తేజ్‌పాల్‌ను కాపాడేందుకు ఒత్తిళ్లు

24 Nov, 2013 04:34 IST|Sakshi
తేజ్‌పాల్‌ను కాపాడేందుకు ఒత్తిళ్లు

బాధితురాలి తల్లిని కలుసుకున్న తేజ్‌పాల్ కుటుంబ సభ్యుడు
     ఆయనను ఈ కేసు నుంచి కాపాడాలంటూ ఒత్తిడి...
     ‘తెహెల్కా’ మేనేజింగ్ ఎడిటర్‌ను విచారించిన గోవా పోలీసులు
     చట్టం తన పని తాను చేసుకుపోవాలి: లోక్‌సభ స్పీకర్

 
 పణజి/న్యూఢిల్లీ: మహిళా జర్నలిస్టుపై గోవా హోటల్‌లో లైంగికదాడికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ‘తెహెల్కా’ ఎడిటర్ తరుణ్ తేజ్‌పాల్‌ను త్వరలోనే అరెస్టు చేసేందుకు పోలీసులు ముమ్మర యత్నాలు సాగిస్తున్నారు. ఇదిలా ఉండగా, తేజ్‌పాల్‌ను కాపాడేందుకు తనపైన, తన కుటుంబంపైన ఒత్తిళ్లు వస్తున్నాయని బాధితురాలైన మహిళా జర్నలిస్టు శనివారం ఆరోపించారు. తేజ్‌పాల్ కుటుంబ సభ్యుల్లో ఒకరు శుక్రవారం రాత్రి తన తల్లి ఇంటికి వచ్చారని ఒక ప్రకటనలో తెలిపారు. న్యాయ సలహాల కోసం ఎవరిని సంప్రదిస్తున్నారని అడిగారని, ఈ కేసు నుంచి తేజ్‌పాల్‌ను కాపాడాల్సిందిగా తన తల్లిని కోరారని ఆరోపించారు.
 
 మరోవైపు, గోవా నుంచి డీఎస్పీ సామీ టవారెస్ నేతృత్వంలో శనివారం ఢిల్లీ చేరుకున్న క్రైమ్‌బ్రాంచి బృందం ఈ సంఘటనలో తేజ్‌పాల్‌ను వెనకేసుకు వచ్చిన ‘తెహెల్కా’ మేనేజింగ్ ఎడిటర్ షోమా చౌదరితో పాటు ఆ పత్రికకు చెందిన మరో ఇద్దరు ముగ్గురు ఉద్యోగులను విచారించారు. బాధితురాలిని కలుసుకుని, ఆమె వాంగ్మూలాన్ని తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని, అలాగే ఈ సంఘటనకు సంబంధించి తేజ్‌పాల్ ఈ-మెయిల్స్ సేకరించేందుకు కూడా ప్రయత్నిస్తున్నామని గోవా పోలీసు అధికారులు చెప్పారు. త్వరలోనే తేజ్‌పాల్ అరెస్టు తప్పకపోవచ్చని ఢిల్లీ పోలీసులు తెలిపారు. కాగా, ఈ కేసులో పోలీసులకు అవసరమైన సమాచారాన్ని అందిస్తానని, దర్యాప్తునకు సహకరిస్తానని ‘తెహెల్కా’ మేనేజింగ్ ఎడిటర్ షోమా చౌదరి మీడియాకు చెప్పారు. ఈ కేసులో సాక్ష్యాలను కప్పిపుచ్చేందుకు ప్రయత్నించినట్లు తనపై వచ్చిన ఆరోపణలను ఆమె తోసిపుచ్చారు. ఇదిలా ఉండగా, ఈ కేసు దర్యాప్తు విషయంలో పోలీసులపై ఎలాంటి రాజకీయ ఒత్తిడీ లేదని గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ చెప్పారు. కాగా, పణజిలో గోవా డీఐజీ ఓపీ మిశ్రా మాట్లాడుతూ, హోటల్‌లోని ఎలివేటర్లు ఉన్న ప్రాం తంలో ఎలాంటి సీసీటీవీ కెమెరాలు లేవని తెలిపారు.
 
 అయితే, హోటల్ నుంచి సీసీటీవీ కెమెరాల్లోని దృశ్యాలను సేకరించామని, తగిన సాంకేతిక సౌకర్యాలు అందుబాటులో లేనందున వెంటనే వాటిని విశ్లేషించలేకపోయామని చెప్పారు. పోలీసుల ఎదుట వాంగ్మూలం ఇచ్చేందుకు బాధితురాలు సంసిద్ధత వ్యక్తం చేసినట్లు మీడియాలో వార్తలు వచ్చాయని, ఇది మంచి పరిణామమని డీఐజీ మిశ్రా అన్నారు. ఇదిలా ఉండగా, లోక్‌సభ స్పీకర్ మీరా కుమార్ కోల్‌కతాలో ఈ సంఘటనపై మాట్లాడుతూ, ఇలాంటి సంఘటనల్లో చట్టం తన పని తాను చేసుకుపోవాలన్నారు.

>
మరిన్ని వార్తలు