-

ట్విట్టర్కు గూగుల్ దెబ్బ

6 Oct, 2016 10:53 IST|Sakshi
ట్విట్టర్కు గూగుల్ దెబ్బ
మైక్రోబ్లాగింగ్ వెబ్సైట్ ట్విట్టర్ కొనుగోలుకు టెక్ దిగ్గజాలు మొదట్లో చూపించిన ఆసక్తి ప్రస్తుతం కనబరచడం లేదని తెలుస్తోంది. దీన్ని కొనుగోలు రేసు నుంచి ఇప్పటికే మైక్రోసాప్ట్ తప్పుకోగా, గూగుల్ సైతం బిడ్స్ దాఖలు చేయట్లేదని రిపోర్టు వెలువడుతున్నాయి. మొదట్లో ట్విట్టర్ కొనుగోలుకు గూగుల్, మైక్రోసాప్ట్, సేల్ఫోర్స్.కామ్లు పోటీపడుతున్నాయని వార్తలు వెలువడ్డాయి. అనంతరం వీటి చెంతన మీడియా దిగ్గజం వాల్ట్ డిస్నీ కూడా చేరింది. అమ్మకపు వార్తతో అంతర్జాతీయ మార్కెట్లో భారీగా ఎగిసిన ట్విట్టర్ షేర్లు.. ప్రస్తుతం గూగుల్ కూడా బిడ్స్ దాఖలు చేయడం లేదని రీకోడ్ రిపోర్టు చేయడంతో ఆ కంపెనీ షేర్లు 9 శాతం కిందకి దిగజారాయి.
 
మైక్రోసాప్ట్ అయితే ఇటీవలే లింక్డ్ఇన్ కొనుగోలుచేయడంతో, మరో భారీ డీల్ అవసరం లేదని తప్పుకున్నట్టు తెలిసింది. కానీ ప్రస్తుతం గూగుల్ కూడా ఎందుకు ఈ రేసు నుంచి వైదులుగుతుందో సరియైన కారణాలు తెలియరాలేదు. మరోవైపు ఐఫోన్ దిగ్గజం ఆపిల్ కూడాఈ రేసులో పాల్గొనడం లేదని రీకోడ్ రిపోర్టు వెల్లడించింది. సమర్థవంతమైన కొనుగోలుదారులతో కంపెనీ అమ్మకపు చర్చలు తుదిదశకు వచ్చాయని ట్విట్టర్కు చెందిన అధికారులు పేర్కొంటున్నారు. యూజర్ వృద్ధి మందగించి ఆర్థికనష్టాలతో కొట్టుమిట్టాడుతున్న ట్విట్టర్ను కొనుగోలు చేయడానికి సేల్స్ఫోర్స్.కామ్ మాత్రమే ముందంజలో ఉందని, వాల్ట్ డిస్నీ, ఆల్ఫాబెట్, ఆపిల్లు దీన్ని కొనుగోలుకు బిడ్స్ దాఖలు చేయడానికి పునఃయోచిస్తున్నాయని రాయిటర్స్ పేర్కొంది. అయితే ఈ నెలలోనే ట్విట్టర్ అమ్మకం పూర్తవుతుందని రిపోర్టులు కూడా వెల్లడవుతున్నాయి.
మరిన్ని వార్తలు