పెద్దన్నకు బుద్ధోచ్చేలా,.

18 Dec, 2013 10:03 IST|Sakshi
పెద్దన్నకు బుద్ధోచ్చేలా,.
  •  దౌత్యాధికారికి అవమానంపై భారత్ ఆగ్రహం
  •  ప్రతిచర్యలకు దిగిన కేంద్ర ప్రభుత్వం
  •   అమెరికా దౌత్యాధికారుల ‘మర్యాద’ తగ్గింపు.. 
  •   {పత్యేక గుర్తింపు కార్డుల ఉపసంహరణ
  •   ఎయిర్‌పోర్ట్ పాస్‌లూ వెనక్కి...
  • ఢిల్లీలో అమెరికా రాయబార కార్యాలయం వద్ద  భద్రత కుదింపు..
  • బారికేడ్లను బుల్‌డోజర్లతో తొలగించిన పోలీసులు
  •   అమెరికా దౌత్యాధికారుల ఇళ్లలో పని మనుషుల వివరాల సేకరణ..
  • అమెరికా ప్రతినిధి బృందంతో భేటీలు రద్దు చేసుకున్న నేతలు..
  •  
    న్యూఢిల్లీ నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: అమెరికాలో భారత దౌత్యాధికారిణి దేవయాని ఖోబ్రాగాదేకు జరిగిన అవమానం దేశాన్ని కుదిపేసింది. మహిళ.. అందులోనూ దౌత్యవేత్త.. అయినప్పటికీ బహిరంగంగా బేడీలు వేసి అరెస్టు చేయడమే కాక.. దుస్తులు విప్పి తనిఖీలు చేసిన ఘటనపై దేశవ్యాప్తంగా ఆగ్రహం పెల్లుబికింది. అటు ప్రభుత్వ, ప్రతిపక్షాలు కూడా పార్టీలకతీతంగా ఒక్కతాటిపైకి వచ్చి అగ్రరాజ్యానికి బుద్ధి చెప్పాలని నిర్ణయించాయి. మీ దేశంలో మాకు గౌరవం ఇవ్వకపోతే.. మా దేశంలో మీకూ గౌరవమిచ్చేది లేదని కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. భారత్‌లో అమెరికా దౌత్యవేత్తలు, వారి కుటుంబాలకిచ్చే ‘మర్యాద’ తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. దేశంలో పర్యటిస్తున్న అమెరికా ప్రతినిధి బృందంతో సమావేశమవడానికి నిరాకరించడం ద్వారా అటు ప్రభుత్వ, ఇటు విపక్ష నాయకులు.. అగ్రరాజ్యానికి తమ అసంతృప్తిని వ్యక్తంచేశారు. అగ్రరాజ్యం కదా అని ఇష్టమొచ్చినట్లు ప్రవర్తిస్తే.. చూస్తూ ఊరుకోమని గట్టి సందేశం పంపారు.
     మర్యాద తగ్గించారు..
     
     మన దేశంలో పనిచేస్తున్న అమెరికా దౌత్య కార్యాలయ అధికారులు, సిబ్బందికి, వారి కుటుంబాలకు సాధారణంగా లభించే గౌరవ స్థాయిని తగ్గించాలని, అగ్రరాజ్యంలో వారు మన కాన్సులేట్లలో సిబ్బందికి కల్పించే స్థాయి మాత్రమే వారికి కల్పించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ నిర్ణయాన్ని తక్షణం అమలు చేస్తూ మంగళవారం చర్యలు చేపట్టింది. ఈ మేరకు వారికిచ్చిన ప్రత్యేక గుర్తింపు కార్డులను వెనక్కి ఇచ్చేయాలని భారత ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచారం. ఫలితంగా దౌత్యకార్యాలయ అధికారులు, వారి కుటుంబ సభ్యులకు దక్కుతున్న ‘దౌత్య మర్యాదలు’ ఇక మీదట పొందడానికి అవకాశం ఉండదు. అలాగే ఎయిర్‌పోర్ట్‌పాస్‌లతోపాటు వారికి కల్పిస్తున్న పలు సదుపాయాలనూ ఒక్కసారిగా ఉపసంహరించుకుంది. అమెరికా రాయబార కార్యలయానికి మద్యంతోపాటు పలు దిగుమతులకు సంబంధించి ఉన్న అనుమతులను కూడా నిలిపివేసింది. ఢిల్లీలోని అమెరికా ఎంబసీ(దౌత్య కార్యాలయం)కి కల్పిస్తున్న భద్రతను తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఢిల్లీ పోలీసు శాఖకు హోం శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఫలితంగా ఎంబసీ వద్ద ఉన్న బారికేడ్లను పోలీసులు మంగళవారం బుల్‌డోజర్లు ఉపయోగించి మరీ తొలగించారు. కేవలం అక్కడ ఇప్పుడు పోలీస్ పికెట్ మాత్రమే మిగిల్చారు. రాయబార కార్యాలయం చుట్టుపక్కల ప్రజలు సంచరించకుండా, అటువైపుగా వాహనాలు రాకుండా ఇంతవరకు ఈ బారికేడ్లు అడ్డుగా ఉండేవి.
     
