‘బాంబు’ జోక్ ఎంతపని చేసింది!

21 Jul, 2016 15:57 IST|Sakshi
‘బాంబు’ జోక్ ఎంతపని చేసింది!

న్యూఢిల్లీ: వారిద్దరు స్నేహితులు.. ఇండోర్‌ చెందిన వారు గురువారం ఢిల్లీ విమానాశ్రయం నుంచి సొంతూరికి బయలుదేరారు. విమానం ఎక్కేందుకు క్యూలో నిలబడినప్పుడు ఓ మిత్రుడు సరదాగా జోక్ చేశాడు. ‘దయచేసి.. నేను బాంబు తీసుకెళ్లవచ్చా’ అని స్నేహితుడితో అన్నాడు. ఈ మాట ఇండిగో ఎయిర్‌లైన్ సిబ్బంది చెవిన పడింది.

వారేదో నిజంగా ‘బాంబు’తో ఎక్కుతున్నట్టు హడలిపోయిన సిబ్బంది వెంటనే సీఐఎస్‌ఎఫ్‌ (సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్‌)కు ఈ విషయాన్ని చేరవేశారు. ఎయిర్‍పోర్ట్ భద్రతను పర్యవేక్షించే సీఐఎస్ఎఫ్‌ బలగాలు వెంటనే ఆ స్నేహితులను చుట్టుముట్టి అదుపులోకి తీసుకున్నాయి. వారిని చాలాసేపు విచారించి.. ప్రశ్నించి.. వారి వద్ద ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లేవని నిర్ధారించికున్న తర్వాత ఆ ఇద్దరు వ్యక్తులని వదిలేశారు. కానీ, ఆ ఇద్దరు సరదాగా వేసిన జోక్.. ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో చిన్నపాటి బాంబు కలకలాన్ని రేపింది. సరదాకు ‘బాంబు’ అన్న పదాన్ని ఉచ్చరించినందుకు చిక్కుల్లో పడ్డ ఆ ఇద్దరు స్నేహితులు బతుకు జీవుడా అంటూ బయటపడ్డారు.

ఇటీవలికాలంలో ఉగ్రవాద ముప్పు భారీగా పొంచి ఉన్న నేపథ్యంలో ఏ చిన్న అనుమానమున్నా.. విమానాశ్రయంలో కట్టుదిట్టమైన తనిఖీలు చేస్తున్నారు. గత నెల ఓ కశ్మీరి మెడికల్ విద్యార్థిని కూడా ఇలాగే చిక్కుల్లో పడ్డారు. ఆమె బ్యాగుపై ‘ఇందులో బాంబు ఉండొచ్చు’ అన్న గ్రాఫిటీ ఉండటంతో సీఐఎస్‌ఎఫ్ సిబ్బంది ఆమెను అదుపులోకి తీసుకొని ప్రశ్నించి వదిలేశారు.

మరిన్ని వార్తలు