గడువు ముగిసినా.. వీడని చెర

3 Aug, 2015 07:36 IST|Sakshi
గడువు ముగిసినా.. వీడని చెర

ట్రిపోలిలో ఉగ్రవాదుల చెరలోనే తెలుగు ప్రొఫెసర్లు
* ఆదివారం విడుదల చేస్తారని ఆశగా చూసిన బంధువులు
* ప్రాణాలు కాపాడమంటూ దత్తాత్రేయకు వేడుకోలు   

సాక్షి, హైదరాబాద్: లిబియా దేశంలో కిడ్నాప్‌నకు గురైన తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రొఫెసర్లు తిరువీధుల గోపీకృష్ణ, చిలువేరు బలరాం కిషన్‌లు తీవ్రవాదుల చెర వీడలేదు. దీంతో ఇరు కుటుంబాలు కన్నీరు మున్నీరవుతున్నాయి.

వీరితోపాటే  కిడ్నాప్‌నకు గురై విడుదలైన కర్ణాటకకు చెందిన ప్రొఫెసర్లు లక్ష్మీకాంతం, విజయ్‌కుమార్‌లు  విదేశాంగ శాఖ అధికారులతో చెప్పిన మాటల ప్రకారం ఆదివారం సాయంత్రానికి తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇద్దరు ప్రొఫెసర్లు విడుదల కావాల్సి ఉంది. దీంతో  గోపీకృష్ణ, బలరాం కిషన్‌ల కుటుంబసభ్యులు ఆదివారం రాత్రి వరకు ఎప్పుడు తీపి కబురు వస్తుందోనని ఎదురుచూస్తూ కాలం గడిపారు.

తీరా సాయంత్రానికి సైతం ఎలాంటి సమాచారం లేకపోవటంతో బలరాం కిషన్ భార్య శ్రీదేవి ఇతర కుటుంబసభ్యులు హైదరాబాద్‌లోని దిల్‌కుష అతిథి గృహంలో కేంద్రమంత్రి దత్తాత్రేయను కలుసుకుని తమ వారి ప్రాణాలు ఎలాగైనా కాపాడమంటూ ప్రాధేయపడ్డారు. ఈ విషయమై దత్తాత్రేయ ప్రతిస్పందిస్తూ ఇద్దరు తెలుగు ప్రొఫెసర్ల ప్రాణాలు కాపాడేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని, సోమవారం మరోసారి తానే స్వయంగా విదేశాంగశాఖ అధికారులతో సంప్రదింపులు జరుపుతానని హామీ ఇచ్చారు.
 
ఆ ఇద్దరినీ వదిలేస్తారు..: తీవ్రవాదుల చెరలో ఉన్న ఇద్దరు తెలుగువారిని తప్పకుండా విడుదల చేస్తారంటూ కిడ్నాప్ చెర నుండి విడుదలైన కర్ణాటకకు చెందిన లక్ష్మీకాంతం, విజయ్‌కుమార్‌లు గోపీకృష్ణ, బలరాం కిషన్‌ల కుటుంబసభ్యులకు బరోసానిచ్చారు. వారిద్దరు లిబియా నుండి ఆదివారం స్వస్థలాలకు బయలుదేరే ముందు గోపీకృష్ణ, బలరాంకిషన్‌ల కుటుంబ సభ్యులతో ఫోన్‌లో మాట్లాడారు. తమ వద్ద ఉన్న ధృవపత్రాలన్నీ తీవ్రవాదులు క్షుణ్ణంగా పరిశీలించారని, గోపీకృష్ణ, బలరాంకిషన్‌లకు సంబంధించిన మరిన్ని ధృవపత్రాలను ట్రిపోలి యూనివర్సిటీ ప్రతినిధులు ఉగ్రవాదులకు పంపారని చెప్పారు. ఆదివారం రాత్రి  లేదా సోమవారం ఉదయంలోగా ఖచ్చితంగా విడుదలవుతారని, ఇదే విషయమై ఆదివారం కూడా తీవ్రవాదులతో సంప్రదింపులు జరిపిన యూనివర్సిటీ ప్రతినిధులు తమతో చెప్పారని లక్ష్మీకాంతం, విజయ్‌కుమార్‌లు పేర్కొన్నారు.

Read latest Top-news News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు