పొగాకు రైతుల కోసం ఆత్మత్యాగం

23 Sep, 2015 03:06 IST|Sakshi

దేవరపల్లి: రాష్ట్రంలో పొగాకు రైతుల ఆత్మహత్యలపై చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రికి లేఖ రాశాడు... పొగాకు రైతుల కోసం తాను ఆత్మత్యాగం చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నట్టు అందులో స్పష్టంచేశాడు... పరిష్కారమార్గం కూడా చూపించాడు... అయినా ప్రభుత్వాధినేత స్పందించకపోవడంతో అన్నంతపనీ చేశాడు... కూల్‌డ్రింక్‌లో పురుగు మందు కలుపుకుని తాగి ఉసురు తీసుకున్నాడు. పశ్చిమగోదావరి జిల్లా దేవరపల్లి మండలం యర్నగూడెంకు చెందిన సింహాద్రి వెంకటేశ్వరరావు అనే రైతు (55) సోమవారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడగా మంగళవారం వెలుగులోకి వచ్చింది.

పొగాకు రైతుల దుస్థితిపై వెంకటేశ్వరరావు వారం రోజుల కిందటే ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేఖ రాశారు. పొగాకు రైతుల్ని ఆదుకోవాలని కోరారు. వారి కోసం తాను ఆత్మత్యాగం చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నట్టు అందులో పేర్కొన్నారు. లేఖను ఈనెల 16న సీఎంకు పంపించారు. బ్యాంకు అప్పులు తీర్చలేక పొగాకు రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం మొదలుపెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు.

బాబు తన ప్రాణరక్షణ కోసం సుమారు రూ.5.50 కోట్లు వెచ్చించి బస్సు తయారు చేయించుకున్నప్పుడు... పొగాకు రైతుల ప్రాణ రక్షణకు ఎందుకు చర్యలు తీసుకోరని ప్రశ్నించారు. బ్యారన్‌కు రూ.9 లక్షల చొప్పున కేంద్రం పరిహారం ఇస్తే రైతులు స్వచ్ఛందంగా పొగాకు బ్యారన్ల రిజిస్ట్రేషన్లు రద్దు చేసుకుని లెసైన్సులను ప్రభుత్వానికి అప్పగిస్తారని ఆయన పేర్కొన్నారు. దీనిపై ముఖ్యమంత్రినుంచి ఎలాంటి స్పందనా లేకపోవడంతో వెంకటేశ్వరరావు ఆత్మహత్యకు పాల్పడ్డారు.
 
ప్రాణాలు మింగేసిన అప్పుల భారం
పొగాకు సాగు గిట్టుబాటు కాకపోవడం, అప్పులు పెరిగిపోవడంతో వెంకటేశ్వరరావు తనకున్న 11 ఎకరాల పొలాన్ని రెండేళ్ల కిందట అమ్మేశాడు. అయినా అప్పులు తీరక 22 ఎకరాలను దేవస్థానం భూమిని కౌలుకు తీసుకుని పొగాకు పండిస్తున్నాడు. పంటకు  రూ.22 లక్షలు పెట్టుబడి పెట్టాడు. ఈ ఏడాది పొగాకుకు  గిట్టుబాటు లభించకపోవడంతో బ్యాంకు అప్పులు తీరలేదు.సుమారు రూ.34 లక్షల మేర అప్పులు ఉన్నాయి. అది తీర్చే దారిలేక వెంకటేశ్వరరావు ఆత్మహత్యకు పాల్పడినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.

మరిన్ని వార్తలు