ఇంత దోపిడీ ఎప్పుడూ చూళ్లేదు

11 Oct, 2015 09:24 IST|Sakshi
ఇంత దోపిడీ ఎప్పుడూ చూళ్లేదు

ఏలూరు : మునుపెన్నడూ లేనివిధంగా రాష్ట్రంలో ఇసుక దోపిడీ తారస్థాయికి చేరిందని కేంద్ర మాజీ ఎంపీ కావూరి సాంబశివరావు ఆవేదన వ్యక్తం చేశారు. ఇంతదోపిడీ ఎప్పుడూ చూడలేదని వ్యాఖ్యానించారు. శనివారం ఏలూరులో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ర్ట ఉన్నత న్యాయస్థానం జోక్యం చేసుకుని ఇసుక ర్యాంపులను మూసివేయాల్సిన పరిస్థితి వచ్చిందంటే దోపిడీ ఏస్థాయిలో జరిగిందో అర్థం చేసుకోవచ్చన్నారు. డ్వాక్రా మహిళ ముసుగులో టీడీపీ నేతలు ఇసుక ర్యాంపులను దోచుకున్నారని, ఇసుక గుట్టలను నోట్లకట్టల్లా మార్చుకున్నారని ధ్వజమెత్తారు.
 
టీడీపీ క్యాడర్‌ను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ఇసుక ర్యాంపులను అడ్డాగా మార్చుకున్నారని ఆరోపించారు. సీఎం చంద్రబాబు ఇకనైనా స్పందించి ఇసుక అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని హితవు పలికారు. జన్మభూమి కమిటీలను టీడీపీ క్యాడర్‌తో నింపేశారని ఆయన నిందించారు. ‘గ్రామస్థాయిలో సర్పంచ్ అధ్యక్షతన పంచాయతీ కార్యదర్శి, ఎంపీటీసీ, ఇద్దరు సామాజిక కార్యకర్తలు, ఇద్దరు డ్వాక్రామహిళలు సభ్యులుగా జన్మభూమి కమిటీ ఉండాలని ఉత్తర్వులు ఉన్నాయి.
 
సామాజిక కార్యకర్తలు, డ్వాక్రామహిళల పేరిట టీడీపీ కార్యకర్తలను నియమిస్తున్నారు’ అని కావూరి పేర్కొన్నారు. బీజేపీ సానుభూతిపరులైన సామాజిక కార్యకర్తలను కనీసం పరిగణనలోకి తీసుకోవడం లేదన్నారు. పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని పట్టుదలగా పూర్తిచేసిన రాష్ర్ట ప్రభుత్వం ఇప్పటికైనా పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని వేగవంతం చేయాలని కావూరి సూచించారు.

మరిన్ని వార్తలు