'కాల్ డ్రాప్‌కు రూపాయి పరిహారం ఇవ్వాల్సిందే'

15 Oct, 2015 20:08 IST|Sakshi
'కాల్ డ్రాప్‌కు రూపాయి పరిహారం ఇవ్వాల్సిందే'

న్యూఢిల్లీ: ఊహించినట్టే కాల్ డ్రాప్స్ విషయంలో భారత టెలికం నియంత్రణ సంస్థ (ట్రాయ్)  ఆపరేటర్లకు గట్టి ఆదేశాలు ఇచ్చింది. కాల్స్ డ్రాప్‌కు ఒక రూపాయి చొప్పున పరిహారం వినియోగదారులకు చెల్లించాలని ఆదేశించినట్టు తెలిసింది. రోజుకు మూడు కాల్స్ డ్రాప్స్‌కు మించి పరిహారం ఇవ్వకూడదని ట్రాయ్ సూచించిందని,  ఇది త్వరలోనే అమల్లోకి రానుందని ఓ ఆంగ్ల చానెల్  తెలిపింది. టెలికం ఆపరేటర్లు కచ్చితంగా దీనిని అమలుచేసేవిధంగా ట్రాయ్ ఓ రెగ్యులేషన్‌ను జారీచేయనుంది. కాల్ డ్రాప్ చర్యలకు పాల్పడే టెలికం ఆపరేటర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్టు కేంద్ర సమాచార, ప్రసార శాఖమంత్రి రవిశంకర్ ప్రసాద్ ఆదేశించిన సంగతి తెలిసిందే.

ఢిల్లీ, ముంబైలలో ఇటీవల ఆడిటింగ్ నిర్వహించిన ట్రాయ్.. కాల్ డ్రాప్ విషయంలో ప్రముఖ ఆపరేటర్ల సేవలు ఏమాత్రం నాణ్యంగా లేవని గుర్తించింది. ముంబై, ఢిల్లీలలో కాల్ డ్రాప్స్ తీరు మరింత పెరిగిందని పేర్కొంది. ముంబైలో ఏ ఆపరేటర్ కూడా ప్రమాణాలకు అనుగుణంగా సేవలు అందించడం లేదని, ఢిల్లీలో ఎయిర్ టెల్, ఎయిర్ సెల్, వోడాఫోన్ ఈ విషయంలో ఎంతో వెనుకబడ్డాయని ట్రాయ్ పేర్కొన్నట్టు విశ్వనీయ వర్గాలు తెలిపాయి.

 

మరిన్ని వార్తలు