పార్టీ విలీనమైతే.. మేం ఏమైపోవాలి?

12 Feb, 2014 04:54 IST|Sakshi

పార్టీ విలీనం వార్తలపై టీఆర్‌ఎస్ శ్రేణుల్లో ఆందోళన
 న్యూఢిల్లీ నుండి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీతో టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌రావు సమావేశమైన తర్వాత ఆ పార్టీ శ్రేణుల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. తెలంగాణ ఏర్పాటుపై సంతోషం వ్యక్తం చేస్తున్న పార్టీవర్గాలు.. కాంగ్రెస్‌లో విలీనం లేదా పొత్తు వార్తలను మాత్రం జీర్ణించుకోలేకపోతున్నాయి. కోట్లు ఖర్చు పెట్టిన తాము ఏమై పోవాలంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారుు. ఈ నేపథ్యంలో సోనియా, కాంగ్రెస్ ముఖ్యనేతలు అహ్మద్ పటేల్, దిగ్విజయ్ సింగ్‌తో కేసీఆర్ జరిపిన చర్చల వివరాలను ఆయన సన్నిహితుల వద్ద ఆరా తీస్తున్నారు. టీఆర్‌ఎస్ విలీనంపై వస్తున్న వార్తల గురించి పదేపదే పార్టీ ముఖ్యనేతలను ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ బిల్లు మినహా విలీనం లేదా ఇతర అంశాలపై కేసీఆర్ చర్చించలేదని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. కాంగ్రెస్‌లో టీఆర్‌ఎస్ విలీనం ఉండదని, పొత్తు మాత్రమే ఉండే అవకాశం ఉందని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అరుునప్పటికీ టీఆర్‌ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జిలు వారి మాటలు నమ్మడం లేదు. సోనియా, ఇతర కాంగ్రెస్ పెద్దలను కేసీఆర్ ఒంటరిగా కలవడాన్ని టీఆర్‌ఎస్ శ్రేణులు అనుమానిస్తున్నాయి.
 
  ఇప్పటిదాకా ఎంతోమంది జాతీయ నాయకులను కలసినప్పుడు లేని రహస్యం కాంగ్రెస్ పెద్దలను కలసినప్పుడు ఎందుకని ప్రశ్నిస్తున్నాయి. మరోవైపు నియోజకవర్గ ఇన్‌చార్జిల్లో తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతోంది. ‘ఇప్పటిదాకా కోట్లాది రూపాయలు పార్టీ కోసం వెచ్చించాం. ఆర్థికంగా, వ్యక్తిగతంగా ఎన్నో కష్టనష్టాలకు ఓర్చాం. ఎప్పటికైనా ఎమ్మెల్యే అవుతామని ఆశించాం. ఇప్పుడు పార్టీని విలీనం చేస్తే కేసీఆర్‌కు దగ్గరగా ఉన్న ఒకరిద్దరికి తప్ప మిగిలినవారికి అవకాశాలు ఉంటాయా?’ అని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ‘పార్టీకి కష్టకాలంలో మేం పెద్దవాళ్లమే. కేసీఆర్ తిరిగే పరిస్థితి లేనప్పుడు మేం కావాల్సి వచ్చింది. ఎక్కడున్నా వెంటనే రమ్మని కేసీఆర్, ఆయన కుటుంబసభ్యులు బతిమిలాడి మరీ పిలుచుకున్నరు. ఇప్పుడేమో మాతో పనేలేకుండా పోయింది. ఇంటికి పోతే ఈసడించుకుంటున్నరు’ అని టీఆర్‌ఎస్ ఆవిర్భావం నుండి పనిచేస్తున్న పార్టీ నేతలు పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని వార్తలు