బాలుణ్ని మింగిన బోరు బావి!

3 Aug, 2015 02:40 IST|Sakshi
బాలుణ్ని మింగిన బోరు బావి!

నల్లగొండ జిల్లాలో విషాదం
పెద్దవూర: మరో బోరు బావి రాకాసి నోరు సాచింది! అప్పటిదాకా ఆడుతూ పాడుతూ ఉన్న ఓ బాలుణ్ని అమాంతం మింగేసింది. అల్లారుముద్దుగా పెంచుకుంటున్న ఒక్కగానొక్క కొడుకును దూరం చేసి తల్లిదండ్రులకు కడుపు కోతను మిగిల్చింది. బాలుణ్ని కాపాడేందుకు మూడు గంటలపాటు శ్రమించినా ఫలితం లేకపోయింది. నల్లగొండ జిల్లా పెద్దవూర మండలం పులిచర్ల గ్రామంలో ఆదివారం ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన బొలగోని నర్సింహగౌడ్, సరిత దంపతులకు శివ(4) ఏకైక సంతానం.

ఆదివారం తమకున్న ఎకరం పత్తి చేనులో కలుపు తీయటానికి దంపతులిద్దరూ వెళ్లారు. స్కూలుకు సెలవు కావడంతో శివను తమ వెంట తీసుకెళ్లారు. సరిత అక్క కూతుళ్లు ఇద్దరు కూడా వారితో వెళ్లారు. నర్సింహ, సరితలు పొలంలో పనుల్లో మునిగిపోయారు. ఈ ముగ్గురు పిల్లలు ఆడుకుంటూ వారి తాత వెంకటేశ్వర్లుకు చెందిన పక్క చేనులోకి వెళ్లారు. శివ బోరు గుంతపై ఉన్న ప్లాస్టిక్ సంచిపై ఎగురుతూ ఆడుకుంటున్నాడు.

ఇంతలో ఒక్కసారిగా బావిపై ఉన్న బస్తాలతో సహా అందులోకి జారిపోయాడు. పక్కనే ఉన్న పిల్లలు విషయాన్ని చేలో పనిచేసుకుంటున్న శివ తల్లిదండ్రులకు చెప్పారు. వారు పరుగు పరుగున బోరు గుంత వద్దకు చేరుకున్నారు. వీరి రోదనలు విని చుట్టుపక్కలవారు అక్కడికి చేరుకున్నారు.
 
అమ్మా ఊపిరి ఆడడం లేదమ్మా..!
బోరు బావిలో పది, పదిహేను అడుగుల లోతులోనే శివ ఇరుక్కుపోయాడు. పైన ఉన్నవారికి కనిపించాడు. తల్లిదండ్రులు శివా.. శివా.. అని పిలిస్తే స్పందించాడు. ‘మమ్మీ.. భయమేస్తుందమ్మా.. ఊపిరి ఆడటం లేదు.. దప్పిక వేస్తోంది’ అని ఏడుస్తూ చెప్పాడు. దీంతో వారు తాడును గుంతలోకి వేసి, దాన్ని పట్టుకొమ్మని చెప్పటంతో శివ అలాగే చేశాడు. తల్లిదండ్రులు తాడును లాగటానికి ప్రయత్నించారు. కానీ కాసేపటికి ‘డాడీ.. చేతులు నొప్పి పెడుతున్నాయి’ అంటూ తాడును వదిలేశాడు. ఒక్కసారిగా కిందికి వెళ్లడంతో అప్పటి దాకా బస్తాల సాయంతో బోరు మధ్యలో ఆగిన బాలుడు నీటిలోకి జారిపోయాడు. అప్పట్నుంచీ ఎంత పిలిచినా స్పందించలేదు. తాడుతో లాగకుండా అలాగే ఉంచితే బతికేవాడేమోనని పలువురు పేర్కొంటున్నారు.
 
మూడు గంటలపాటు సహాయక చర్యలు
బాలుడు బోరు బావిలో పడిన విషయం తెలియడంతో ఎస్సై ప్రసాదరావు తన సిబ్బందితో హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. మూడు జేసీబీలు ఏర్పాటు చేసి బోరు గుంతకు సమాంతరంగా గుంత తీయించారు. పదిహేను అడుగులు తవ్వగానే బోరు బావి గుంత బయట పడింది. అక్కడినుంచి ఒక కర్రను బోరు గుంతలోకి ప్రవేశపెట్టి.. బాలుడు ఎంత లోతులో ఉన్నాడో చూసి, మరో 5 అడుగుల గుంత తీశారు.

20 అడుగుల లోతులో బోరు బావిలోకి సొరంగం ఏర్పాటు చేయగానే అందులో నుంచి నీళ్లు బయటకు వచ్చాయి. సొరంగం నుంచి బాలుడిని పైకి లాగారు. బాలుడు బతికే ఉన్నాడని చెప్పడంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. పోలీసులు వెంటనే 108 వాహనంలోకి తరలించి, ఆక్సిజన్  పెట్టారు. ప్రథమ చికిత్స చేస్తూ నాగార్జునసాగర్‌లోని ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే బాలుడు మృతి చెందినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు.
 
గుంతను పూడ్చాలనుకుని..
శివ తాత అయిన బొలగోని వెంకటేశ్వర్లు గత శుక్రవారమే తన చేలో 230 అడుగుల మేర ఈ బోరు బావిని తవ్వించారు. అందులో నీరు పడలేదు. ఆదివారం బోరు గుంతను పూడ్చాలనుకుని పార కూడా తీసుకువచ్చాడు. కానీ వర్షం రావడంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నాడు. వర్షం ఆగిన తర్వాత గంటలోపే శివ అందులో పడిపోయి ప్రాణాలు కోల్పోవడం విషాదం!

మరిన్ని వార్తలు