అది వారికి నచ్చడం లేదు: ట్రంప్‌

30 May, 2017 10:35 IST|Sakshi
అది వారికి నచ్చడం లేదు: ట్రంప్‌

వాషింగ్టన్‌: అమెరికన్లు తమ దేశ ప్రభుత్వంలో ‘నిజంగా’ ఏం జరుగుతుందో తెలుసుకోవడం ఇక్కడి మీడియా సంస్థలకు ఇష్టంలేదని అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అన్నారు. మీడియా సంస్థలు అసత్యపు వార్తలను ప్రసారం చేస్తున్నాయనీ, నిజాలేంటో ప్రజలకు చెప్పడానికి తాను ట్విటర్‌ను వినియోగిస్తుంటే అది వారికి నచ్చడం లేదని  పేర్కొన్నారు. ఆధారం చూపకుండా కేవలం ‘విశ్వసనీయ వర్గాలు తెలిపాయి’ అంటూ ప్రసారం చేస్తున్న వార్తలన్నీ మీడియా వండి వార్చిన అబద్ధాలేనన్నారు.

అమెరికా అధ్యక్షుడిగా తొలి విదేశీ పర్యటన పూర్తి చేసుకుని వచ్చిన ట్రంప్‌ తాను సోషల్‌ మీడియాలో ఉండడాన్ని సమర్థించుకున్నారు. తన ప్రభుత్వంపై మీడియా కల్పిత కథనాలు ప్రచారం చేస్తోందని ఆయన ఆరోపించారు. నకిలీ న్యూస్‌ రైటర్స్‌ ఇలాంటి కథనాలు అల్లుతున్నారని ధ్వజమెత్తారు. తన అల్లుడు వైట్‌హౌస్‌ సీనియర్‌ సలహాదారు జారెడ్‌ కుష్‌నర్‌ గతంలో రష్యా రాయబారితో జరిపిన భేటీపై మీడియాలో వ్యతిరేక కథనాలు వచ్చిన నేపథ్యంలో ట్రంప్‌ ఈవిధంగా విరుచుకుపడ్డారు.

కాగా, ప్రపంచంలో ఉత్తమమైన హెల్త్‌కేర్‌ పాలసీని తీసుకొస్తామని ట్రంప్‌ ప్రకటించారు. ఒబామా కేర్‌ చచ్చిపోయిందని, తమ పార్టీ దీనికంటే మంచి ఆరోగ్య విధానాన్ని ప్రవేశపెడతామని అన్నారు.

మరిన్ని వార్తలు