ప్రారంభించారు. అవినీతిపై ఉక్కుపాదం మోపడమే లక్ష్యంగా పెట్టుకున్న ఆయన తన మంత్రివర్గ సహచరులకు తొలి ఆదేశాన్ని జారీచేశారు. 15రోజుల్లోగా మంత్రులంతా తమ స్థిర, చరాస్తులు, ఆదాయ వివరాలను సీఎం కార్యదర్శికి, పార్టీకి అందజేయాలని ఆదేశించారు.

లోక్‌భవన్‌లో మంత్రులతో భేటీ అయిన అనంతరం విలేకరులతో మాట్లాడిన సీఎం యోగి.. అవినీతి నిర్మూలనే తన ప్రభుత్వం తొలి ప్రాధాన్యమని స్పష్టం చేశారు. రాష్ట్ర అభివృద్ధికి, సుసంపన్నతకు అవసరమైన ప్రతి చర్యను తమ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పారు. గత 15 ఏళ్లలో అవినీతి, ఆశ్రితపక్షపాతం వల్ల యూపీ అభివృద్ధిలో వెనుకబడిపోయిందని, శాంతిభద్రతలు క్షీణించడం వల్ల ప్రజలు అనేక కష్టాలు పడ్డారని పేర్కొన్నారు. ప్రజల సంక్షేమం, శాంతిభద్రతల పరిరక్షణ తమ ప్రభుత్వ ధ్యేయమని చెప్పారు. బీజేపీ ఎన్నికల మ్యానిఫెస్టో​ అయిన లోక్‌కల్యాణ్‌ సంకల్ప పత్రంలోని ప్రతి హామీని నెరవేరుస్తామని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. 

మరిన్ని వార్తలు