గాంధీలో స్వైన్‌ఫ్లూతో ఇద్దరు మహిళలు మృతి

11 Sep, 2015 23:24 IST|Sakshi

గాంధీ ఆస్పత్రి: సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో స్వైన్‌ఫ్లూతో చికిత్స పొందుతున్న ఇద్దరు మహిళలు మృత్యువాత పడ్డారు. వీరిలో ఒకరు బాలింత. గాంధీ వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్‌జిల్లా శంకరంపేట మండలం గవ్వలపల్లికి చెందిన మరియమ్మ (26) ఈనెల 2వతేదిన తీవ్రమైన జ్వరంతో గాంధీ ఆస్పత్రిలో చేరింది. నమూనాలు సేకరించి నిర్ధారణకు పంపగా స్వైన్‌ఫ్లూ పాజిటివ్ వచ్చింది. నిండు గర్భిణీ అయిన మరియమ్మకు పురిటి నొప్పులు రావడంతో ఈనెల 9వతేదిన సిజేరియన్ శస్త్రచికిత్స నిర్వహించారు. ఆమె ఇద్దరు మగ శిశువులకు జన్మనిచ్చింది. శిశువులను చిన్నపిల్లల వార్డుకు తరలించి వైద్యసేవలు అందిస్తున్నారు.

ఏఎంసీవార్డులో చికిత్స పొందుతున్న మరియమ్మ శుక్రవారం మృతి చెందింది. అలాగే నగరంలోని ముషీరాబాద్‌కు చెందిన అక్తర్‌బేగం (50) ఈనెల 5వ తేదీన తీవ్రజ్వరంతో గాంధీ ఆస్పత్రిలో చేరింది. నమూనాలు సేకరించి నిర్ధారణకు పంపించారు. చికిత్స పొందుతు ఈనెల 6వతేదిన మృతిచెందింది. అయితే ఈనెల 9వతేదీన అందిన నివేదికలో అక్తర్‌బేగంకు స్వైన్‌ఫ్లూ సోకినట్లు నిర్ధారణ అయింది. రంగారెడ్డిజిల్లా జహీరాబాద్‌కు చెందిన జగ్గమ్మ (20) రెండు రోజుల క్రితం స్వైన్‌ఫ్లూ లక్షణాలతో గాంధీ ఆస్పత్రిలో చేరింది. శుక్రవారం అందిన నివేదికలో స్వైన్‌ఫ్లూ నిర్ధారణ అయింది. మరో ఇద్దరు స్వైన్‌ఫ్లూ లక్షణాలతో గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరి శాంపిల్స్ సేకరించి వైద్యపరీక్షలకు పంపినట్లు వైద్యులు తెలిపారు. మారిన వాతావరణ పరిస్థితుల నేపధ్యంలో స్వైన్‌ఫ్లూ మహమ్మారి విజృంభిస్తోందని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని గాంధీ వైద్యులు సూచించారు.

మరిన్ని వార్తలు