తోకముడిచిన సైన్యం!

16 Jul, 2016 10:42 IST|Sakshi
తోకముడిచిన సైన్యం!

అంకారా: ప్రజల సంఘటిత శక్తి ముందు సైనిక తిరుగుబాటు వ్యూహం బెడిసికొట్టింది.  టర్కీ అధ్యక్షుడు తయ్యిప్ ఎర్డోగాన్ పిలుపు మేరకు ప్రజలు విధుల్లోకి రావడంతో అధికార కాంక్షతో తెగబడిన సైన్యం తోక ముడిచింది. టర్కీలో సైనిక తిరుగుబాటు విఫలమైంది. అధ్యక్షుడిగా తన పట్టును ఎర్డోగాన్ మరింత బిగించారు. తిరుగుబాటుకు దిగిన సైన్యంపై ఆయన ఉక్కుపాదాన్ని మోపుతున్నట్టు తాజా సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. సైన్యం జరిపిన తిరుగుబాటు వల్ల తలెత్తిన హింసలో 90 మంది వరకు చనిపోయారు.

టర్కీ వాయవ్య తీరప్రాంతమైన మార్మారీస్‌కు అధ్యక్షుడు ఎర్డోగాన్ విహారయాత్రకు వెళ్లడంతో ఇదే అదనుగా భావించిన సైన్యంలో ఓ చీలిక వర్గం శనివారం తెల్లవారుజామున సైనిక కుట్రకు తెగబడింది. టర్కీలో ప్రధాన నగరాలైన ఇస్తాంబుల్, రాజధాని అంకారాలను తమ అధీనంలోకి తీసుకొనేందుకు సైనిక తిరుగుబాటుదారులు ప్రయత్నించారు. ప్రభుత్వ చానెల్‌ను తమ అధీనంలోకి తీసుకొని దేశంలో సైనిక పాలన విధిస్తున్నట్టు ప్రకటన చేయాలని ఒత్తిడి చేశారు.  

ఈ నేపథ్యంలో హుటాహుటీన తిరిగివచ్చిన ఎర్డోగాన్ వెంటనే సైనిక తిరుగుబాటును అణచివేసేందుకు చర్యలు తీసుకున్నారు. సైనిక తిరుగుబాటు దేశద్రోహచర్య అని, దీనికి కారకులు తీవ్ర మూల్యం చెల్లించుకోక తప్పదని ఆయన హెచ్చరించారు. ప్రజలు వీధుల్లోకి వచ్చి సైనిక తిరుగుబాటును తిప్పికొట్టాలని ఎర్డోగాన్ ఇస్తాంబుల్ విమానాశ్రయంలో తన మద్దతుదారులను ఉద్దేశించి పిలుపునిచ్చారు.

ఎర్డోగాన్ పిలుపుతో ప్రజలు వీధుల్లోకి రావడం, ఇటు పోలీసులు, ప్రభుత్వ దళాలు సైనిక తిరుగుబాటుదారుల దాడిని దీటుగా తిప్పికొట్టడంతో సైనిక కుట్ర విఫలమైనట్టు భావిస్తున్నారు. పోలీసులు సైనిక తిరుగుబాటుదారులపై ఉక్కుపాదం మోపారు. టర్కీ వ్యాప్తంగా మొత్తం 754 మంది సైనికులను అదుపులోకి తీసుకొన్నారు. తిరుగుబాటు నేపథ్యంలో సైన్యానికి తాత్కాలిక నూతన అధ్యక్షుడిని నియమించినట్టు టర్కీ ప్రధాని బెనాలీ ప్రకటించారు. అంకారాలో కొంతమంది సైనిక తిరుగుబాటుదారులు ప్రతిఘటిస్తున్నారని, వారిని కూడా ఏరివేస్తామని అధ్యక్షుడు ఎర్డోగాన్ మీడియాకు తెలిపారు. టర్కీలో పరిస్థితి పూర్తిగా ప్రజా ప్రభుత్వం నియంత్రణలోనే ఉందని ఆయన స్పష్టం చేశారు.




>
మరిన్ని వార్తలు