షేర్లలోనూ ‘రాణి’స్తున్నారు...

6 Mar, 2016 23:54 IST|Sakshi
షేర్లలోనూ ‘రాణి’స్తున్నారు...

స్టాక్స్ ట్రేడింగ్‌లోనూ మహిళల ముందంజ
 చిన్న మొత్తాలతో సిప్ చేస్తూ పెద్ద సంపద   మార్కెట్లు పడ్డా భయపడకుండా పెట్టుబడి
 దీర్ఘకాలం వేచి ఉండటంతోనే విజయం

 
మన పార్లమెంట్లో సార్వత్రిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టే అవకాశమైతే ఇప్పటిదాకా మహిళలకు రాలేదు.  కాకపోతే ప్రతి ఇంట్లోనూ బడ్జెట్ చూసేది మహిళలే. అదేకాదు!!దేశ ఆర్థిక వ్యవస్థ... ప్రత్యేకించి బ్యాంకింగ్ వ్యవస్థ విపరీతమైన కుదుపులకు లోనవుతున్న ఈ తరుణంలో దేశంలో దాదాపు ప్రభుత్వ, ప్రైవేటు అగ్రశ్రేణి బ్యాంకులన్నిటినీ విజయవంతంగా నడిపిస్తున్నదీ మహిళలే. అరుంధతీ భట్టాచార్య (ఎస్‌బీఐ), ఉషా అనంత సుబ్రమణియన్ (పీఎన్‌బీ), ప్రైవేటు బ్యాంకుల్ని చందా కొచ్చర్ (ఐసీఐసీఐ), శిఖా శర్మ (యాక్సిస్), నైనాలాల్ కిద్వాయ్ (హెచ్‌ఎస్‌బీసీ), కల్పనా మోర్పారియా (జేపీ మోర్గాన్)... ఇలా చెప్పుకొంటూ పోతే ఈ జాబితాకు అంతుండదు. అంతెందుకు!! స్టాక్ మార్కెట్ దిగ్గజం ఎన్‌ఎస్‌ఈకి సారథ్యం వహిస్తున్న చిత్రా రామచంద్రన్ దాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లారు. బ్యాంకుల్ని, ఆర్థిక సంస్థల్ని నడిపించటమే కాదు... సాధారణ ఇన్వెస్టర్లుగానూ రాణించగలమని  నిరూపిస్తున్నారు కొందరు మహిళలు. ఖాళీ సమయం, చేతిలో మిగిలే డబ్బు... ఈ రెండింటినీ పెట్టి చక్కగా ఆర్జిస్తున్నారు. అలాంటి నలుగురు మహిళల ఆర్థిక అనుభవాలు... ‘మహిళా దినోత్సవం’ సందర్భంగా ఈ వారం ప్రాఫిట్ ప్లస్‌లో మీ కోసం...
 - సాక్షి పర్సనల్ ఫైనాన్స్ విభాగంట
 
పడినప్పుడు భయపడలేదు...
స్టాక్ మార్కెట్లన్నాక హెచ్చుతగ్గులు సహజం. నేను గత ఇరవై ఏళ్లుగా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తున్నాను. ఈ సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో ఎగుడు దిగుళ్లు చూశా. కానీ స్వల్పకాలిక ఒడిదుడుకులకు భయపడకుండా ధైర్యంగా నిలబడ్డా. ఇన్వెస్ట్ చేయటం మాత్రం మానలేదు. అందుకే మంచి లాభాలను ఆర్జించాను. ముఖ్యంగా 2002, 2008లో వచ్చిన సంక్షోభ సమయాల్లో నేను ఇన్వెస్ట్ చేసిన షేర్లు బాగా పడిపోయాయి. భయపడి నష్టానికి విక్రయించకుండా ఓపిగ్గా ఎదురు చూశా. ఇప్పుడవి తిరిగి లాభాల్లోకి వచ్చాయి. ఇలా ఒడిదుడుకుల సమయంలో ఇన్వెస్ట్‌మెంట్‌కు దూరంగా ఉండి... వేచి చూసే ధోరణి అవలంబించడమే నా విజయ సూత్రంగా భావిస్తా. ఇరవై ఏళ్ల క్రితం సుమారు రూ.5లక్షలతో మొదలు పెట్టిన పెట్టుబడి విలువ ఇప్పుడు రూ.కోటి దాటిందంటే ఓపిక, సహనమే కారణమంటాను. కేవలం ఒకే రంగానికి సంబంధించిన షేర్లలో ఇన్వెస్ట్ చేయకుండా పోర్ట్‌ఫోలియోను డైవర్సిఫై చేసుకున్నా. ఇందుకోసం పేపర్లు, టీవీలతో పాటు జెన్‌మనీ సూచనలు కూడా తీసుకున్నా. ప్రస్తుతం నా పోర్ట్‌ఫోలియోలో 20కిపైగా కంపెనీల షేర్లున్నాయి. కొన్ని షేర్లలో నేను కొన్నాక ట్రేడింగ్ కూడా ఆగిపోయినవి ఉన్నాయి. అందుకే ఫండమెంటల్‌గా పటిష్టంగా ఉన్న షేర్లకే ఎక్కువ ప్రాధాన్యమిస్తాను. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేవారికి నేను చెప్పే సలహా ఏమిటంటే.. ఎవరో కొన్నారని కొనడం కాకుండా, నిపుణుల సలహా తీసుకోవాలి. స్వల్పకాలంలో ఎక్కువ సంపాదిద్దామనే అత్యాశకు పోకుండా దీర్ఘకాలం వేచి చూస్తే తప్పక లాభాలొస్తాయి.
 - జి.రామలక్షి, హైదరాబాద్
 
