డ్రోన్ ఎగరేశారని.. ముగ్గురి అరెస్టు

20 Oct, 2016 18:38 IST|Sakshi
డ్రోన్ ఎగరేశారని.. ముగ్గురి అరెస్టు
దేశ ఆర్థిక రాజధాని ముంబై విమానాశ్రయం సమీపంలో డ్రోన్లు ఎగరేసినందుకు ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. ఇలా డ్రోన్ ఎగరేయడాన్ని ఇండిగో ఎయిర్‌లైన్స్ పైలట్ గుర్తించారు. ఈ కేసులో రాహుల్ రాజ్‌కుమార్ జైస్వాల్ (24), రాణా సుభాష్ సింగ్ (25), విధిచంద్ జైస్వాల్ (45)అను క్రైంబ్రాంచి పోలీసులు అరెస్టుచేశారు. డెహ్రాడూన్ నుంచి ముంబై వచ్చిన ఇండిగో విమాన పైలట్.. తాను తన విమానానికి సుమారు 100 మీటర్ల దిగువన ఒక డ్రోన్ చూశానని అధికారులకు తెలిపాడు. రాత్రి 7.30 గంటల సమయంలో ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యే సమయంలో ఈ డ్రోన్ కనిపించిందన్నాడు. 
 
అయితే.. సినిమా షూటింగ్ కోసం ఆ డ్రోన్ కెమెరాను ఉపయోగించినట్లు దర్యాప్తులో తేలింది. ముంబై శివార్లలోని చార్కోప్ ప్రాంతంలో ఈ సినిమా ప్రోమో షూటింగ్ జరిగింది. సినిమా పూర్తిస్థాయి షూటింగ్ తర్వాత షెడ్యూలు చేశారు. పైలట్ అప్రమత్తంగా వ్యవహరించి అధికారులకు సమాచారం చెప్పడంతో.. అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. నిందితుల నుంచి డ్రోన్ కెమెరాను, ఒక ఐప్యాడ్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రాహుల్, రామ్ కెమెరాను హ్యాండిల్ చేస్తుండగా.. విధిచంద్ డ్రోన్లను అద్దెకు ఇచ్చే వ్యాపారం చేస్తుంటాడని పోలీసులు చెప్పారు. ముంబై గగనతలంలో డ్రోన్లను ఉపయోగించడం నిషిద్ధం. అయినా ఎగరేసినందుకు వీళ్లపై పలు సెక్షన్ల కింద కేసులు పెట్టి కేసు విచారిస్తున్నారు. 
మరిన్ని వార్తలు