ప్రధాని మోదీతో తమిళనాడు సీఎం భేటీ

19 Jan, 2017 11:34 IST|Sakshi
ప్రధాని మోదీతో తమిళనాడు సీఎం భేటీ

న్యూఢిల్లీ: జల్లికట్టు నిర్వహణకు అనుమతి ఇవ్వాలని తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం ప్రధాని నరేంద్ర మోదీని కోరారు. ఇందుకోసం ఆర్డినెన్స్ జారీ చేయాలని విన్నవించారు. ఢిల్లీలో గురువారం ప్రధాని మోదీని ఆయన నివాసంలో పన్నీరు సెల్వం కలిసి ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. జల్లికట్టు నిర్వహణ కోసం తమిళనాడులో ఆందోళనలు తీవ్రమైన నేపథ్యంలో ఆయన ప్రధానితో సమావేశమయ్యారు. అనంతరం పన్నీరు సెల్వం మీడియాతో మాట్లాడుతూ.. జల్లికట్టుపై నిషేధాన్ని వెంటనే ఎత్తివేయాలని ప్రధాని మోదీని కోరామని చెప్పారు. కేంద్రం ఆర్డినెన్స్ను తీసుకురావాలని, జల్లికట్టు తమిళ సంప్రదాయంలో ఓ భాగమని అన్నారు.

జల్లికట్టుకు అనుమతి ఇవ్వాలని తమిళనాడులో వరుసగా మూడో రోజు ఆందోళనలు చేపట్టారు. ఇందుకు మద్దతుగా విద్యా సంస్థలు సెలవులు ప్రకటించాయి. సినిమా షూటింగ్‌లను రద్దు చేశారు. ఈ రోజు చెన్నై మెరీనా బీచ్‌లో వేలాదిమంది విద్యార్థులు ఆందోళనలో పాల్గొన్నారు. తమిళులు సంప్రదాయ క్రీడగా భావించే జల్లికట్టును సంక్రాంతి సందర్భంగా నిర్వహిస్తారు. అయితే సుప్రీం కోర్టు దీనిపై నిషేధం విధించింది. తమిళనాడులో ప్రజల నుంచి వస్తున్న డిమాండ్లను దృష్టిలో ఉంచుకుని పార్టీలకతీతంగా జల్లికట్టుకు మద్దతు ఇస్తున్నారు. సినీ ప్రముఖులు కూడా సంఘీభావం తెలిపారు.