చైనాపై మరోసారి విరుచుకుపడ్డ ట్రంప్

12 Dec, 2016 08:40 IST|Sakshi
చైనాపై మరోసారి విరుచుకుపడ్డ ట్రంప్
వాషింగ్టన్ : చైనా అనుసరిస్తున్న విధానాలను ముందు నుంచి వ్యతిరేకిస్తున్న అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఆ దేశంపై తీవ్రస్థాయిలో విరుచుపడ్డారు. వాణిజ్య విషయాల్లో బీజింగ్ మినహాయింపులు ఇవ్వడానికి తిరస్కరిస్తున్నప్పుడు 'వన్ చైనా' పాలసీని కొనసాగించాల్సినవసరం ఏముందని ప్రశ్నించారు. కమ్యూనిస్ట్ పార్టీ ఎవరిన్నీ నడిపించాల్సినవసరం లేదని దుమ్మెత్తిపోశారు.  'వన్ చైనా' పాలసీలో తైవాన్పై చైనా అనుసరిస్తున్న ఆధిపత్య విధానాన్ని అమెరికా 1979 నుంచి గౌరవిస్తూ వస్తోంది. కానీ ఇటీవల అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్ మాత్రం ఆ పాలసీని వ్యతిరేకిస్తున్నారు. చైనా ఎలాంటి మినహాయింపులు ఇవ్వకుండా ఆ పాలసీని కొనసాగిస్తున్నట్టు, ఇలా నియంతృత్వ పోకడగా ఉన్నప్పుడు దాని ఆధిపత్యంలో కొనసాగాల్సినవసరం ఏముందని ప్రశ్నించారు.  చైనా ఇతర దేశాలను పట్టించుకోకుండా ఎప్పడికప్పుడూ తమ కరెన్సీని డివాల్యుయేషన్ చేస్తుందని,  సరిహద్దు ప్రాంతాల్లో మనం ఆ దేశానికి పన్నులు మినహాయింపులు ఇచ్చినప్పుడు చైనా మాత్రం భారీగా పన్ను వసూలు చేస్తుందని మండిపడ్డారు.
 
ఉత్తరకొరియా దేశంతో చైనా సంబంధాలు కలిగి ఉన్నప్పటికీ కూడా ఆ దేశ అధ్యక్షుడు తీసుకునే నియంతృత్వ పోకడలను మాత్రం కట్టడిచేయలేకపోతుందని ఆరోపించారు. ఇతర దేశాలకు ఏ విషయంలోనూ సాయపడని చైనాతో మనం కలిసి పనిచేయాల్సినవసరం ఏముంది? అని ప్రశ్నించారు. చైనా అమెరికాను నియంత్రణ చేయడం తమకు ఏమాత్రం ఇష్టలేదని తేల్చిచెప్పేశారు. చైనాతో సంబంధాలు దెబ్బతినేలా తైవాన్ అధ్యక్షురాలు సాయ్ ఇంగ్ వెన్తో ట్రంప్ ఫోన్లో మాట్లాడటంపై చైనా ఇప్పటికే గరంగరంగా ఉంది.  గత దశాబ్దకాలంగా ఏ అమెరికా అధ్యక్షుడు కూడా తైవానీస్ నేతలతో మాట్లాడలేదు. ట్రంప్ ఎన్నికల్లో గెలవడమే ఆ దేశ అధ్యక్షురాలితో మాట్లాడటం, తైవాన్ తమ భూభాగ ప్రాంతమని చెప్పుకుంటున్న చైనాకు ట్రంప్ చర్యలు మింగుడు పడటం లేదు. ప్రస్తుతం వన్ చైనా పాలసీని ట్రంప్ విమర్శలు చేయడం చైనాకు మరింత ప్రతికూలంగా మారనుంది.
మరిన్ని వార్తలు