‘బీజేపీకి ముస్లిం మహిళల భారీ ఓటింగ్‌’

19 Mar, 2017 10:52 IST|Sakshi
‘బీజేపీకి ముస్లిం మహిళల భారీ ఓటింగ్‌’

గాంధీనగర్‌: ట్రిపుల్‌ తలాక్‌తో నష్టపోయిన ముస్లిం మహిళలు ఉత్తరప్రదేశ్‌లో పెద్దఎత్తున బీజేపీకి ఓటువేశారని కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ అభిప్రాయపడ్డారు. గుజరాత్‌ జాతీయ న్యాయ విశ్వవిద్యాలయంలో శనివారం జరిగిన 8వ స్నాతకోత్సవంలో పాల్గొని ఆయన మాట్లాడారు.

‘ట్రిపుల్‌ తలాక్‌ వల్ల యూపీలో ముస్లిం మహిళలు తీవ్రమైన కష్టాలను ఎదుర్కొన్నారు. వారందరూ బీజేపీకే పట్టం కట్టారు’ అని తెలిపారు. ట్రిపుల్‌ తలాక్‌ కేవలం మత సంబంధమైన అంశం కాదనీ, అది న్యాయం, సమానత్వం, గౌరవానికి సంబంధించిన విషయమని రవిశంకర్‌ స్పష్టం చేశారు. ఈ విషయంపై బీఎస్పీ చీఫ్‌ మాయావతి, ప్రియాంకా గాంధీ, యూపీ మాజీ సీఏం అఖిలేశ్‌ భార్య డింపుల్‌ స్పందించకపోవడం బాధాకరమన్నారు. మహిళల పట్ల వివక్ష చూపడం రాజ్యాంగ వ్యతిరేకమన్నారు. 20కి పైగా ఇస్లామిక్‌ దేశాల్లో ట్రిపుల్‌ తలాక్‌కు సవరణలు చేయడమో, నిషేధించడమో చేశారన్నారు.

అయోధ్యలోని వివాదాస్పద భూభాగంలో రాజ్యాంగబద్ధంగా రామ మందిరాన్ని కట్టితీరుతామని స్పష్టం చేశారు. సుప్రీం తీర్పు తమకు అనుకూలంగా వస్తుందన్న ఆశాభావాన్ని ప్రసాద్‌ వ్యక్తం చేశారు. ఇందుకోసం బలమైన సాక్ష్యాధారాలను న్యాయస్థానానికి అందించినట్లు తెలిపారు. కాంగ్రెస్‌ అసలు సమస్య రాహుల్‌ గాంధీయేనని ఆయన విమర్శించారు. తాము బలమైన ప్రతిపక్షాన్ని కోరుకుంటున్నట్లు స్పష్టం చేశారు. రాబోయే గుజరాత్‌ ఎన్నికల్లో యూపీ తరహాలో బీజేపీ భారీ మెజారిటీ సాధిస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు