బాలికపై అత్యాచారం: పోలీసు అధికారి అరెస్టు

15 Oct, 2013 16:47 IST|Sakshi

కంచే చేను మేసింది. కనురెప్పే కాటేసింది. త్రిపురలో ఓ అసిస్టెంట్ సబ్-ఇన్స్పెక్టర్ ఓ బాలికపై అత్యాచారం చేసి అరెస్టయ్యాడు. ఈ సంఘటన దక్షిణ త్రిపురలో జరిగింది. గోమతి జిల్లాలోని పిత్రా పట్టణంలో ఏఎస్ఐగా పనిచేస్తున్న మంగళ్ దేవ్ వర్మ 11వ తరగతి చదువుతున్న అమ్మాయిపై అత్యాచారం చేసినందుకు ఆయనను అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ జ్ఞాన తిరు సంబంధన్ తెలిపారు. దేవ్ వర్మను మంగళవారం నాడు కోర్టులో హాజరు పరిచారు.అతడిని సర్వీసు నుంచి సస్పెండ్ చేసి, విచారణకు ఆదేశించారు.

శనివారం రాత్రి ఇటుక బట్టీల వద్ద జరిగిన ఈ సంఘటనను తొక్కిపెట్టేందుకు కొందరు పోలీసు అధికారులు ప్రయత్నించారన్న ఆరోపణలపై కూడా దర్యాప్తు జరిపిస్తున్నామని ఎస్పీ తెలిపారు. అమ్మాయి కుటుంబం దేవ్ వర్మకు ముందునుంచి తెలుసు. దాంతో ఆమెను తన ద్విచక్ర వాహనంపై ఎక్కించుకుని, ఇటుకబట్టీల వద్దకు తీసుకెళ్లి, ఆమెపై అత్యాచారం చేశాడు. అటువైపు వేరేవాళ్లు వెళ్తుండగా అమ్మాయి అరవడంతో వాళ్లు వచ్చి రక్షించారు. దేవ్ వర్మ అక్కడినుంచి వెంటనే పారిపోయాడు. ఈ కేసు నమోదుచేసుకోడానికి మొదట్లో రాధా కిషోర్పూర్ పోలీసులు నిరాకరించారు. కానీ, మహిళా పోలీసు స్టేషన్ అధికారులు జోక్యం చేసుకోవడంతో కేసు నమోదైంది.

మరిన్ని వార్తలు