     భారత్‌లో పని మనుషుల సంగతేమిటి?
     
     దేవయాని ఖోబ్రాగాదే(39) భారత్ నుంచి పని మనిషిని అమెరికా తీసుకెళ్లడానికి వీలుగా తప్పుడు సమాచారం ఇచ్చి వీసా సంపాదించారని ఆరోపిస్తూ ఇటీవల పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అమెరికాను మరింత ఇరుకున పెట్టేందుకు వీలుగా.. భారత్‌లో పనిచేస్తున్న అమెరికా దౌత్య అధికారుల ఇళ్లలో ఉన్న పని మనుషులకు ఎంత జీతాలు ఇస్తున్నారనే విషయాన్ని ప్రభుత్వం ఆరా తీస్తోంది. కనీస వేతన చట్టానికి లోబడి జీతాలు చెల్లిస్తున్నారా? లేదా? అనే విషయాన్ని నిర్ధారించడానికి వీలుగా అన్ని వివరాలు ఇవ్వాలని దౌత్య అధికారులను కోరింది. ఇక్కడి అమెరికా స్కూళ్లలో పనిచేస్తున్న సిబ్బంది జీత భత్యాల వివరాలనూ సేకరిస్తోంది. వారి బ్యాంకు ఖాతాలనూ పరిశీలించనుంది. జీత భత్యాల చెల్లింపుతో పాటు మరే విషయంలో అయినా నిబంధనలను ఉల్లంఘించారా? అనే విషయాలను కేంద్రం పరిశీలిస్తోంది. నిబంధనలను ఉల్లంఘించారని తేలితే.. బాధ్యుల మీద కేసులు పెట్టాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది.
     
     అమెరికా ప్రతినిధి బృందాలతో భేటీలు రద్దు చేసుకున్న నేతలు..
     
     అమెరికా చర్యపై భారత జాతీయ భద్రత సలహాదారు శివశంకర్ మీనన్ మండిపడ్డారు. ఇది నీచమైన, అనాగరికమైన చర్య అని విమర్శించారు. ఆ వెంటనే పార్టీలకతీతంగా రాజకీయ ప్రముఖులందరూ అమెరికాపై విమర్శల వర్షం కురిపించారు. మన దౌత్య అధికారిణిని అవమానించినందుకు నిరసనగా.. అమెరికా ప్రతినిధి బృందాలతో భేటీలను లోక్‌సభ స్పీకర్ మీరా కుమార్, హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ, జాతీయ భద్రతా సలహాదారు శివశంకర్ మీనన్ తదితరులు రద్దు చేసుకున్నారు. అమెరికా ప్రతినిధి బృందాలతో భేటీ రద్దు చేసుకున్న వారిలో గుజరాత్ ముఖ్యమంత్రి, బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ కూడా ఉన్నారు. అమెరికాలో భారత మహిళకు జరిగిన అవమానానికి నిరసనగానే అమెరికా బృందంతో భేటీకి తిరస్కరిస్తున్నట్లు ఆయన ట్విట్టర్‌లో పేర్కొన్నారు. అమెరికా నుంచి వచ్చిన ప్రతినిధి బృందంలో జార్జి హోల్డింగ్(రిపబ్లికన్-నార్త్ కరోలినా), పెటె ఓస్లాన్(రిపబ్లికన్-టెక్సాస్), డేవిడ్ ష్వైకర్ట్(రిపబ్లికన్-అరిజోనా), రాబర్ట్ వూడాల్(రిపబ్లికన్-జార్జియా), మడెలైనా బోర్డాలో(డెమొక్రాట్-గువామ్) ఉన్నారు.
     
