ట్రంప్‌కు సొంత పార్టీ నుంచే భారీ షాక్‌!

9 Aug, 2016 15:02 IST|Sakshi
ట్రంప్‌కు సొంత పార్టీ నుంచే భారీ షాక్‌!

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీపడుతున్న రిపబ్లికన్‌ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌కు సొంత పార్టీ నుంచే భారీ ఎదురుదెబ్బ తగిలింది. రిపబ్లికన్‌ పార్టీకి చెందిన జాతీయ భద్రతా నిపుణులు 50 మంది ట్రంప్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతూ ఒక ప్రకటన విడుదల చేశారు. ట్రంప్‌ గెలిస్తే అమెరికాకు ఆయన ప్రమాదకర అధ్యక్షుడిగా మారుతారని, ఆయన అధ్యక్షుడైతే.. దేశ భద్రత ప్రమాదంలో పడుతుందని వారు పేర్కొన్నారు.

50మందితో కూడిన ఈ బృందంలో గతంలో టాప్‌ గూఢచారులుగా, దౌత్యవేత్తలుగా పనిచేసినవారు, రిచర్డ్‌ నిక్సన్‌ నుంచి జార్జ్‌ బుష్‌ వరకు రిపబ్లికన్‌ ప్రభుత్వ కేబినెట్‌లో మంత్రులుగా పనిచేసిన వారు ఉన్నారు. డొనాల్డ్ ట్రంప్‌కు ఎలాంటి విలువలుగానీ, వ్యక్తిత్వంగానీ లేవని, ఆయన అధ్యక్షుడైతే దేశం అన్నివిధాలుగా భ్రష్టుపట్టిపోతుందని వారు తీవ్రంగా ధ్వజమెత్తారు. తమలో ఎవరూ కూడా ట్రంప్‌కు ఓటువేయబోరని స్పష్టం చేశారు. విదేశాంగ విధానం దృష్ట్యా అతడు ఏమాత్రం అధ్యక్ష పదవికిగానీ, కమాండర్‌ ఇన్‌ చీఫ్‌ పదవికిగానీ అర్హుడు కాదని తేల్చి పారేశారు.

'ముఖ్యంగా ట్రంప్‌కు వ్యక్తిత్వంగానీ, విలువలుగానీ లేవు. అధ్యక్షుడయ్యే అనుభవమూ లేదు. స్వేచ్ఛాయుత ప్రపంచ నాయకుడిగా అమెరికా నైతిక అధికారాన్ని ట్రంప్‌ దెబ్బతీస్తున్నారు' అంటూ పేర్కొన్న ఈ ప్రకటనలో 50మంది రిపబ్లికన్‌ నిపుణులు సంతకాలు చేశారు.

అయితే, ఈ ప్రకటనను డొనాల్డ్ ట్రంప్‌ కొట్టిపారేశారు. ఆ 50 మంది వాషింగ్టన్‌కు చెందిన సంపన్నులేనని, వారి అభిప్రాయాలే నిజమైతే ప్రపంచమిప్పుడు ఎందుకు ఇంతగా గందరగోళంగా ఉందని ట్రంప్‌ విమర్శించారు. మరోవైపు రిపబ్లికన్‌ పార్టీ సీనియర్‌ సెనేటర్‌ సుసాన్‌ కొలిన్స్‌ కూడా ట్రంప్‌కు వ్యతిరేకంగా గళం ఎత్తారు. అమెరికా అధ్యక్షుడయ్యే ఏ ఒక్క అర్హత కూడా ట్రంప్‌కు లేదని, రిపబ్లికన్‌ పార్టీ చారిత్రక విలువలన్నీఆయన ఏమాత్రం పాటించడం లేదని ధ్వజమెత్తారు. సొంత పార్టీ నుంచి విమర్శలు వెల్లువెత్తుతుండటంతో ట్రంప్‌ ఉక్కిరిబిక్కిరి అవుతున్నట్టు రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

మరిన్ని వార్తలు