రెండేళ్లయితే.. బైక్ మార్చెయ్!

26 Sep, 2013 01:22 IST|Sakshi
రెండేళ్లయితే.. బైక్ మార్చెయ్!

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: యువకులు ఆలోచన ల్లోనే కాదు, బైక్‌ల కొనుగోళ్ల విషయంలోనూ వేగంగా దూసుకెళ్తున్నారట. అందుకే 150 సీసీ, ఆపై సామర్థ్యం ఉన్న ప్రీమియం బైక్‌లను రెండు, రెండున్నరేళ్లకోసారి మార్చి కొత్త మోడళ్లను దక్కించుకుంటున్నారు. మార్కెట్లోకి కొత్త బైక్ ఎప్పుడొస్తుందా.. ఎప్పుడు రోడ్లపైకి దూసుకెళ్దామా అని అలోచించేవారు 15-20 శాతం మంది ఉంటారని టీవీఎస్ మోటార్ అంటోంది. ఇక 100 సీసీ బైక్‌ల విషయంలో అయితే నాలుగైదేళ్లు వాడిన తర్వాతే విక్రయిస్తున్నారని ఈ కంపెనీ చెబుతోంది. ద్విచక్ర వాహనాలను కొంటున్నవారిలో 35-40 శాతం మంది నిన్న మొన్నటివరకు వేరే మోడల్‌ను నడిపించి ఇప్పుడు కొత్త బైక్‌కు మారినవారే. ఇక 150 సీసీ, ఆపై సామర్థ్యంగల బైక్‌ల వాటా ప్రస్తుతం 15 శాతం ఆక్రమించింది.
 
 స్కూటర్ల అమ్మకాలు జూమ్..
 దేశవ్యాప్తంగా స్కూటర్ల అమ్మకాలు పెరుగుతూ వస్తున్నాయి. మొత్తం ద్విచక్ర వాహనాల్లో స్కూటర్ల వాటా 2010-11లో 18 శాతముంటే, ఇప్పుడు 14 శాతం వృద్ధి రేటుతో 23 శాతానికి చేరింది. భారత్‌లో నెలకు అన్ని కంపెనీలవి కలిపి సగటున 2.62 లక్షల స్కూటర్లు అమ్ముడవుతున్నాయి. ఇక పురుషులు మాత్రమే వాడుతున్న స్కూటర్ల వాటా 36 శాతం, స్త్రీలు మాత్రమే నడుపుతున్న మోడళ్లు 13 శాతం, ఇరువురు వాడగలిగే స్కూటర్లు 35 శాతం ఉన్నాయి. మహిళా వాహనదార్ల సంఖ్య 7-8 శాతం పెరుగుతుండగా, పురుషుల విషయంలో ఇది 12-14 శాతం వృద్ధి ఉంటోంది. పట్టణాల్లోని బైక్ వినియోగదారుల్లో స్కూటర్లవైపు మొగ్గు చూపుతున్నవారు 15 శాతం మంది దాకా ఉంటున్నారట. పట్టణీకరణ, సౌలభ్యం కారణంగానే స్కూటర్లకు డిమాండ్ పెరుగుతోందని కంపెనీలు అంటున్నాయి.
 
 రాష్ట్రంలోకి టీవీఎస్ జూపిటర్
 టీవీఎస్ మోటార్ కంపెనీ రాష్ట్ర మార్కెట్లోకి జూపిటర్ స్కూటర్‌ను బుధవారం విడుదల చేసింది. ఈ మోడల్‌ను ప్రవేశపెట్టడం ద్వారా పురుషుల స్కూటర్ల విభాగంలోకి కంపెనీ అడుగిడింది. ప్రస్తుతం నెలకు 30-32 వేల స్కూటర్లను టీవీఎస్ దేశవ్యాప్తంగా విక్రయిస్తోంది. కొత్త మోడల్ చేరికతో వచ్చే మార్చినాటికి అమ్మకాలు నెలకు 50 వేలకు ఎగబాకుతాయని కంపెనీ ప్రాంతీయ మేనేజర్ (సౌత్-2) ఎస్.అరుణ్ కుమార్ ఈ విడుదల సందర్భంగా మీడియాకు తెలిపారు. కస్టమర్లు ఇప్పుడు అధిక మైలేజీ ఇచ్చే స్కూటర్లు   కోరుకుంటున్నట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో జూపిటర్ మోడల్‌లో అత్యాధునిక టెక్నాలజీని వినియోగించామని తెలిపారు. హైదరాబాద్ ఎక్స్‌షోరూంలో జూపిటర్ స్కూటర్ ధర రూ.48,400. మైలేజీ లీటరుకు 62 కిలో మీటర్లు వస్తుందని ఆయన చెప్పారు.
 
 

>
మరిన్ని వార్తలు