సామూహిక అత్యాచారం కేసులో పోలీసుల అరెస్టు

31 Aug, 2013 20:18 IST|Sakshi

ఉత్తరప్రదేశ్లో ఆటవిక రాజ్యం ఉందంటే ఏంటో అనుకుంటాం. కానీ, శనివారం జరిగిన ఓ సంఘటన చూస్తే అది నూటికి నూరుపాళ్లు నిజమని తేలుతోంది. మహిళపై సామూహిక అత్యాచారం జరిగిన కేసులో ఉత్తరప్రదేశ్కు చెందిన ఇద్దరు పోలీసులను అరెస్టు చేశారు. వీరితో పాటు మరో ఇద్దరు నిందితులూ అరెస్టయ్యారు. శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలో నోయిడాలోని సెక్టార్ 105లో పీఏసీ హెడ్ కానిస్టేబుల్ బన్షీరాం శర్మ, కానిస్టేబుల్ సుభాష్ చౌదరి తమ ముగ్గురు స్నేహితులతో కలిసి ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి కార్యాలయంలోకి చొచ్చుకెళ్లి, అక్కడున్న ఓ మహిళపై సామూహిక అత్యాచారం చేశారు.

ఈ సంఘటన గురించి ఎవరికైనా చెబితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయంటూ ఆ వ్యాపారితో పాటు బాధితురాలినీ బెదిరించి, అక్కడినుంచి వెళ్లిపోయారు. అంతేకాదు, పోయేముందు మహిళ వద్ద ఉన్న సెల్ఫోన్ కూడా లాగేసుకున్నారు. కానీ.. పోలీసుల బెదిరింపులకు ఆ మహిళ బెదిరిపోలేదు. రాత్రికి రాత్రే సమీపంలోని ఓ పోలీసు స్టేషన్కు వెళ్లి ఫిర్యాదుచేసింది. కేసు నమోదుచేసి, ఐదుగురు నిందితుల్లో నలుగురిని పట్టుకున్నట్లు ధర్మేంద్ర చౌహాన్ అనే పోలీసు అధికారి తెలిపారు. పోలీసులిద్దరితో పాటు అరుణ్, బంటీ అనే వారిని అరెస్టు చేయగా, జీతు అనే మరో నిందితుడు పరారీలో ఉన్నాడు. నలుగురూ తమ నేరాన్ని అంగీకరించారు. సంఘటన సమయంలో ఉపయోగించిన పోలీసు జీపును, బాధితురాలి సెల్ఫోనును స్వాధీనం చేసుకున్నారు.

మరిన్ని వార్తలు