ట్విన్‌ టవర్‌.. సీరియల్‌ కిల్లర్‌..

17 Feb, 2017 00:32 IST|Sakshi
ట్విన్‌ టవర్‌.. సీరియల్‌ కిల్లర్‌..

ఇతని పేరు బ్రయాన్‌ జే మాస్టర్‌సన్‌..
వయసు 61 ఏళ్లు..
ఓ పక్షం రోజుల క్రితం చనిపోయాడు..
చనిపోయాడా.. కాదు.. చంపబడ్డాడు..
ఒక్క బ్రయానే కాదు.. చాలా మంది..
కరెక్టుగా చెప్పాలంటే.. 124 మంది ఇలాగే బలయ్యారు..
ఒకరి తర్వాత ఒకరు.. ఒకరి తర్వాత మరొకరు..
16 ఏళ్లుగా ఆ సీరియల్‌ కిల్లర్‌
మారణహోమం కొనసాగుతూనే ఉంది..
ఇంతకీ ఎవరా సీరియల్‌ కిల్లర్‌?
ఇంకెవరు?
2001 ఉగ్రదాడిలో నేలమట్టమైన ట్విన్‌ టవర్‌..!!
అవును.. ఇంతమంది ప్రాణాలను బలితీసుకుంది..
ఆ డబ్ల్యూటీసీ టవర్సే!!




ఐర్లండ్‌కు చెందిన బ్రయాన్‌ న్యూయార్క్‌ ఫైర్‌ డిపార్టుమెంటులో అధికారిగా పనిచేశాడు. 2001లో ఉగ్రదాడిలో ట్విన్‌ టవర్స్‌ కూలినప్పుడు అక్కడే రోజులపాటు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యాడు.. బ్రయాన్‌ కేన్సర్‌తో చనిపోయాడు.. కేన్సర్‌కు కారణమేంటో తెలుసా? డబ్ల్యూటీసీ టవర్స్‌ కూలిన గ్రౌండ్‌ జీరోలో రోజుల తరబడి పనిచేస్తున్నప్పుడు అక్కడి విషపూరితమైన వాయువులు, కాలుష్యానికి లోనవడమే.. ఒక్క బ్రయానే కాదు.. ఆ ప్రదేశంలో నెలల తరబడి పనిచేసిన సహాయక సిబ్బందిలో చాలా మంది కేన్సర్‌ బారిన పడ్డారు. ‘‘బ్రయాన్‌ చనిపోయే ముందు రోజు కూడా న్యూయార్క్‌ ఫైర్‌ విభాగంలోని ఉద్యోగి కెవన్‌ రూనీ(38) మరణించాడు. ఇతడు కూడా కేన్సర్‌తోనే.. ఇతడు పనిచేసింది కూడా గ్రౌండ్‌ జీరోలోనే.. ‘9/11 సంబంధిత వ్యాధుల’తో ఇప్పటివరకూ 124 మంది మరణించారు. గ్రౌండ్‌ జీరో సహాయక కార్యక్రమాల్లో వేల మంది పనిచేశారు. ఇంకెంతమంది బలవ్వాలో’’ అంటూ యూనిఫైడ్‌ ఫైర్‌ అథారిటీ అధ్యక్షుడు జేమ్స్‌ స్లెవిన్‌ ఆవేదన వ్యక్తం చేశారు.

ఏళ్ల క్రితమే ట్విన్‌ టవర్స్‌ కూలిపోయింది..
ఇక్కడ మాత్రం రోజుకో బతుకు కూలిపోతోంది..
ఇది ఇంకెన్నాళ్లు.. ఇంకెన్నేళ్లు..

– సాక్షి తెలంగాణ డెస్క్‌

మరిన్ని వార్తలు