పీఎస్సీల స్టాండింగ్‌ కమిటీ చైర్మన్‌గా ఘంటా

20 Feb, 2017 02:52 IST|Sakshi
పీఎస్సీల స్టాండింగ్‌ కమిటీ చైర్మన్‌గా ఘంటా

పీఎస్సీల నేషనల్‌ కాన్ఫరెన్స్‌ సమావేశంలో ఏకగ్రీవంగా ఎన్నిక
సాక్షి, హైదరాబాద్‌:
రాష్ట్ర పబ్లిక్‌ సర్వీసు కమిషన్ల నేషనల్‌ కాన్ఫరెన్స్‌ స్టాండింగ్‌ కమిటీ చైర్మన్‌గా తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ చైర్మన్‌ (టీఎస్‌పీఎస్సీ) ఘంటా చక్రపాణి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వివిధ రాష్ట్రాల్లోని పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్లు అమలు చేసే విధానపరమైన నిర్ణయాలను రూపొందించే పీఎస్సీల అత్యున్నత నిర్ణాయక కమిటీ ఇది. గుజరాత్‌లో రెండ్రోజులుగా జరిగిన పీఎస్సీల నేషనల్‌ కాన్ఫరెన్స్‌ సమావేశంలో రెండో రోజైన ఆదివారం ఈ ఎన్నిక జరిగింది. ఈ పదవిలో మూడేళ్లపాటు కొనసాగనున్నారు.

దేశంలోని పబ్లిక్‌ సర్వీసు కమిషన్లను డిజిటలైజేషన్‌ వైపు నడిపించిన ఘనత ఘంటా చక్రపాణికే దక్కుతుందని యూపీఎస్సీ చైర్మన్‌ ఫ్రొఫెసర్‌ డేవిడ్‌ రీడ్‌ సిమ్లే పేర్కొన్నారు. అన్ని రాష్ట్రాల్లో గ్రూప్‌–1, గ్రూప్‌–2కు కామన్‌ సిలబస్‌ విధానం అమలుకు చర్యలు చేపట్టిన చక్రపాణికి అభినందనలు తెలిపారు. టీఎస్‌పీఎస్సీ అమలు చేస్తున్న సంస్కరణలు, సాంకేతిక పరిజ్ఞానం వినియోగాన్ని ఇతర రాష్ట్రాల పీఎస్సీలు అమలు చేసేలా చర్యలు చేపట్టాలని గుజరాత్‌ గవర్నర్‌ ఆకాంక్షించారు.

సీఎం కేసీఆర్‌ అభినందనలు..
పీఎస్సీల నేషనల్‌ కాన్ఫరెన్స్‌ స్టాండింగ్‌ కమిటీకి చైర్మన్‌గా ఎన్నికైన చక్రపాణికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అభినందనలు తెలిపారు. చక్రపాణిని చైర్మన్‌గా యూపీఎస్సీ చైర్మన్, ఇతర రాష్ట్రాల పీఎస్సీల చైర్మన్లు ఎన్నుకున్నందుకు సంతోషం వ్యక్తం చేశారు. ఈ మేరకు చక్రపాణికి మెసేజ్‌ పంపించారు. ఇది అన్ని రాష్ట్రాల పీఎస్సీలకు టీఎస్‌పీఎస్సీ నాయకత్వం వహించి ముందుకు తీసుకెళ్లేందుకు దోహదపడుతుందని వివరించారు.

మరిన్ని వార్తలు