చందంపేటలో... రమణీయ సోయగాలు

15 Sep, 2015 02:06 IST|Sakshi
చందంపేటలో... రమణీయ సోయగాలు

పచ్చని చీరను పరుచుకున్నట్టున్న కొండలు..  కొండల నడుమ జాలువారే జలపాతాలు.. పురాతన ఆలయాలు.. శివలింగాలను నిత్యం అభిషేకించే జలధారలు.. వేల ఏళ్ల క్రితం నాటి సమాధులు.. నల్లమల అటవీ ప్రాంతంలోని నల్లగొండ జిల్లా చందంపేట మండలంలో దేవరచర్ల, వైజాగ్ కాలనీ ప్రాంతాల్లోని అందాలివి. ఇంతేకాదు ‘అరకు లోయ’ను తలపించే సోయగాలు.. బొర్రా గుహలను తలపించే గాజుబిడం గుహలు.. వేల ఏళ్లనాటి ఆలయ అద్భుతాలను ఇక్కడ పర్యాటక, పురావస్తుశాఖ అధికారులు గుర్తించారు. ఈ ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా గుర్తించేందుకు ప్రతిపాదనలు పంపుతున్నట్లు తెలిపారు.
 
చుట్టూ కొండలు.. పచ్చని అందాలు.. జలపాతాలు
* బొర్రా గుహలను తలపిస్తున్న గాజుబిడం గుహలు
* పురాతన ఆలయాలు.. నల్లమల అడవి సొబగులు
* పర్యాటక అభివృద్ధికి ప్రతిపాదనలు పంపిన అధికారులు
దేవరకొండ/చందంపేట: నల్లగొండ జిల్లా చందంపేట మండలం దాదాపుగా నల్లమల అటవీ ప్రాంతంలోనే ఉంది. వైశాల్యంలో చాలా పెద్దదైన ఈ మండలం అభివృద్ధికి మాత్రం ఆమడ దూరంలోనే ఉంది.

తెలంగాణ రాష్ట్రం ఏరాటైన తర్వాత పర్యాటక ప్రదేశాలపై ప్రభుత్వం దృష్టి సారించింది కూడా. ఈ నేపథ్యంలో దేవరచర్లలోని ప్రకృతి అద్భుతాలను, అక్కడి రమణీయ దృశ్యాలను, జలపాతాల గురించి ‘సాక్షి’ కథనం ప్రచురించింది. దీనిపై స్పందించిన పురావస్తు, పర్యాటకశాఖ అధికారులు దేవరచర్లను సందర్శించారు. అక్కడి అద్భుతాలను తెలంగాణ ‘అరకు’గా అభివర్ణించారు. ఈ ప్రాంతాన్ని పర్యాటకపరంగా అభివృద్ధి చేయాలన్న స్థానికుల డిమాండ్లతో అధికారులు... ఇటీవల ఇక్కడి మరిన్ని ప్రాంతాలను సందర్శించి, ఆశ్చర్యపోయారు.

ఇన్నాళ్లుగా వెలుగులోకి రాని ఎన్నో రమణీయ ప్రదేశాలు అక్కడ ఉన్నాయని.. పర్యాటకంగా అభివృద్ధి చేయడానికి ఈ ప్రాంతం అనువుగా ఉందని వారు పేర్కొన్నారు. కాచరాజుపల్లి గ్రామానికి 4 కిలోమీటర్ల దూరంలో దట్టమైన అడవి మధ్యలోని గుట్టల్లో ఉన్న గాజు బిడం గుహలను పరిశీలించారు. బొర్రా గుహలకు ఇవి ఏమాత్రం తీసిపోవని గుర్తించారు. అంతేకాదు బొర్రా గుహల్లో మామూలుగా రాతి కట్టడం మాదిరిగా ఉండగా గాజుబిడం గుహల్లో మాత్రం ఎరుపు, ఆకుపచ్చ మిళితమైన రంగుల్లో ఉండడాన్ని గుర్తించారు.

ఆ గుహలకు ఎంతో విశిష్టత ఉందని, పురావస్తుశాఖ అధికారులతో చర్చించాల్సి ఉందని చెప్పారు. దేవరచర్లలో ఉన్న శివలింగంతో పాటు చందంపేట పరిసర ప్రాంతాల్లో 9 గుట్టల పరిధిలో పురాతనమైన ఆలయాలున్నట్లు తెలుస్తోందని అధికారులు వివరించారు. అక్కడి నుంచి కృష్ణానదిలో నాగార్జునసాగర్ ప్రాజెక్టు సమయంలో ముంపునకు గురైన ఏలేశ్వరం గ్రామ పరిసర ప్రాంతాలను పరిశీలించారు. కృష్ణా నదిలోని ఓ దీవిలో ఉన్న మల్లన్న, మల్లప్ప దేవాలయం గురించి తెలుసుకున్నారు.
 
అభివృద్ధి చేయాల్సి ఉంది..
దేవరచర్ల, వైజాగ్ కాలనీలో గుర్తించిన అంశాలపై ఇప్పటికే ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించినట్లు పురావస్తుశాఖ అసిస్టెంట్ డెరైక్టర్ నాగరాజు, టూరిజం డెవలప్‌మెంట్ ఆఫీసర్ శివాజీ చెప్పారు. కృష్ణానదిలో ఉన్న పలు దీవులను పరిశీలించిన వారు.. అవి పాపికొండలను తలపించే మాదిరిగా ఉన్నాయని అభివర్ణించారు.

అరకును మించిన సోయగాలు చందంపేట ప్రాంతంలో ఉన్నాయని.. ఈ ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయాల్సిన ఆవశక్యత ఉందని పేర్కొన్నారు. కాగా.. దేవరచర్లలో ఉన్న పురాతన ఆలయాలు, ప్రకృతి అందాల విషయమై తన దృష్టికి వచ్చిందని.. ఈ ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు అధికారులు నివేదిక తయారు చేశారని హోంమంత్రి నాయిని ఇటీవల దేవరకొండలో పేర్కొన్నారు. దీనిపై సీఎం కేసీఆర్‌తో మాట్లాడతానన్నారు.

Read latest Top-news News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా