మోదీ కోటలో సోనియా రోడ్‌షో

3 Aug, 2016 01:49 IST|Sakshi
మోదీ కోటలో సోనియా రోడ్‌షో

వారణాసి నుంచి యూపీ ఎన్నికల ప్రచారం ప్రారంభించిన కాంగ్రెస్ అధినేత్రి
* ఎనిమిది కిలోమీటర్ల మేర భారీ రోడ్‌షో
* అనారోగ్యంతో చివరలో వెనుదిరిగిన సోనియా

వారణాసి: వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీ మంగళవారం ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. ప్రధానిమోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి వేదికగా బలప్రదర్శన నిర్వహించారు. ఆమె సర్క్యూట్ హౌస్ వద్ద అంబేడ్కర్ విగ్రహానికి పూమాల వేసి రోడ్‌షో ప్రారంభించారు. ఇంగ్లిషియా లేన్ వరకూ  8 కిలోమీటర్ల మేరకు సాగిన షోలో వేలాది మంది  పాల్గొన్నారు.

27 ఏళ్ల క్రితం యూపీలో అధికారం కోల్పోయిన కాంగ్రెస్.. 27 ఏళ్ల యూపీ క్షోభ  అంటూ ఈ ప్రచారానికి శ్రీకారం చుట్టింది. మూడు గంటలు సాగిన షో చివరికి వచ్చేసరికి సోనియా అనారోగ్యంతో వెనుదిరిగారు. దీంతో ఆమె లేకుండానే ర్యాలీ ముందుకు సాగింది. కాగా ‘ప్రభుత్వంలో పారిశ్రామికవేత్తలు, పెద్దవాళ్లు ఎక్కువగా ఉన్నారు. వారికే కేంద్రం ప్రాధాన్యమిస్తోంది. పేదలు, వెనకబడిన తరగతులు, మైనారిటీల గురించి మాట్లాడే వాళ్లే లేరు. దేశంలో మెజారిటీ ప్రజలు అభద్రతతో ఉన్నారు’ అని సోనియా ఓ ప్రకటనలో ఆందోళన వ్యక్తం చేశారు.
 
ఢిల్లీ ఆస్పత్రికి: రోడ్ షో అర్ధాంతరంగా ముగించుకున్న సోనియా తిరిగి ఢిల్లీ వెళ్లారు. అంతకుముందు వారణాసిలో ఓ హోటల్లో, ఎయిర్‌పోర్టులో ఆమెకు  సెలైన్ ఎక్కించారు. ఢిల్లీ చేరుకున్నాక  ఆమెను కుమార్తె ప్రియాంక,పార్టీ నేతలు రిసీవ్ చేసుకుని చెకప్ కోసం గంగారాం ఆస్పత్రికి తీసుకెళ్లారు. సోనియా డీహైడ్రేషన్, అధిక రక్తపోటుతో బాధపడ్తున్నారని వైద్యులు చెప్పారు.
 
సోనియా త్వరగా కోలుకోవాలి: మోదీ

సోనియా గాంధీ త్వరగా కోలుకోవాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారు. సోనియాతో పాటు ర్యాలీలో పాల్గొన్న యూపీ కాంగ్రెస్ యూపీ సీఎం అభ్యర్థి షీలా దీక్షిత్‌తో మాట్లాడిన మోదీ.. సోనియా ఆరోగ్య పరిస్థితి గురించి వాకబు చేశారు. కాంగ్రెస్ చీఫ్‌ను ఢిల్లీకి తీసుకొచ్చేందుకు ప్రత్యేక విమానాన్ని, డాక్టర్‌ను పంపిస్తామని మోదీ చెప్పారు.

>
మరిన్ని వార్తలు