ఈ మూడూ తప్పనిసరండోయ్..

12 Jan, 2014 03:00 IST|Sakshi

ఏ నిమిషానికి ఏమవుతుందో ఎవరూ ఊహించలేరు కాబట్టి బీమా పాలసీలు తప్పనిసరి అవసరాలుగా మారుతున్నాయి. బీమా అనగానే ట్యాక్స్ సేవింగ్ పాలసీలని, మనీ బ్యాక్ పాలసీలని.. మరొకటని రకరకాల పాలసీల సమాచారంతో గందరగోళం నెలకొంటుంది. ఏది తీసుకోవాలో అర్థం కాక  బుర్ర హీటెక్కిపోతుంటుంది. బీమా ప్రధానోద్దేశం .. మనకేదైనా అనుకోనిది జరిగితే.. కుటుంబసభ్యులు ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా చూడటమే. మిగతా వాటిని పక్కన పెట్టి ఈ కోణంలో చూస్తే ముచ్చటగా మూడు రకాల పాలసీలు ఉంటే మంచిది. అవే.. టర్మ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్, యాక్సిడెంట్ ఇన్సూరెన్స్.

 టర్మ్ ఇన్సూరెన్స్..
 ఆదాయానికి ఆధారం అయిన కుటుంబ పెద్ద హఠాత్తుగా కన్నుమూస్తే.. కుటుంబ సభ్యుల ఆర్థిక అవసరాలకు అక్కరకొస్తుంది ఈ పాలసీ. కుటుంబానికి ఒకేసారి పెద్ద మొత్తంలో డబ్బు అందజే స్తుంది. తక్కువ ప్రీమియానికి అత్యధిక కవరేజి ఇవ్వగలగడం ఈ పాలసీల ప్రత్యేకత. అయితే, ఒకవేళ పాలసీ వ్యవధి పూర్తయ్యే దాకా పాలసీదారు జీవించే ఉంటే మాత్రం ఎలాంటి డబ్బూ రాదు. ఒకవేళ కట్టిన ప్రీమియాలు కూడా వెనక్కి రావాలనుకుంటే యులిప్‌లు, ఎండోమెంట్ లాంటి వేరే పాలసీలను ఎంచుకోవాలి.

 వైద్య బీమా పాలసీలు..
 వైద్యానికయ్యే ఖర్చులు ఏయేటికాయేడు భారీగా పెరిగిపోతున్నాయి. చిన్న అనారోగ్యానికి చికిత్స కోసం ఆస్పత్రిలో చేరినా వేలకు వేలు వదిలిపోతున్నాయి. కనుక ప్రస్తుతం వైద్య బీమా పాలసీ అనివార్యంగా మారింది. మీరు పనిచేసే కంపెనీ వైద్య బీమా సదుపాయం కల్పించినా.. ఆ కంపెనీలో ఉద్యోగం మానేస్తే కవరేజి ఉండదు కాబట్టి సొంతానికంటూ ఒక పాలసీ ఉండటం మంచిది. ఈ పాలసీలు రకరకాల ప్రయోజనాలు కల్పిస్తాయి.

 ప్రమాద బీమా..
 ప్రమాదాల వల్ల అంగవైకల్యం వచ్చినా, మరణం సంభవించినా.. ఈ తరహా పాలసీలు ఉపయోగపడతాయి. వైద్య బీమా అనేది చికిత్స ఖర్చుల దాకా మాత్రమే పరిమితం అయితే.. ప్రమాద బీమా పాలసీలు అంతకుమించి మరికాస్త ప్రయోజనం ఇస్తాయి. ప్రమాదం కారణంగా మంచానికే పరిమితమై.. ఉద్యోగం చేయలేని పరిస్థితి ఏర్పడి, ఆదాయం ఉండకపోతే రోజులు గడవడం కష్టంగా మారుతుంది కదా. ఇలాంటప్పుడు ప్రమాదం, వైకల్యం వంటి అంశాలను బట్టి ప్రమాద బీమా పాలసీ ద్వారా నిర్దిష్ట మొత్తం లభిస్తుంది.
 ఏ పాలసీ తీసుకున్నా.. అవసరాలను దృష్టిలో పెట్టుకుని, కొంతైనా పరిశోధన చేసి మరీ తీసుకుంటే తర్వాత రోజుల్లో ఇబ్బందులు పడనక్కర్లేదు.
 

మరిన్ని వార్తలు