బదిలీలకు ‘పనితీరు’ ఆధారం!

19 Aug, 2015 01:09 IST|Sakshi

25శాతం పరిగణనలోకి తీసుకుంటామంటున్న అధికారులు
ప్రక్రియ జాప్యానికేనంటున్న ఉపాధ్యాయ సంఘాలు

 
హైదరాబాద్: టీచర్ల బదిలీల వ్యవహారం ఇప్పట్లో తేలేలా కనిపించడం లేదు. ఈ బదిలీలకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన ప్రభుత్వం రోజుకోరకమైన కొర్రీలు పెడుతుండడమే దీనికి కారణం. తాజాగా టీచర్ల పనితీరు ఆధారంగా బదిలీలు చేయాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. రేషనలైజేషన్ పూర్తయినందున ఇక బదిలీ జీఓ రావడమే తరువాయి అని ఎదురుచూస్తున్న టీచర్లకు తాజా నిర్ణయం తీవ్ర నిరాశకు గురిచేస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి ఆదేశాలతో మెరిట్ ఆధారంగా బదిలీలు చేపట్టేందుకు పాఠశాల విద్యాశాఖ కసరత్తు ప్రారంభించింది. పాఠశాలల్లో సబ్జెక్టుల వారీగా  విద్యార్థుల ఉత్తీర్ణత, పాఠశాలల నిర్వహణలో ఆయా ఉపాధ్యాయుల భాగస్వామ్యం, ప్రాజెక్టుల నిర్వహణ త దితర అంశాల ఆధారంగా ఉపాధ్యాయులకు పాయింట్లు కేటాయిస్తామని ఆ శాఖ కార్యదర్శి ఆర్పీ సిసోడియా ‘సాక్షి’తో పేర్కొన్నారు. బదిలీలకు నిర ్ణయించిన మొత్తం పాయింట్లలో 25శాతం ఈ మెరిట్ అంశాలను పరిగణనలోకి తీసుకుంటామని తెలిపారు.

మెరిట్‌కు ప్రామాణికమేమిటని, ఏ ప్రాతిపదికన గుర్తిస్తారని ఉపాధ్యాయ సంఘాలు విమర్శిస్తున్నాయి. మాటిమాటికీ బదిలీలను వాయిదా వేస్తూ ప్రభుత్వం విశ్వసనీయతను కోల్పోతోందని పీడీఎఫ్ ఎమ్మెల్సీలు బాలసుబ్రహ్మణ్యం, గేయానంద్, శ్రీనివాసులురెడ్డి, నాగేశ్వరరావు విమర్శించారు. లక్షలాది రూపాయలు చేతులు మారడంతో ప్రభుత్వ బదిలీలపై పైరవీలు నడుస్తున్నాయని, దీనివల్లనే సాధారణ బదిలీలు వాయిదా వేస్తున్నారని ఆరోపించారు. తక్షణమే బదిలీల షెడ్యూల్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మెరిట్ పేరిట ప్రభుత్వం ఈ ఏడాది సాధారణ బదిలీలు వాయిదా వేయాలని చూస్తోందని వైఎస్సార్ టీచర్స్ ఫెడరేషన్ ధ్వజమెత్తింది. మెరిట్ నిబంధన గందరగోళానికి దారితీసి బదలీల ప్రక్రియ జరగకుండా నిలిచిపోతుందని అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జాలిరెడ్డి, ఓబుళపతి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. బదిలీల షెడ్యూల్‌ను వెంటనే విడుదల చేయాలని ఎమ్మెల్సీ శ్రీనివాసులునాయుడు మరో ప్రకటనలో కోరారు.
 

మరిన్ని వార్తలు