     విదేశాంగ, హోం మంత్రులతో దేవయాని తండ్రి భేటీ
     దేవయాని తండ్రి ఉత్తమ్ ఖోబ్రాగాదే మంగళవారమిక్కడ విదేశాంగ మంత్రి సల్మాన్ ఖుర్షీద్, హోం మత్రి సుశీల్ కుమార్ షిండేతో సమావేశమయ్యారు. దేవయాని అరెస్టును ప్రభుత్వం చాలా సీరియస్‌గా తీసుకుందని, తగిన విధంగా చర్యలు తీసుకుంటోందని ఖుర్షీద్.. ఉత్తమ్‌కు తెలిపారు. ‘‘సంఘటనకు సంబంధించిన వివరాలన్నీ ఆయన నాకు తెలిపారు. వెంటనే నేను సంబంధిత అధికారులతో మాట్లాడి చర్యలకు ఆదేశించాను. ఆమెకు తప్పకుండా న్యాయం జరిగేలా చూస్తాం’’ అని సుశీల్ కుమార్ షిండే విలేకరులతో అన్నారు. అనంతరం ఉత్తమ్ విలేకరులతో మాట్లాడుతూ.. ‘‘నా కూతురుపై మోపిన అభియోగాలను తొలగించేలా చూస్తామని హోం మంత్రి హామీ ఇచ్చారు. తను ప్రభుత్వ విధులు నిర్వహిస్తున్నందున తనకు ఎలాంటి హానీ జరగకుండా చూస్తామని చెప్పారు’’ అని వెల్లడించారు. అంతకుముందు ఆయన మరోచోట విలేకరులతో మాట్లాడుతూ..  అరెస్టు చేసినా దేవయానిని గౌరవంగా చూడాల్సి ఉందని, కానీ రెండు దేశాల మధ్య యుద్ధంలో తన బిడ్డను బలిపశువును చేశారని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ విషయంలో యూపీఏ చైర్‌పర్సన్ సోనియా గాంధీ కలుగజేసుకుని తన కుమార్తెను వెనక్కు తీసుకురావాలని డిమాండ్ చేశారు.  దీనికిముందు విదేశాంగ కార్యదర్శి సుజాతా సింగ్.. అమెరికా రాయబారి నాన్సీ పావెల్‌ను పిలిచి మాట్లాడారు. ఈ విషయంలో భారత ఆగ్రహాన్ని తెలియజేశారు.
     
     ఆ ‘గే’లను అరెస్టు చేయండి
     స్వలింగ సంపర్కం నేరమని సుప్రీంకోర్టు తీర్పు చెప్పిన నేపథ్యంలో అమెరికా దౌత్యాధికారుల వెంట వచ్చిన స్వలింగ సంపర్కులను(గే) వెంటనే అరెస్టు చేయాలి. చాలా మంది దౌత్యాధికారులతోపాటు వారి ‘సహధర్మచారు’లకు కూడా మనం వీసాలు ఇచ్చినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. అమెరికాలో తక్కువ వేతనం ఇవ్వడం ఎలా నేరమో.. ఇక్కడ స్వలింగ సంపర్కం కూడా అలాగే నేరం కాబట్టి.. వారందరికీ ఇచ్చిన వీసాలను రద్దు చేసి వారిని శిక్షించండి.
     - యశ్వంత్ సిన్హా, బీజేపీ నేత, విదేశాంగ శాఖ మాజీ మంత్రి
     
     బేషరతు క్షమాపణ చెప్పాల్సిందే
     దేవయానికి జరిగిన అవమానానికి అమెరికా భారత్‌కు బేషరతుగా క్షమాపణ చెప్పాల్సిందే. ప్రపంచం మారిందని అమెరికాకు తెలిసొచ్చేలా చేయడానికి మరిన్ని చర్యలు తీసుకోవాల్సి ఉంది. భారత్ చిన్నాచితకా దేశంగా చూస్తే సహించం. ఈ విషయాన్ని అమెరికా గ్రహించాలి. ఇతర దేశాల గౌరవ మర్యాదలను కూడా అమెరికా గుర్తించాలి.
     - కమల్‌నాథ్, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి
     
     కుక్క కాటుకు చెప్పుదెబ్బ కొట్టాల్సిందే..
     కుక్కకాటుకు చెప్పుదెబ్బ అన్నట్లు అమెరికాకు తగని విధంగా బుద్ధి చెప్పాల్సిందే. దేవయానిని అవమానించినట్లుగానే అమెరికా దౌత్యాధికారులను కూడా బట్టలు విప్పి తనిఖీ చేయాల్సిందే. ఇంత జరుగుతున్నా.. విదేశాంగ మంత్రి సల్మాన్ ఖుర్షీద్.. అమెరికా ప్రతినిధి బృందాన్ని కలవడం దారుణం. దీన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుని అమెరికాకు గట్టి సందేశం పంపాలి. దీనిపై చర్చించాల్సిందిగా నేను రాజ్యసభలో నోటీసు ఇచ్చినప్పటికీ.. లోక్‌పాల్ ఉన్నందువల్ల చర్చకు రాలేదు. బుధవారం మళ్లీ నోటీసు ఇస్తాను.
     - కె.సి.త్యాగి, జేడీయూ ఎంపీ
     
