నేడు మున్సిపల్ జేఏసీతో ఈటల చర్చలు

14 Aug, 2015 03:19 IST|Sakshi
నేడు మున్సిపల్ జేఏసీతో ఈటల చర్చలు

సాక్షి, హైదరాబాద్: మునిసిపల్ కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ కార్మికుల సమ్మె విరమణ కోసం మళ్లీ చర్చలు ప్రారంభం కానున్నాయి. మునిసిపల్ కార్మిక జేఏసీతో శుక్రవారం ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ చర్చలు జరపనున్నారు. సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి గురువారం ఈటలతో ఫోన్‌లో సంప్రదింపులు జరిపి సమ్మె పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ అంశంపై ఈటల సీఎం కేసీఆర్‌తో గురువారం మాట్లాడిన తర్వాత, శుక్రవారం చర్చలు జరిపేందుకు అంగీకరించారు.

ఈ చర్చల్లో పంచాయతీరాజ్ మంత్రి కేటీఆర్ సైతం పాల్గొనే అవకాశముంది. కనీస వేతనాల పెంపు, ఉద్యోగాల క్రమబద్ధీకరణ తదితర 16 డిమాండ్లతో కార్మికులు గత నెల 6న సమ్మె ప్రారంభించిన సంగతి తెలిసిందే. సమ్మె 40 రోజుల కు చేరడంతో ప్రభుత్వం, కార్మిక నేతలు కాస్త మెత్తబడినట్లు తెలుస్తోంది. పారిశుధ్య కార్మికులకు నగర  పంచాయతీల్లో రూ.7,300 నుంచి రూ.9 వేలకు, మునిసిపాలిటీల్లో రూ.8,300 నుంచి 10 వేలకు, కార్పొరేషన్లలో రూ.8,500 నుంచి రూ.11 వేలకు పెంచాలనే ప్రతిపాదనలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉం ది. శ్లాబు విధానంలో పెంచాలనే ఈ ప్రతిపాదనలనపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో నేటి చర్చల్లో తేలే అవకాశముంది.

>
మరిన్ని వార్తలు