ట్విట్టర్ అమ్మేస్తున్నారు!!

24 Sep, 2016 15:06 IST|Sakshi
ట్విట్టర్ అమ్మేస్తున్నారు!!
సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఆర్థిక నష్టాలతో కొట్టుమిట్టాడుతున్న ట్విట్టర్ను ఆ సంస్థ విక్రయించడానికి సన్నద్ధమైందట. ఇప్పటికే వివిధ టెక్నాలజీ కంపెనీలతో ట్విట్టర్ సంప్రదింపులు జరుపుతున్నట్టు కంపెనీకి చెందిన ఒకరు చెప్పారు. ట్విట్టర్ను అమ్మేస్తున్నారూ, అమ్మడం లేదని ఇప్పటికే పలుమార్లు వార్తలు గుప్పుమన్న సంగతి తెలిసిందే. మందగిస్తున్న యూజర్ వృద్ధి, తక్కువగా నమోదవుతున్న వ్యాపార ప్రకటనల ఆదాయాలతో గత కొంతకాలంగా ట్విట్టర్ వందల మిలియన్ డాలర్ల నష్టాలను మూటకట్టుకుంటోంది. పదేళ్ల నుంచి సర్వీసులను అందిస్తున్న ఈ సంస్థ కంపెనీ బిజినెస్ల పరంగా తీవ్రంగా నష్టపోతోంది. దీంతో ఈ కంపెనీ విక్రయించడానికి సన్నద్ధమైంది. అంతర్జాతీయంగా జరుగుతున్న న్యూస్, ఎంటర్టైన్మెంట్, సోషల్ కమెంటరీ వంటి వార్తలను అందించడంలో ట్విట్టర్కు తిరుగులేని ఆధిపత్యం ఉంది. 
 
ప్రముఖ ఆంగ్ల వార్తా సంస్థ కథనం ప్రకారం ట్విట్టర్‌ ఇప్పటికే గూగుల్ వంటి పలు టెక్నాలజీ కంపెనీలతో చర్చలు ప్రారంభించింది.త్వరలోనే గూగుల్ నుంచి బిడ్ దాఖలు కానున్నట్టు తెలుస్తోంది.   దీనిపై ట్విట్టర్‌గానీ, గూగుల్‌ పేరెంట్‌ కంపెనీ అల్ఫాబెట్‌ ఐఎన్‌సీ గానీ స్పందించడానికి తిరస్కరించాయి.. యాహూను కోర్ ఇంటర్నెట్ వ్యాపారాలను సొంతం చేసుకున్న వెరిజోన్ సైతం ఈ బిడ్ చేయనున్నట్టు సమాచారం. ట్విట్టర్ అమ్మక వార్తతో శుక్రవారం కంపెనీ షేర్లు అంతర్జాతీయంగా 19 శాతం మేర జంప్ అయ్యాయి. 2013 తర్వాత ఒక్కరోజులో ఈమేర పెరగడం ఇదే మొదటిసారి. దీంతో ట్విట్టర్ మార్కెట్ విలువ16 బిలియన్ డాలర్లకు ఎగిసింది. ఒకవేళ ఈ కంపెనీని గూగుల్ సొంతం చేసుకుంటే మాజీ గూగుల్ ఎగ్జిక్యూటివ్ ఒమిడ్ కోర్డెస్టనీ ట్విట్టర్కు ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా వ్యవహరించనున్నారు. 
మరిన్ని వార్తలు