మార్కెట్లు పడ్డప్పుడు ఇన్వెస్ట్ చేయండి...
ఎంసీఏ పూర్తి చేశాక ఏదైనా ప్రొఫెషనల్ కోర్సు చెయ్యాలనిపించింది. ఇంటీరియర్ డిజైనింగ్ కోర్స్ చేశా. మిగిలిన మహిళల్లానే ఉద్యోగం చేసి సొంత కాళ్లపై నిలబడాలన్నది నా ఆలోచన. కానీ పిల్లలపైన, వారి చదువుపైన ఫోకస్ చెయ్యటంతో ఉద్యోగం కుదరలేదు. అందుకే ఇంటి దగ్గర కూర్చొని ఎంతో కొంత సంపాదించడం ఎలా?... అని ఆలోచిస్తున్న తరుణంలో స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయమని మా వారు సూచించారు. దీంతో మూడేళ్లుగా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్‌మెంట్‌చే యడం మొదలు పెట్టా. ఇన్వెస్ట్‌మెంట్‌తో పాటు ట్రేడింగ్ కూడా చేస్తున్నా. ఇందుకోసం నేనైతే ఎవరి సలహాలూ తీసుకోవటం లేదు. ప్రతి రోజూ వార్తలు చూడటం, పేపర్లు చదవడం ద్వారా ప్రపంచంలో జరుగుతున్న ఆర్థిక పరిణామాలపై అవగాహన పెంచుకుంటున్నా. దానికి అనుగుణంగా లావాదేవీలు నిర్వహిస్తున్నా. మార్కెట్లు బాగా ఒడిదుడుకులకు లోనైనప్పుడు ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్‌లో ట్రేడింగ్ చేస్తుంటాను. అదే స్టాక్ మార్కెట్ పడినప్పుడు దీర్ఘకాలిక దృష్టితో షేర్లు కొంటాను. వేరెవరితోనూ సంబంధం లేకుండా... పిల్లలు స్కూలుకు వెళ్ళి వచ్చేలోపు ఉన్న ఖాళీ సమయంలోనే ట్రేడింగ్ చేస్తుంటా. ప్రస్తుతం నా పోర్ట్‌ఫోలియోలో రూ.4 లక్షల  విలువైన షేర్లున్నాయి. బ్యాంకులు, సీడ్ కంపెనీలు, ఐటీ రంగ షేర్లలో ఎక్కువగా ఇన్వెస్ట్ చేశా. నా మూడేళ్ల అనుభవంలో అర్థమైన విషయం ఏమిటంటే... ట్రేడింగ్‌లో ఏమీ మిగలదని. ట్రేడింగ్‌లో ఒకేరోజు రూ. 3 లక్షలు లాభం వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ... మిగిలిన రోజుల్లో వచ్చిన నష్టాలను కలుపుకుంటే దానికది సరిపోతుంది. అందుకే నేను మిగిలిన మహిళలకు ఇచ్చే  సలహా ఏంటంటే... ట్రేడింగ్‌కు దూరంగా ఉండండి. మార్కెట్లు బాగా పడినప్పుడు షేర్లు కొనండి. ఇతర ఇన్వెస్ట్‌మెంట్ సాధనాల కంటే షేర్లే ఎక్కువ రాబడిని అందిస్తాయని నేైనె తే గట్టిగా నమ్ముతున్నాను.
 - వై. హరిప్రియ రెడ్డి, హైదరాబాద్
 
