ఆ కంటెయినర్ల వెనుక మరో మూడు కార్లు!

14 May, 2016 15:19 IST|Sakshi
ఆ కంటెయినర్ల వెనుక మరో మూడు కార్లు!

తమిళనాడులో ఎన్నికలకు ముందు దొరికిన రూ. 570 కోట్ల నగదుపై అనుమానాలు తలెత్తుతున్నాయి. తిరుపూరు జిల్లా పెరుమనలూరు - కునత్తూరు బైపాస్‌రోడ్డులో ఈ నగదు దొరికిన విషయం తెలిసిందే. ఎన్నికల అధికారులు తనిఖీ చేస్తుండగా మూడు కంటెయినర్లలో రూ. 570 కోట్ల నగదు పట్టుబడింది. అయితే.. ఈ మూడు కంటెయినర్లను వెనక నుంచి మూడు కార్లు కూడా ఫాలో అవుతున్న విషయం తాజాగా బయటకు వచ్చింది. పోలీసులు ఆపగానే కంటెయినర్లను వదిలిపెట్టి మూడు కార్లు వెనక్కి తిప్పి తీసుకెళ్లిపోయారు. ఈ మూడు కార్లను పోలీసులు వెంటాడి చెంగపల్లి సమీపంలో పట్టుకున్నారు. కార్లలో ఉన్న వ్యక్తులను తమిళనాడు పోలీసులు ప్రశ్నించగా.. తాము ఆంధ్రప్రదేశ్ పోలీసులమని వారు చెప్పారు. పోలీసు యూనిఫాం వేసుకోలేదమని ప్రశ్నించగా సమాధానం లేదు. పోనీ ఐడీ కార్డులు ఏవని అడిగినా చూపించలేకపోయారు. కంటెయినర్లు ఆపితే మీరెందుకు పారిపోయారని ప్రశ్నిస్తే.. దొంగలు వచ్చారనుకుని పారిపోయామన్నారు.

వాళ్లను పట్టుకున్న పోలీసులు.. కలెక్టర్, ఎస్పీల వద్ద ప్రవేశపెట్టారు. అక్కడ కూడా వాళ్లు పొంతనలేని సమాధానాలు చెబుతున్నారు. దాంతో.. ఎస్బీఐ లేదా ఆర్బీఐ నుంచి తగిన వివరాలతో కూడిన లేఖలు తమకు అందిన తర్వాత మాత్రమే నగదు విడిచిపెడతామని అధికారులు స్పష్టం చేస్తున్నారు. కానీ ఇంతవరకు అసలు ఆ నగదు గురించి అటు బ్యాంకు వర్గాలు గానీ, ఇటు ఆర్బీఐ గానీ తమిళనాడు పోలీసులను సంప్రదించలేదు. ఆధారాలు ఏమైనా వస్తే నగదు పంపిస్తామని, లేనిపక్షంలో దీని వెనుక ఉన్నవాళ్లమీద కూడా విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని చెప్పారు. అర్ధరాత్రి 12 గంటలకు కోయంబత్తూరులో లారీలు బయల్దేరగా, 12.40 గంటలకే వాటిని తిరుపూరు సమీపంలో పట్టుకున్నారు. అంత అర్ధరాత్రి సమయంలో అసలు అంత పెద్ద మొత్తాన్ని, అది కూడా సెక్యూరిటీ లేకుండా ఎలా పంపారో అర్థం కావట్లేదు. అంత నగదు తరలిస్తుంటే చీఫ్ జనరల్ మేనేజర్ స్థాయి అధికారి వెంట ఉండాలి. కానీ ఎవరూ లేరు.

వాళ్ల వద్ద ఉన్న ఇన్వాయిస్‌లో కూడా సూరిబాబు అనే వ్యక్తి ద్వారా విశాఖపట్నంలోని  బాలాజీనగర్ మెయిన్ బ్రాంచికి తరలిస్తున్నట్లు పత్రాల్లో పేర్కొన్నారు. సాధారణంగా అలాంటి సందర్భాల్లో ఆర్బీఐ అనుమతితోపాటు తగినంత సెక్యూరిటీ కూడా ఉండాలి. కానీ అవేవీ లేకపోవడంతో అనుమానాలు బలపడుతున్నాయి. ఒక్కసారిగా వైజాగ్ బ్రాంచికి ఇంత పెద్ద మొత్తం తరలించడం ఎందుకని, ఎవరైనా ప్రైవేటు వ్యక్తుల ఖాతాల కోసం తరలిస్తున్నారా అని విచారణ జరుపుతున్నారు. కంటెయినర్లను ముందు ఆపకపోవడంతో.. తర్వాత పట్టుకున్నాక కూడా వాటిలో ఉన్నవాళ్లు అనుమానాస్పదంగా సమాధానాలు చెప్పడం అన్నీ అనుమానాలను బలపరిచాయి.

మరిన్ని వార్తలు