'అమ్మ' కందిపప్పు భలే చౌక

20 Oct, 2015 08:54 IST|Sakshi
'అమ్మ' కందిపప్పు భలే చౌక

చెన్నై: కొండెక్కిన కందిపప్పు ధర సమస్యకు తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత తాత్కాలిక పరిష్కారం చూపారు. కో-ఆపరేటివ్ స్టోర్ల ద్వారా కిలో రూ.110 ధరకే కందిపప్పు ను అందుబాటులోకి తెస్తున్నారు. ఈ అమ్మకాలు నవంబరు 1వ తేదీ నుంచి ప్రారంభమవుతాయి.

అందునా తమిళనాడులోని శాఖాహార ప్రియులకు కందిపప్పుతో చేసిన సాంబారు ఉండాల్సిందే. అంతేగాక తమిళనాడు ఇడ్లీ సాంబారుకు పేరొందిన సంగతి అందరికీ విదితమే. కిలో రూ.80 లకు దొరికే కందిపప్పు ఇటీవల కాలంలో రోజురోజుకూ పెరిగిపోతూ కిలో రూ.200 పై చిలుకు చేరుకుంది. కందిపప్పు ధరకు అనుగుణంగా హోటళ్లలో టిఫిన్, భోజనాల రేట్లను పెంచేశారు. ఉప్పులేని పప్పు, కందిపప్పు లేని సాంబారును ఆస్వాధించగలమా అన్నట్లుగా పరిస్థితి తయారైంది.

ఈ నేపథ్యంలో కందిపప్పును ప్రభుత్వం ద్వారా సరసరమైన ధరకు అందజేయనున్నట్లు ముఖ్యమంత్రి జయలలిత సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రజల అభీష్టాలకు అనుగుణంగా అన్నాడీఎంకే ప్రభుత్వం అనేక పథకాలను ప్రవేశపెట్టిందని ఆమె అన్నారు. నిత్యావసర వస్తువుల ధరలను అదుపులో పెట్టేందుకు వివిధ పథకాల కింద 2012లో రూ.100 కోట్ల మూలధనాన్ని కేటాయించినట్లు తెలిపారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న ఈ విధానం భారత దేశంలోనే ప్రథమమని ఆమె చెప్పారు. ఉత్తర భారతంలో వర్షాభావ  పరిస్థితుల కారణంగా దేశవ్యాప్తంగా కందిపప్పు ధర పెరిగిపోయిందన్నారు. ఈ ధరను నియంత్రించేందుకు ఐదువేల మెట్రిక్ టన్నుల కందిపప్పును విదేశాల నుంచి కేంద్రం దిగుమతి చేసుకుంటున్నట్లు ఆమె తెలిపారు.

దిగుమతి చేసుకున్న కందిపప్పులో రాష్ట్ర అవసరాలకు 500 టన్నులను కేటాయించాల్సిందిగా కేంద్రాన్ని కోరగా, మంజూరు చేసినట్లు తెలిపారు. ఈ కందిపప్పు అరకిలో ప్యాకెట్టు రూ.55, కిలో ప్యాకెట్టు రూ.110 లెక్కన విక్రయించబోతున్నామని అన్నారు. మధురైలో 11, తిరుచ్చిలో 14, కోయంబత్తూరులో 10 సహకార సోర్లతోపాటూ దక్షిణ చెన్నైలోనూ, చింతామణి సహా ఇతర సహకార సూపర్‌మార్కెట్లలో, 36 మండల సహకార దుకాణాల్లో, 20 అముదం షాపుల్లో కందిపప్పు లభిస్తుందని ఆమె అన్నారు. రాష్ట్రం మొత్తం మీద 91 సహకార స్టోర్లు, దుకాణాల్లో వచ్చేనెల 1వ తేదీ నుంచి కందిపప్పును అందుబాటులో ఉంచుతున్నామని చెప్పారు.

మరిన్ని వార్తలు