ఫండ్స్‌తో నెలవారీ ఖర్చులు..
నెలనెలా కొంచెం కొంచెం పెట్టుబడి పెడితే చాలు. దీర్ఘకాలంలో చక్కని నిధి ఏర్పడుతుంది. ఈ విషయం మనకు మ్యూచ్‌వల్ ఫండ్లు నేర్పిస్తాయి. గృహిణినే అయినా నేను మ్యూచువల్ ఫండ్స్ ద్వారా రెగ్యులర్ ఆదాయాన్ని ఆర్జిస్తున్నా. దీనికోసం నేను పెద్దగా ఇన్వెస్ట్ చేసింది కూడా లేదు. ప్రతి నెలా ఇంటి ఖర్చులకు పోగా మిగిలిన దాన్లో కొంత మొత్తాన్ని సిప్ ఫండ్స్‌లో కొద్దికొద్దిగా ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తున్నా. 1995లో కేవలం రూ.500తో మొదలు పెట్టా. ఇపుడు నా పోర్ట్‌ఫోలియో రూ. 7 లక్షలు దాటింది. అంతే కాదు!! ప్రతినెలా డివిడెండ్ రూపంలో వస్తున్న డబ్బులు నా ఖర్చులకు అక్కరకొస్తున్నాయి. సిప్ విధానంలో మూడేళ్లలో రూ.15,000 ఇన్వెస్ట్ చేస్తే అది ఐదేళ్లకు మూడు రెట్లయింది. ఆ మొత్తాన్ని నేను లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్ ఫండ్స్‌లో... డివిడెండ్ చెల్లించే వాటిలో తిరిగి ఇన్వెస్ట్ చేశాను. 2008 నాటికి నేను ఇన్వెస్ట్ చేసిన మొత్తం డివిడెండ్ రూపంలో వెనక్కి వచ్చేసింది. ఇప్పుడు నా పోర్టుఫోలియోలో ఉన్నదల్లా లాభమే. అది కూడా అసలుకన్నా ఎక్కువ పెరిగింది. అలాగే పుట్టిన రోజున పుట్టింటివారు ఇచ్చిన డబ్బులను కూడా ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తుంటాను. కొన్ని సందర్భాల్లో చీరల వంటి అనవసర ఖర్చులు తగ్గించుకొని మరీ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తుంటాను. ఇక నా పోర్ట్‌ఫోలియో విషయానికొస్తే ఎక్కువ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయలేదు. కేవలం ఐదు ఫండ్స్‌తో డైవర్సిఫైడ్ పోర్ట్‌ఫోలియోను నిర్వహిస్తున్నా. దీర్ఘకాలం డివిడెండ్ల కోసం మంచి రేటింగ్ ఉన్న లార్జ్, మిడ్ క్యాప్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేశా. ఇవి మార్కెట్ బాగున్నప్పుడు ఏటా యూనిట్‌కు 4-5 శాతం డివిడెండ్ అందిస్తాయి. అదే మార్కెట్ పరిస్థితులు బాగోలేనప్పుడు డివిడెండ్ ఒక శాతం లోపు ఉంటుంది. అలాగే నెలావారి ఖర్చుల కోసం బ్యాలెన్స్‌డ్ ఫండ్, తక్కువ కాలపరిధి ఉన్న డెట్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేశా. ఇవి బ్యాంకు వడ్డీ కంటే ఎక్కువ రాబడినే అందిస్తున్నాయి. నేను మార్కెట్ ఒడిదుడుకులను అసలు పట్టించుకోను. మార్కెట్ పెరిగిందా? పడిందా? అన్నది చూడకుండా డబ్బు ఉన్నప్పుడల్లా ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తుంటాను. నా సుదీర్ఘ ఫండ్ ఇన్వెస్ట్‌మెంట్ అనుభవాన్ని బట్టి నేను చెప్పేది ఏమిటంటే.. స్వల్ప కాలంలో రెట్టింపు డబ్బును సంపాదించాలన్న అత్యాశతో కాకుండా దీర్ఘకాలిక దృష్టితో ఇన్వెస్ట్ చేస్తే చాలు. బ్యాంకు వడ్డీరేటు కంటే ఎక్కువ రాబడి తప్పకుండా వస్తుంది. చాలామంది స్టాక్ మార్కెట్లో పెట్టుబడులంటే ఇన్వెస్ట్‌మెంట్ మొత్తం జీరో అయిపోతుందని చెబుతుంటారు. దాంతో నేను ఏకీభవించను. ఇన్వెస్ట్ చేసి కనీసం నాలుగేళ్లు వేచి ఉండగలిగితే నష్టాలుండవు. అదే ఎనిమిదేళ్లు దాటితే రెట్టింపు లాభాలను అందుకోగలమన్నది నా అభిప్రాయం.
 - ఎ.కవితా రాణి, హైదరాబాద్
 

మరిన్ని వార్తలు