     నిబంధనల ప్రకారమే నడుచుకున్నాం: అమెరికా
     వాషింగ్టన్: దేవయానిని దుస్తుల విప్పి తనిఖీలు చేసింది నిజమేనని, అయితే తమ నిబంధనల ప్రకారమే పోలీసులు నడుచుకున్నారని విదేశాంగ శాఖ ఉప ప్రతినిధి మేరీ హార్ఫ్ సోమవారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఆమె మీద ఆరోపణలు ఉన్నందున.. ఆమెకు దౌత్యపరమైన రక్షణ పూర్తిగా లభించదని పేర్కొన్నారు. ‘‘అరెస్టు చేసిన తర్వాత తదుపరి చర్యల నిమిత్తం ఆమెను అమెరికా మార్షల్స్ వద్దకు తీసుకెళ్లారు. అక్కడ ఏం జరిగిందన్న దానిపై ప్రశ్నలు వేయాలంటే మీరు వారినే సంప్రదించాలి.. మమ్మల్ని కాదు’’ అని విలేకరుల ప్రశ్నలకు ఆమె సమాధానంగా చెప్పారు. లోక్‌సభ స్పీకర్ మీరాకుమార్, జాతీయ భద్రత సలహాదారు శివశంకర్ మీనన్‌లు.. అమెరికా ప్రతినిధి బృందంతో భేటీలను రద్దుచేసుకోవడంపై ప్రశ్నించగా.. ఆ వివరాలు తనకు తెలియవని, ఏమైనా అడగాలంటే ఆ ప్రతినిధి బృందాన్నే అడగాలని సూచించారు. ఈ సందర్భంగా ఆమె దౌత్యపరమైన రక్షణకు, వాణిజ్య దౌత్యపరమైన రక్షణకు తేడా ఉందని చెప్పారు.
     అవమానించడం కొత్తకాదు..
     న్యూఢిల్లీ: భారత దౌత్యవేత్తలను ఉద్దేశపూర్వకంగా అవమానించడం అగ్ర రాజ్యానికి కొత్తకాదు. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు ఉన్నప్పటికీ.. నీచంగా ప్రవర్తించడం ఆ దేశానికి అలవాటేనని, ఇలాంటి తనిఖీలతో అమెరికా ఉద్దేశపూర్వకంగా భారత్‌పై దాడి చేస్తోందని విశ్లేషకులు అంటున్నారు. 2010లో అమెరికాలో భారత రాయబారిగా ఉన్న మీరా శంకర్ విషయంలోనూ ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. దౌత్య పర్యటనకు సంబంధించి ఆమె మిసిస్సిపీ వెళ్లినప్పుడు.. జాక్సన్ ఎవర్స్ అంతర్జాతీయ విమానాశ్రయంలో భద్రత సిబ్బంది ఆమెను భద్రత గీత దాటి బయటకు రమ్మని సూచించారు. ఆమె వచ్చాక ఓ భద్రత సిబ్బంది ఆమె ఒళ్లంతా తడుముతూ తనిఖీ చేశారు. తనకు దౌత్య హోదా ఉందని చెప్పినప్పటికీ వినకుండా బహిరంగంగా అవమానించారు. మరో ఘటనలో.. ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధి హర్‌దీప్ పూరీని కూడా ఒళ్లంతా తడుముతూ తనిఖీలు చేశారు. ఆయన్ను ఓ ప్రత్యేక గదిలోనికి తీసుకెళ్లి.. తలపాగాను సైతం తెరవాల్సిందిగా కోరారు. దానికి ఆయన నిరాకరించారని సమాచారం. అయితే ఇదే అంశంపై హర్‌దీప్‌ను ప్రశ్నిస్తే.. అలాంటిదేమీ జరగలేదని అప్పట్లో ఆయన చెప్పారు.
     క్షమాపణ చెప్పాల్సిందే: కమల్‌నాథ్, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి
     దేవయానికి జరిగిన అవమానానికి అమెరికా భారత్‌కు బేషరతుగా క్షమాపణ చెప్పాల్సిందే. భారత్‌ను చిన్నాచితకా దేశంగా చూస్తే సహించం. ఇతర దేశాల గౌరవ మర్యాదలను కూడా అమెరికా గుర్తించాలి.
మరిన్ని వార్తలు