అమెరికన్‌ డ్రీమర్స్‌పై ట్రంప్‌ కత్తి..

4 Sep, 2017 21:03 IST|Sakshi
అమెరికన్‌ డ్రీమర్స్‌పై ట్రంప్‌ కత్తి..
- బాల్యంలోనే అమెరికాకు వలసొచ్చిన వారిపై నిర్ణయం
- వర్క్‌ పర్మిట్ల రద్దుపై మంగళవారం  ప్రకటన చేయనున్న ప్రెసిడెంట్‌
- ప్రభావాన్ని ఎదుర్కొనేవాళ్లలో మనవాళ్లు ఏడువేల మంది
 
సాక్షి, వాషింగ్టన్‌ : అమెరికాలో నివసించడానికి, పనిచేయడానికి అనుమతించే అధికారిక పత్రాలు లేని ఏడు వేల మంది భారతీయ అమెరికన్‌ యువకులు సహా దాదాపు 8 లక్షల మంది వర్క్ పర్మిట్లు రద్దుపై అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మంగళవారం ప్రకటన చేయనున్నారు. ఇతర దేశాల నుంచి తమ తల్లిదండ్రులతో పాటు వచ్చిన పిల్లలే ఈ యువకులు. వారిని అమెరికాలో డ్రీమర్లు(స్వాప్నికులు) అని పిలుస్తారు.  

ఇక్కడ జీవించడానికి, పనిచేయడానికి అవసరమైన డాక్యుమెంట్లు లేకున్నా ఈ పిల్లలు అమెరికాలోనే చదువుకుని, ఉద్యోగాలు కూడా చేస్తున్నారు. వారిలో అత్యధికశాతం పొరుగుదేశమైన మెక్సికో, మధ్య, దక్షిణ అమెరికా దేశాల్లో పుట్టారు. ఇండియా, వియత్నాం వంటి ఆసియా దేశాలకు చెందిన ఇలాంటి యువకుల వాటా తొమ్మిది శాతానికి మించదని అంచనా.

ఈ పిల్లల వల్ల స్థానిక అమెరికన్లకు హాని జరుగుతోందని, వారిలో కొందరు చట్టవ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొంటున్నారనేది ట్రంప్‌ మద్దతుదారుల ఆరోపణ. తల్లిదండ్రుల కారణంగా అమెరికా వచ్చిన ఈ డ్రీమర్లు దేశ ఆర్థికవ్యవస్థ బలోపేతానికి కృష్టిచేస్తున్న కారణంగా వారిపై దయ చూపాలేగాని, శిక్షించరాదనే అభిప్రాయంతో ఏకీభవించిన మాజీ అధ్యక్షుడు బరాక్ఒబామా 2012లో వెసులుబాటు కల్పించారు.
 
దేశంలో పెరిగి ఉద్యోగాలు చేస్తున్న స్వాప్నికులను వారు పుట్టిన దేశాలకు పంపకుండా కాపాడడానికి 'బాల్యంలోనే వచ్చినవారిపై చర్యల వాయిదా'(డిఫర్డ్ యాక్షన్‌ ఫర్‌ చైల్డ్‌హుడ్‌ అరైవల్స్‌-డాకా) అనే సహాయ కార్యక్రమాన్ని 2012 జూన్15న ఒబామా ప్రకటించారు. అమెరికా ఫెడరల్‌ సర్కారు నిధులతో అమలయ్యే ఈ కార్యక్రమం కింద లబ్ధి పొందడానికి దాదాపు 8 లక్షల మంది పెట్టుకున్న దరఖాస్తులను ఆమోదించారు. ఇలా అర్హత పొందిన యువతీయువకులు డాకా కింద ప్రతి రెండేళ్లకు తమ వర్క్‌ పర్మిట్లను పొడిగించకునే అవకాశం కల్పించారు. రెన్యూవల్‌ సౌకర్యం తొలగించి, వారు జన్మించిన దేశాలకు పంపించడానికి వీలుగా డాకాను రద్దుచేయాలనే డిమాండ్‌ రెండేళ్ల క్రితమే మొదలైంది. అమెరికన్లకు కష్టాలు వలసొచ్చినవారి వల్లేననే వాదనకు ట్రంప్‌ హయాంలో బలం చేకూరింది. అయితే, ఇన్ని లక్షల మందిని అర్ధంతరంగా వారెరగని దేశాలకు పంపడం అన్యాయమని అన్ని పార్టీలకు చెందిన చాలా మంది నేతలు గుర్తించారు.
 
యాపిల్‌ సీఈవో టిమ్‌ కుక్‌, మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్యా నాదెళ్ల వంటి మెగా టెక్‌ కంపెనీల ఉన్నతాధికారులు డాకా ప్రోగ్రాం రద్దును వ్యతిరేకిస్తున్నారు. పాలకపక్షమైన రిపబ్లికన్‌ పార్టీకి చెందిన సెనెటర్లు, ప్రతినిధుల సభ సభ్యులు, స్పీకర్‌ కూడా డ్రీమర్లకు డాకా ద్వారా లభిస్తున్న సౌకర్యాలు రద్దుచేయకూడదనే కోరుతున్నారు. అందుకే మంగళవారం ట్రంప్‌ వెంటనే డాకా రద్దుచేయకుండా ఆరు నెలలు యధాతథ స్థితి కొనసాగడానికి అవకాశమిస్తారని భావిస్తున్నారు. వర్క్‌ పర్మిట్లు ఇక ముందు పొడిగించుకునే వీలులేకుండా దాని స్థానంలో కొత్త చట్టం చేయాలనిఅమెరికా కాంగ్రెస్‌ను ట్రంప్‌ కోరవచ్చని అమెరికా మీడియా సంస్థలు అంచనావేస్తున్నాయి.

- (సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌)
మరిన్ని వార్తలు